India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినారె భళారే: ఒక యుగం ముగిసింది

By Pratap
|
Google Oneindia TeluguNews

తెలుగు సాహిత్యంలో ఓ యుగం ముగిసింది. సినారెగా సాహిత్య లోకం ప్రేమగా పిలుచుకునే సింగిరెడ్డి నారాయణ రెడ్డి కన్నుమూశారు. ఓ సాహితీ దిగ్గజం చుక్కల్లో చేరింది. భౌతికంగా లేకపోయినా ఆయన సాహిత్యం తెలుగులో ప్రకాశమానం అవుతూనే ఉంటుంది.

నిజానికి, సి. నారాయణ రెడ్డి గురువులకే గురువు. ఆయనకు ఉన్న శిష్యగణం లెక్కకు మిక్కిలింది. తన తరం నుంచి ఈ తరం వరకు ఆయనతో విడదీయరాని సంబంధాన్ని ఏర్పరుచుకుంది. యువకులతో ఆయన కలం కలిపి, కవిత్వాన్ని జాలువారించారు.

విప్లవ కవిత్వం తెలుగు సాహిత్యాన్ని ఏలుతున్న కాలంలో ఆయన అందుకు విరుద్దంగా తనదైన ముద్రను వేస్తూ వెళ్లారు. విశ్వనాథ సత్యనారాయణ సంప్రదాయ సాహిత్యానికి పట్టం కడితే, ఆధునిక భావజాలాన్ని పుణికిపుచ్చుకుని తెలుగు కవిత్వంలో సినారె తన ప్రాశస్త్యాన్ని చాటుకున్నారు.

తెలుగులో రెండో వారు...

తెలుగులో రెండో వారు...

తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ తర్వాత భారతదేశంలోని అత్యున్నత సాహిత్య పురస్కారం అందుకున్న సాహితీవేత్త సి. నారాయణ రెడ్డి మాత్రమే. తెలంగాణలోని వెనకబడిన ప్రాంతం నుంచి దేశవ్యాప్తంగా తన ఉనికినీ ఆస్తిత్వాన్ని చాటుకున్న ఘనత ఆయనది.

శ్రీశ్రీ ఇలా...

శ్రీశ్రీ ఇలా...

సినారె భళారే
అన్నిట్లో హుషారే
సినీమా రెడీ మేడ్
సరుక్కీ తయారే అని మహాకవి శ్రీశ్రీ ఆయన మీద వ్యంగ్యంగా రాశారు. ఒక రకంగా సినీ రంగంలో సినారె అప్పటికే స్థరపడిపోయిన గేయరచయితలకు తన పాటల ద్వారా సవాల్ విసిరారు. కొత్త డిక్షన్‌ను తెలుగు సినీ సాహిత్యంలో ప్రవేశపెట్టారు.

సినీ గేయ రచనలో...

సినీ గేయ రచనలో...

తెలంగాణ నుంచి అప్పటికే దాశరథి సినిమాలకు పాటలు రాస్తూ ఉన్నారు. ఆ తర్వాత అంత బలమైన ముద్ర వేసిన కవి సినారె. సాహిత్య ఔచిత్యాలను పాటిస్తూనే ఆయన తెలుగు సినిమాలకు అద్భుతమైన, జనరంజకమైన పాటలు రాశారు. ఆయన పాటలు తెలుగు ప్రజల నోళ్లలో నిత్యం నానుతూ ఉంటాయి. నిజానికి, తొలి సినిమాతోనే ఆయన తనదైన ముద్ర వేశారు. గులే బకావళి కథ సినిమాకు ఆయన తొలిసారి పాటలు రాశారు. ఆ సినిమాకు రాసిన నన్ను దోచుకుందువటే, వన్నెల దొరసాని పాటకు ధీటైన పాట ఇప్పటికీ రాలేదంటే అతిశయోక్తి కాదు.

తొలుత గేయసాహిత్యం...

తొలుత గేయసాహిత్యం...

తొలుత గేయ సినారె గేయ సాహిత్యం రాశారు. నాగార్జునసాగరం, విశ్వనాథ నాయకుడు వంటి గేయ కావ్యాలు పండిత పామర జనాలను ఆకట్టుకున్నాయి. ఆయన గేయ నాటికలు కూడా అంతే ప్రసిద్ధి పొందాయి. పెదవుల వెంట అలవోకగా జాలువారుతూ కూడా సాహితీ విలువలకు అద్దం పట్టిన ఆయన గేయ సాహిత్యం విశేషమైన మన్ననలు పొందింది.

వచన కవిత్వంలో ముద్ర...

వచన కవిత్వంలో ముద్ర...

సంప్రదాయ సాహిత్యాన్ని విరివిగా అధ్యయనం చేసిన సినారె ఆధునిక కవిత్వానికి కూడా తన ఒరవడి పెట్టారు. తనది మానవతావాదం అని ప్రకటించుకుని ఆయన తన కవిత్వాన్ని రాశారు. భూమిక, విశ్వంభర వంటి ఎన్నో వచన కవితా సంకలనాలను ఆయన వెలువరించారు. ప్రతి ఏడాదీ ఓ కవితా సంకలనాన్ని ప్రచురించడం ఆయన సంప్రదాయంగా పెట్టుకున్నారు. యువకులతో పోటీ పడి ఆయన వచన కవిత్వాన్ని వెలువరించారు.

