Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విప్లవ సాహిత్యం ఒక పాయ మాత్రమే: కాలువ మల్లయ్య

కాలువ మల్లయ్య కలానికి అలుపు సొలుపూ లేదు. కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలోని ఫెర్టిలైజర్‌ కంపెనీలో కెమిస్టుగా పని చేస్తున్న ఆయన విస్తృతంగా కథలు, నవలలు, వ్యాసాలు రాస్తున్నారు. ఆయన రాసిన 'బతుకు పుస్తకం' అనే నవలకు 'ఆటా' అవార్డు లభించింది. 1980 ప్రాంతంలో తన రచనా వ్యాసంగం ప్రారంభించిన మల్లయ్య మొదట విప్లవ కథనే రాశారు. ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ''విప్లవోద్యమం ఒక ఊపులో ఉన్న ఆ కాలంలో కలం పట్టినవారెవరైనా దాని నుంచి తప్పించుకోవడం సాధ్య పడలేదు. విప్లవ కథలు రాస్తూనే సామాజిక పరిణామాలను, కుల వ్యత్యాసాలను, మూఢాచారాల వ్యతిరేకతను, గ్రామాల్లో సంభవిస్తున్న మార్పులను ప్రతిబింబించే కథలు రాశాను'' అని ఆయన అన్నారు.

'అవ్వతోడు గిది తెలంగాణ' అనే శీర్షికతో రచనలు, వందకు పైగా తెలంగాణ మట్టి కథలు రాసిన కాలువ మల్లయ్య తెలంగాణ భాషకు తన రచనల్లో స్థానం కల్పిస్తున్నారు. తెలంగాణ భాషను ఉపయోగించడానికి గల కారణాన్ని ప్రశ్నించగా- ''సాధారణంగా సంస్కృత సాహిత్యంలో నీచ పాత్రలకు ప్రాకృతం, ఉత్తమ పాత్రలకు సంస్కృతం వాడేవారు. ఆ రకంగా ప్రజల భాషను చిన్న చూపు చూశారు. వ్యవహారిక భాష పేరు మీద కొద్ది మంది శిష్టుల భాషను వ్యవహారిక భాషగా చెలామణి చేస్తున్నారు. అయితే మనం ఎవరి గురించయితే రాస్తున్నామో, వాళ్లంతా పైన పేర్కొన్న శిష్టులు కారు. వాళ్లు మాట్లాడే భాష కూడా పైన పేర్కొన శిష్ట వ్యవహారికం కాదు. దాన్ని గ్రామ్యమని, మాండలికమని కించపరిచి చాలా కాలం ఆ భాష పుస్తకాలకు ఎక్కకుండా అడ్డుకున్నారు'' అని తన ఆవేదనను వ్యక్తం చేశారు.

తన రచనా వ్యాసంగంపై, తన కథలపై, తెలుగు సాహిత్య పోకడలపై, రాజకీయ ఉద్యమాలపై, వాటి ప్రభావంతో వచ్చిన సాహిత్యోద్యమాలపై ఆయన రెండు గంటల పాటు 'ఇండియా ఇన్ఫో' ప్రతినిధితో మాట్లాడారు. ''వెనుకబడిన తెలంగాణ ప్రజల భాషను సాహిత్యానికి పనికి రాదంటూ వ్యవహారికంలోనే రాయాలని అన్నవారున్నారు. గురజాడ కన్యాశుల్కం భాష, రావిశాస్త్రి, కరుణకుమార, మాగోఖలే కథల భాష అర్థం కాలేదంటే నమ్మేవాళ్లున్నారా? తెలంగాణ భాష అర్థం కావడం లేదనడం, రాయకుండా చేయడంలో వివక్ష ఉందేమో! ఎవరేమనుకున్నా గల గల పారే సెలయేరు లాంటి సజీవ భాష అయిన ప్రజల భాషలో రాసినప్పుడే రచనలకు సార్థకత చేకూరుతుందని, అదే గొప్ప రచన అవుతుందని నమ్మి ఆ ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకుని నేను రచనలు చేస్తున్నా. నిజానికి, నేను కథల్లో వాడుతున్న భాష ఎవరి భాషో కాదు, నా తలిదండ్రుల భాష, నా ఊరి ప్రజల భాష, తెలంగాణ ప్రజల భాష'' అని ఆయన చెప్పారు. ''నవలైనా, కథయినా, చివరికి వ్యాసమైనా ప్రాంతీయ ముద్ర కలిగి విశ్వజనీన దృక్పథంతో రాసినవే'' అని చెప్పుకున్నారాయన.

