గణపతి బప్పా మోరియా: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిమజ్జనోత్సవం; ట్రాఫిక్ ఆంక్షలు!!
వరంగల్: గణపతి బప్పా మోరియా అంటూ ఊరు వాడ సంతోషంగా గణేష్ నిమజ్జనానికి తరలి వెళ్లే సమయం ఆసన్నమైంది. హైదరాబాద్ లోనే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా లోనూ, గ్రేటర్ వరంగల్ పరిధిలోనూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన గణేశ్ మండపాల నిర్వాహకులు, నిమజ్జనాలకు సిద్ధమవుతున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరగనున్న గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేసిన వరంగల్ అధికార యంత్రాంగం
గణేష్ శోభాయాత్రకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టడమే కాకుండా, ట్రాఫిక్ నిబంధనలను విధించారు. 21 చెరువులను సిద్ధం చేసిన అధికారులు నిమజ్జనోత్సవానికి కావలసిన విధంగా చెరువుల శుద్దీకరణ, పారిశుధ్యం, విద్యుదీకరణ పనులను నిర్వహించారు. ఇప్పటికే నిమజ్జనం చేయడానికి వచ్చే వినాయక విగ్రహాలకు సంబంధించి రూట్ మ్యాప్ లను మండపాల నిర్వాహకులకు అందించిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశారు.

వరంగల్ ట్రై సిటీస్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
ఇక ట్రై-సిరీస్ పరిధిలో వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి శనివారం ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. భారీ వాహనాలను నగరంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. మొత్తం గ్రేటర్ వరంగల్ లో మూడు వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అంచనా వేసిన అధికారులు, 31 క్రేన్ లను ఏర్పాటు చేశారు. 50 మంది గజ ఈతగాళ్లను, 48 తెప్పలను కూడా అందుబాటులో ఉంచారు. మొత్తం 1050 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

వరంగల్ లో నిమజ్జనం చేసే చెరువులు ఇవే
వరంగల్ ప్రాంతంలోములుగు రోడ్డు కోట చెరువు, దేశాయిపేట చిన్న వడ్డేపల్లి చెరువు, రంగ సాయి పేట బెస్తం చెరువు, ఉర్సు రంగసముద్రం, ఖిల్లా వరంగల్ అగర్త, గొర్రెకుంట కట్టమల్లన్న, మామునూరు, తిమ్మాపూర్ చెరువులలో నిమజ్జనం చేస్తారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో గణేష్ నిమజ్జనానికి పని చేస్తున్నారు. గణేష్ నిమజ్జనం సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విగ్రహాలను వాహనాలలో ఎక్కించే సమయంలో, కరెంటు తీగలను పక్కకు తొలగించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఆటపాటలతో భక్తిభావంతో గణనాధుడికి వీడ్కోలు
మొత్తానికి తొమ్మిది రోజులుగా పూజలందుకున్న గణనాథులు ఈరోజు నిమజ్జనానికి తరలి వెళ్తున్న వేళ శోభాయాత్రను తిలకించడానికి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భక్తులందరూ ఉత్సాహంతో ఉన్నారు. జై జై గణేశా అంటూ జయజయధ్వానాలతో, గణపతి బప్పా మోరియా అంటూ ఆటపాటలతో గణనాథుడికి వీడ్కోలు చెప్పి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోనున్నారు.












Click it and Unblock the Notifications