వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కథలురాయడం అపూర్వం: గూడూరి సీతారాం

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌ జిల్లాలో పుట్టి పెరిగిన గూడూరి సీతారాం తెలంగాణలోని తొలితరం కథారచయిత. ఆయన జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి. నారాయణరెడ్డి బాల్య మిత్రుడు. ఆయన తెలంగాణ యాసలో, భాషలో కథలు రాశారు. ఆయనను ప్రముఖ కథారచయిత కాలువ మల్లయ్య ఇంటర్వ్యూ చేశారు.

తొలితరం తెలంగాణ కథపై మీ అభిప్రాయం ఏమిటి?
ఆ కాలంలో కథకులే తక్కువ. కథలు రాసి జేబులో పెట్టుకొని తిరిగేది. పత్రికలు లేవు. దేనికి పంపాలో తెలిసేది కాదు. సాహిత్య సంస్థలు కూడా కథలను వేయలేదు. కవి సమ్మేళనాలు బాగా జరిగేవి. సాహిత్య సభలంటే కవి సమ్మేళనాలే అన్నట్టుండేవి. విద్యార్థులైతే పాఠశాల మ్యాగజైన్లలో రాసేది. ఆ కాలంలో ప్రభ, ఆంధ్రపత్రిక వీక్లేలు వచ్చేవి. ధర రెండణాలుండేది. వచ్చినవరకు కథల్లో రజాకార్ల వ్యతిరేక కథలు, బూర్జువాలను వ్యతిరేకించేవి, సామాన్య జీవితం గురించి రాసినవి వచ్చేవి. తెలంగాణలో శరత్‌, ప్రేంచంద్‌ అనువాద కథలు దొరికేవి. వాటి ప్రభావంతో కథలు రాసేవారు. మాలపల్లి, నారాయణరావు నవలలు లభించేవి. మునిమాణిక్యంగారి కాంతం కథలు చదివేవాళ్లం. ఇవన్నీ చదివిన ప్రేరణతో మాకు తెలిసిన గ్రామీణ జీవిత నేపథ్యంలోంచి కథలు రాసేవాళ్లం. అప్పుడు కథలు రాయడమంటే ఓ అపురూప విషయమే.

ప్రస్తుతం వస్తున్న తెలంగాణ కథలు ఎలా వుంటున్నాయి?
చాలా వైవిధ్యభరితంగా వుంటున్నాయి. వస్తున్న కథల్లో తెలంగాణ వ్యధాభరిత జీవితం చిత్రితమవుతున్నది. గ్రామాల్లో ఈ కథల్లో చిత్రించినంత అధ్వాన్న జీవితం లేదనుకుంటాను. కొన్ని కుటుంబాలు ఉండవచ్చు. ఇదే మొత్తం జీవితం కాదు గదా! అయితే అట్టడుగు ప్రజల జీవితాల గురించి అద్భుతంగా కథలు వస్తున్నాయి. కథారచయితలు తమ చుట్టూ వున్న జీవితాన్ని బాగా చిత్రిస్తున్నారు. ఈ కథలు రాసేవారు గ్రామీణ ప్రాంతాల నుంచి అట్టడుగు కులాలు, బిసి కులాల నుంచి ఎక్కువ రావడం వల్ల సాధ్యమైంది. ఇదింకా విస్తరిస్తూ మరిన్ని కోణాల్లోంచి కథలు వస్తాయన్న నమ్మకం నాకుంది.

మీరు కథలు రాయడానికి ప్రేరణ ఏమిటి?
నిత్య జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు, ఫ్యూడల్‌ భూస్వాముల దౌర్జన్యాలు, కులపీడన, గ్రామపెత్తందార్ల పెద్దరికం, కుల పెద్దల పెత్తనం, రజాకార్ల సంఘటనలు - ఇవన్నీ నన్ను కలం పట్టేట్టు చేశాయి. అప్పుడప్పుడే చవిచూస్తున్న నాగరిక భావాలు, సబ్బులు, పౌడర్లు రావడం.. కొబ్బరినూనెలాంటివి కొత్తగా రావడం - ఇవన్నీ నాకు నాగరిక వస్తువులే. ముప్పై, నలభై ఊళ్లను కలిపితే ఓ సినిమా టాకీసుండేది. సినిమాకు పోవాలంటే ఎనిమిది కిలోమీటర్లు నడిచిపోయేవాళ్లం. సినిమా ప్రభావం అప్పుడప్పుడే గ్రామాలకు సోకి కొన్ని చెడు అలవాట్లు పెరిగాయి. మొత్తంగా నేను అనుభవించిన జీవితం, పల్లె బతుకు, నా చుట్టూ ఉన్న సంఘటనలు, పీడిత నేపథ్యం - ఇవన్నీ నేను రచనలు చేయడానికి దోహదం చేశాయి.