ఫ్యూడల్‌ వ్యవస్థ పతనాన్ని ప్రతిబింబించే 'ఆంబోతు', 'యుద్ధభూమి', 'దొరగారి గడి' వంటి కథలు, 'ఈ భూమి నాది', 'వెలి' వంటి విప్లవ సాంస్కృతిక కథలు రాశారు మల్లయ్య. మొదట విస్తృతంగా విప్లవ కథలు రాసిన మీరు ఇతర ఇతివృత్తాలపై దృష్టి సారించడానికి గల కారణమేమిటి అని అడిగినప్పుడు- 'విప్లవోద్యమంతో ప్రభావితమై రాసిన కథలతో పాటు మొదట్నుంచి సామాజికాంశాలపై కూడా రచనలు చేస్తున్నాను. వృత్తిపనివారలపై దాదాపు వంద కథలు నేను తప్ప ఎవరూ రాయలేదు. ఒక ఆర్థిక సమానత్వంతోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావు. మన దేశంలో కుల సమస్య అతి ప్రధానమైంది. ఎన్నో సాంఘిక సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. అలాంటప్పుడు కేవలం ఆర్థిక సమస్యల పరిష్కారంతోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని నేను భావించలేదు. అందుకే మిగతా కథలు కూడా రాశాను'' అని చెప్పారాయన.

విప్లవ కథ తెలుగు సామాజిక కోణాలను ప్రతిబింబించలేదని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నిస్తే ''మహాశ్వేతా దేవి మాదిరిగా తెలుగు విప్లవ కథా రచయితలు సమగ్ర జీవితాన్ని ప్రతిబింబించలేదు. సమాజాన్ని ఒక సిద్ధాంత చట్రం పరిధిలో మాత్రమే చూశారు. ఈ కథే కనుక స్త్రీ, దళిత, ఇతర సమస్యలను, ఆ సెక్షన్ల ఆకాంక్షలను సమగ్రంగా పట్టించుకుని వుంటే స్త్రీ, దళిత, బహుజన, మైనారిటీ వాద సాహిత్యాలు రావాల్సిన అవసరం వుండేది కాదు. తెలుగు సాహిత్యంలో విప్లవ కథ కన్నా ఎక్కువ జీవితాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే కథలు ఇటీవలి కాలంలో రావడానికి స్త్రీ, దళిత, బహుజన, మైనారిటీ ఉద్యమాలు దోహదం చేశాయి'' అని ఆయన జవాబిచ్చారు. అంటే, విప్లవ కథలో లోపాలున్నాయని భావిస్తున్నారా అని ప్రశ్నిస్తే- ''ఇది విప్లవ కథను తక్కువ చేయడం కాదు. ఇంకా అనేక కోణాలు కథల్లో ప్రతిబింబించాల్సిన అవసరం ఉన్నదనే గ్రహింపు మాత్రం వచ్చింది'' అని కాలువ మల్లయ్య సమాధానమిచ్చారు.

అన్ని సమస్యలు విప్లవోద్యమం ద్వారా సఫలమవుతాయనే వాదనను మీరు వ్యతిరేకిస్తున్నారా? అని అడిగితే- ''ఏ కాలంలోనైనా ఉద్యమాలు ముందుకు వచ్చినప్పుడు విప్లవోద్యమం సర్వరోగ నివారణి అని చెప్పుతున్నారు. కాని, విప్లవోద్యమంతో పాటు సమాంతర ఉద్యమాలు ఉండనే వుంటాయి. ఉదాహరణకు-

విప్లవోద్యమం రాక ముందు వైయక్తిక ఉద్యమాలు వచ్చాయి. విప్లవోద్యమ కాలంలో అంబేడ్కర్‌ ఉద్యమాలు, బిసి, ఎస్‌సి కులాల తిరుగుబాట్లు ఏదో మేరకు ఉన్నాయి. 1969లో వచ్చిన ప్రత్యేక తెలంగాణోద్యమం కూడా ఎంతో మందిని ప్రభావితం చేసింది. ఉద్యమ ఫలితాలు ఎలా వున్నా ఉద్యమాల్లో పాల్గొన్నవారు వివిధ పార్టీలో నాయకులుగా ఎదిగారు'' అని వివరించారాయన.

'బతుక పుస్తకం' నవలల్లో కొండలరావు పాత్రను ఉన్నతంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కాలువ మల్లయ్య. అలాగే, ఇటీవలి రాసిన కథల్లో గ్రామాల్లో గతంలో వున్న మానవ సంబంధాల పట్ల అభిమానం ప్రదర్శిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ- 'మీరు ఫ్యూడల్‌ సంబంధాలను ఇటీవలి కాలంలో ఉన్నతీకరించే ప్రయత్నం చేస్తున్నారా?'' అని అడిగితే- ''నాకు ఫ్యూడల్‌ వ్యవస్థ మీద, సమాజం మీద ఎప్పుడూ సదభిప్రాయం లేదు. ఆ ఫ్యూడల్‌ కుల వ్యవస్థ పీడనను నేనూ అనుభవించాను. అయితే గ్రామాలకు దూరం కావడం వల్ల కృత్రిమమైన నగర సమాజం పోకడలు చూసిన తర్వాత గ్రామాలపై ప్రేమ పెరడం సహజమే. నేను ఫ్యూడల్‌ వ్యవస్థను ఎక్కడా సమర్థించలేదు. అయితే, ఫ్యూడల్‌ వ్యవస్థలోని కాస్తా మంచి కూడా అంతరించి మానవ సంబంధాలు మృగ్యమై పోతున్నాయనే ఆవేదన నా రచనల్లో వుంది'' అని అన్నారు కాలువ మల్లయ్య.

