రాజకీయ గుట్టు విప్పిన 'మట్టిపాట'

ఇటీవల అభివృద్ధిపై ఒక సర్వే నివేదిక వెలువడింది. భారతదేశంలోని పట్టణాల్లో పేదరికం పెరుగుతుండగా, గ్రామాల్లో తగ్గుతున్నదని ఆ నివేదిక బయటపట్టిన విషయం. దీని ఆధారంగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయనే నిర్ణయానికి ఆ నివేదిక వచ్చింది. ఈ నివేదిక సారాంశాన్ని పత్రికలో చదివినప్పుడు ఎందుకో నమ్మబుద్ది కాలేదు. నిజంగానే పల్లెలు అభివృద్ధి పథాన నడుస్తుంటే దేశం ఇలా అధోగతి పాలెందుకవుతున్నది, రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనే ప్రశ్నలు ఉదయించాయి. ఒక సమాధానం మాత్రం దొరికింది. దాన్నే ఏనుగు నరసింహారెడ్డి ఒక కవితలో.
'పల్లెలేల తరిగె పట్నమేల పెరిగె
తెలివి తోడ జూడ తేటపడు,
ప్రపంచ బ్యాంకు బాకు పల్లె బొండిగ తించె' అని అంటాడు.
పల్లెలు విధ్వంసమవుతూ, వృత్తులు నశిస్తూ వుంటే ఉపాది కోసం పట్నాలకు వలసలు పెరుగుతున్నాయి. ఈ స వలసల క్రమంలో పేదలంతా పట్నాలు చేరుతున్నారు. పట్నాల్లో నగరాల్లో మురికివాడలు పెరుగుతున్నాయి. దీంతో నగరాల్లో పేదరికం పెరిగి, గ్రామాల్లో తగ్గుతున్నదేమోనని అనిపించింది. అదే విషయాన్ని నరసింహారెడ్డి పద్యం నర్మగర్భితంగా వెల్లడిస్తుంది. విప్పి చెప్పడం కవిత్వ లక్షణం కాదు గొప్పతనం అక్కడే వుంది. ఆర్థిక నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు అందుకోనటువంటి కోనాలను, చూడలేని విషయాలను తెలంగాణ కవి అందుకుంటున్నాడు. చూస్తున్నాడు.
ఆ వలసల క్రమాన్ని కూడా కవి
'పంటలన్ని పండి పట్నాలు జేరెను
చదివినోల్లు ఊళ్లు వదిలినారు
ఎండు చేపలు తప్ప ఏముంది మా వూర' అని చెప్పాడు.
పల్లెల విధ్వంసాలకు కారణమవుతున్న రాజకీయాల గుట్టు కూడా ఏనుగు నరసింమారెడ్డి విప్పాడు. ప్రపంచీకరణ మాయ పల్లెలు గండు పిల్లుల్లా మింగుతున్న వైనాన్ని ఆయన తన పద్యాల్లో చూపాడు. 'పల్లె బతుకు మాది పాడుగాను' అనే మకుటం వ్యతిరేకార్ధం ఇస్తున్నట్లు కనిపిస్తున్నా సాధరణంగా గ్రామీణులు యాష్ట పడి వాడే పదబంధాల మాదిరిగానే వుంది. మొత్తం మీద మంచి పద్యాలను చదివిన అనుభూతిని ఏనుగు నరసింమారెడ్డి 'మట్టిపాట' పుస్తకం మిగిలిస్తుంది.
- కాసుల ప్రతాపరెడ్డి