తెలంగాణ పూర్తి మాండలిక రచనలపై మీ అభిప్రాయం ఏమిటి?
ఆ కాలంలో వ్యవహారిక భాషలో పుస్తకాలు దొరకడం తక్కువ. దొరికితే గ్రాంధిక భాష సదకావ్యాలు దొరికేవి. నిత్య జీవితంలో మాత్రం మాండలిక భాషా ఉపయోగం ఉండేది. మనకు తెలిసిన, వచ్చిన భాషలో రాస్తే అందరికీ అర్థమవుతుందన్న అభిప్రాయం ఉండేది. మన సామాజిక జీవితాన్ని ప్రతిబింబించడానికి ఎవరి గురించయితే రాస్తున్నామో వాళ్ల భాషలో రాయాలనుండేది. తీసుకున్న వస్తువు, సంఘటనలు, పనిముట్ల లాంటివి - అన్నీ మాండలికమైనవే. మాండలికంలో రాస్తే మంచి ప్రభావం చూపగలవన్న అభిప్రాయం ఉండటం వల్ల అందులోనే రాసేవాళ్లం. అప్పుడు మాండలికంలో రాసేవాళ్లు చాలా తక్కువ కాబట్టి నాకు తెలిసిన నా భాషలో రాస్తే అచ్చవుతాయని రాశాను. అది నాకెంతో సంతృప్తినిచ్చింది.

తెలంగాణ తొలితరం, ఈ తరం కథల మధ్య తేడా ఏమిటి?
తొలితరంలో వస్తువైవిధ్యం చాలా తక్కువగా ఉండేది. రాసే వాళ్లే తక్కువ. విస్తృతంగా తెలుసుకోవడానికి పత్రికలు, రేడియో ఉండేవి కావు. అప్పుడు గెలుచుకున్న జీవితాలు తక్కువ. అప్పుడప్పుడే చదువుకోవడం మొదలైంది. కథల్లో చిత్రించే పాత్రలు ఆ కథలను చదివే అవకాశమే లేదు. అప్పుడు మధ్యతరగతే లేదు. కొద్దిగా బాగా బతికితే ఆ కులంలో పెద్దన్నమాటే. అందువల్ల ఉన్నవాళ్లు లేనివాళ్లు అనేవి రెండే. అందుకోసం కొన్ని కోణాల్లోనే కథలు వచ్చేవి. తెలంగాణలో డబ్బున్నవాడు కులపెద్ద అయ్యేవాడు. ఇప్పుడు పెరిగిన మధ్యతరగతి, కొంతైనా పెరిగిన విద్య, ప్రసార సాధనాలు, పత్రికల ద్వారా, సినిమాల ద్వారా పరిచయమై వైవిధ్య పూరితంగా విస్తృతంగా సాహిత్యం వస్తున్నది.

బహుజన సాహిత్యం పరిస్థితి ఏమిటి?

ఆ కాలంలో బహుజనులకు చదువు లేదు. సాహిత్యం లేదు. ఎస్సీల్లో అంటరానితనం ఉండేది. చదువు అసలు ఉండేదేకాదు. జానపద సాహిత్యం మాత్రం దళితుల్లోనే బాగా ఉండేది. అప్పుడు మాకు తెలియకుండానే బహుజనుల గురించి కథలు రాశాం. ఊళ్లో జరిగిన సంఘటనలపై పాటలు కట్టేవాళ్లు. జనంలో ప్రచారంలోకి వచ్చేవి. మోటలు కొడుతూ, నాగలి దున్నుతూ, కలుపు తీస్తూ పాటలు పాడేవాళ్లు. ఇప్పుడు ఓ దృక్పథంతో, అవగాహనతో బహుజన సాహిత్యం విరివిగా వస్తున్నది. మరింతగా రావాల్సిన అవసరముంది. వస్తుందన్న నమ్మకమూ ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X