కాలువ మల్లయ్య ఇరవై యేళ్ల కాలంలో ఐదు వందలకు పైగా కథలు రాశారు. 'భూమి పుత్రులు', 'సాంబయ్య చదువులు', 'మాట్లాడే బొమ్మలు', 'బతుకు పుస్తకం', 'నీ బాంచెన్‌ కాల్మొక్త', 'ఊరంటే..', 'దుఃఖం' వంటి తొమ్మిది నవలలు రాశారు. వీటితో పాటు వ్యాసాలు రాశారు. కాలువ మల్లయ్య విస్తృతంగా రాయడాన్ని కూడా కొందరు తప్పు పడుతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావించినప్పుడు- ''తెలిసిన జీవితం, జీవితానుభవాలు విస్తృతం. పల్లె, పట్టణ జీవితాలు, వ్యవసాయ కూలీ, రైతు కుటుంబంలోంచి వచ్చి, మధ్య తరగతి, చదువుకున్న ఉద్యోగిగా ఎదగడంలో జీవితాన్ని గెల్చుకున్న క్రమంతో పాటు అనేక జీవితానుభవాల సారం వున్నాయి. పోతే, నేను రాస్తున్న సమయంలో ఏ పత్రిక తిరిగేసినా విశాఖ బీచీలు, విజయవాడ జంక్షన్లు, తిరుపతి అనుభవాలు లాంటివి తప్ప తెలంగాణ గురించి కనపడింది తక్కువ. ఇంత జీవితం, సముద్రమంత వస్తువు, జీవిత సంఘర్షణ వుండగా, అద్భుతమైన చారిత్రక, సాంస్కృతిక నేపథ్యంలో వుండగా, భాష వుండగా తెలంగాణా గురించి ఎందుకు రచనలు రావడం లేదనే ప్రశ్న వేసుకుని ఎంతో వేదనకు గురయ్యాను'' అని వివరించారాయన. ''నేను పుట్టిన తెలంగాణలోని జీవితాలను, సంస్కృతిని, భాషను ప్రేమించి వాటిని విస్తృతంగా సాహిత్యంలోకి ఎక్కించాలనే ఉద్దేశ్యంతోనే విస్తృతంగా రాస్తున్నా. ప్రతి కథకు, నవలకు వెనుక ఎంతో మథనం, తపనలతో పాటు నా ప్రాంత జీవితం అక్షరబద్దం కావాలనే ఉద్దేశ్యం వున్నాయి. సురవరం ప్రతాప రెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్రను సాహిత్యం ఆధారంగానే రాయగలిగాడు. రేపు తెలంగాణ సాంఘిక చరిత్ర రాయడానికి కావాల్సిన ముడిసరుకునంతా నా నవలల్లో, కథల్లో పొందు పరుస్తున్నా. బహుశా, ఇంకొకరెవరైనా ఇంకొంత విస్తృతంగా తెలంగాణ జీవితాన్ని రాఇ వుంటే నేను ఇంత విస్తృతంగా రాసే వాడిని కాదేమో! పేరు కోసమో, ఆషామాషిగానో నేను రాయడం లేదు. ఒక దృక్పథానికి కట్టుబడి రచనలు చేస్తున్నా. అందుకు తగినట్లుగానే నా రచనలకు ఆదరణ లభిస్తున్నది'' అని చెప్పారాయన.

తెలంగాణలో విప్లవ సాహిత్యాన్ని మాత్రమే ప్రచారం చేయడం వల్ల విప్లవేతర సాహిత్యం మరుగున పడిపోయిందని భావిస్తున్నారా? అని ప్రశ్నిస్తే- 'రకరకాల సాహిత్యం వస్తున్నా అనేక కారణాల వల్ల విప్లవ సాహిత్యమొకటే తెలంగాణ సాహిత్యమని కొందరు తెలిసీ తెలియక చేసిన విమర్శల వల్ల, రాసిన రాతల వల్ల తెలంగాణ కథకు కొంత నష్టం జరిగిన మాట వాస్తవమే. తెలంగాణలో విప్లవోద్యమ సాహిత్యం ఒక ముఖ్యమైన పాయే అయినప్పటికీ అదే మొత్తం కాదు; సంపూర్ణం కూడా కాదు. తెలంగాణలో మొదటి నుంచీ జీవిత వ్యాఖ్యాన సాహిత్యం కూడా విరివిగానే వచ్చిందన్న విషయం గమనించాల్సిన అవసరం వున్నది'' అని చెప్పారు కాలువ మల్లయ్య.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+