పరిశోధన

పరిశోధన

ఆయన పరిశోధనా గ్రంథం ఆధునిక తెలుగు కవిత్వం - సంప్రదాయములు, ప్రయోగములు. ఇప్పటికీ ఆధునిక కవిత్వంపై ఇంత విలువైన గ్రంథం రాలేదు. సాహిత్య పరిశోధకులకు, విద్యార్థులకు ఇప్పటికీ అదో రెఫరెన్స్ బుక్ .ఆధార గ్రంథంగా పనికి వస్తోంది. ఆధునిక కవిత్వంపై అంత విస్తృతంగా పరిశోధన చేసినవారు ఇప్పటికీ ఇంకా రాలేదంటే అతిశయోక్తి లేదు.

సారస్వత పరిషత్‌తో అనుబంధం

సారస్వత పరిషత్‌తో అనుబంధం

ప్రస్తుత తెలంగాణ సారస్వత పరిషత్‌తో ఆయనకు విడదీయరాని సంబంధం ఉంది. దేవులపల్లి రామానుజరావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి వారు స్థాపించిన ఆంధ్రపరిషత్ ఇప్పటికీ కొనసాగుతూ తన కార్యకలాపాలను విసృతం చేసిందంటే అది సినారె కృషి వల్లనే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్‌ను తెలంగాణ సారస్వత పరిషత్‌గా మార్చారు. ప్రతి రోజూ ఆయన సాయంత్రం వేళల్లో ఇక్కడికి వస్తుంటారు. అనేక సమావేశాలను ఈ సంస్థ నిర్వహించింది. గ్రంథాలను కూడా విరివిగా ప్రచురించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ దాని ఉనికిని, అస్తిత్వాన్ని, గౌరవాన్ని కాపాడిన ఘతన సినారెకి దక్కుతుంది. తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాలంలో ఎంపి నిధులతో దాన్ని విస్తరించారు కూడా.

ఎవరు పిలిచినా....

ఎవరు పిలిచినా....

హైదరాబాదులో సాయంత్రం వేళల్లో సినారె సాహితీ సమావేశం లేదంటే సాహిత్యాభిమానులకు ఓ లోటు. ప్రతి రోజూ ఆయన ఏదో ఓ సాహిత్య సమావేశంలో పాల్గొని తన ప్రసంగంతో అలరించేవారు. సభను రక్తి కట్టించడంలో ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు. పదాలతో గారడీ చేస్తూ ఆయన ప్రసంగం అద్భుతంగా సాగేది. సాహిత్య ప్రసంగం అంత జనరంజకంగా చేయడం సినారెకు మాత్రమే చెల్లింది. ఎవరు పిలిచినా ఆయన సాహిత్య గోష్టికి కాదనకుండా వెళ్తూ వచ్చారు. సాహిత్యకారుల పుస్తకాలకు ఆయన రాసిన ముందు మాటలు కోకొల్లలు. ఆయన ఆశీస్సులు ఉంటే చాలు అనుకునే సాహిత్యకారులు తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బడిముబ్బడిగా ఉన్నారు.

గురువులకే గురువు....

గురువులకే గురువు....

సినారె శిష్య బృందం చాలా పెద్దది. తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేసిన ఎన్. గోపితో పాటు ఇప్పటి తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి వరకు ఆయన శిష్యులే. తెలుగు రాష్ట్రాల్లోని పలు విశ్వవిద్యాలయాల తెలుగు శాఖల్లో ఇప్పటికీ ఆచార్యులుగా పనిచేస్తున్న, చేసిన పలువురు ఆయన శిష్యులే. సినారెకు ధీటుగా తెలుగు సాహిత్యంలో తమదైన ముద్రను వేసిన శిష్యులను సంపాదించుకున్న ఘనత ఆయనది. తెలుగు సినీ పరిశ్రమలో సుద్దాల అశోక్ తేజ వంటి ఎందరో తెలంగాణ గేయరచయితలకు ఆయన పెద్ద దిక్కుగా నిలిచారు.

ప్రాచీనం, ఆధునికం కలబోసిన ...

ప్రాచీనం, ఆధునికం కలబోసిన ...

ప్రాచీన, ఆధునిక సాహిత్యాల కలబోత సినారె. ప్రాచీన సాహిత్యంలోని మెలుకువలను, రచనా రీతులను పట్టుకున్న సినారె అధునిక సాహిత్యంలోని మెలుకువలు కూడా అంతే ప్రతిభతో నిర్వహించగలిగారు. శ్రీశ్రీ మహాప్రస్థానం కావ్యానికి అధునిక వ్యాఖ్యానం ఎవరైనా అద్భుతంగా చెప్పగలరంటే ఆయన సినారె మాత్రమే. అంత అద్భుతంగా, విశ్లేషణాత్మకంగా మహాప్రస్థానం శైలీరీతులను, అధునికతను, అధునిక భావజాలానికి శ్రీశ్రీ పొదిగిన ప్రతీకలను ఆయన అద్భుతంగా విడమరిచి చెప్పేవారు. అందుకే ఆయనకు ప్రియశిష్యులు లెక్కకు మించి తయారయ్యారు.

భార్యపై స్మృతి కవిత....

భార్యపై స్మృతి కవిత....

ఏకశయ్య శపించి అంటూ తన సతీమణి సుశీలా నారాయణ రెడ్డిపై సినారె రాసిన కవిత స్మృతి కవిత్వంలో మకుటాయమానంగా నిలుస్తుంది. అంతేకాకుండా తన భార్యతో తనకు గల అనుబంధాన్ని, ఆత్మీయతను అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. సుశీలా నారాయణ రెడ్డి పేర ఆయన ఓ అవార్డును స్థాపించి, యేటా తెలుగు సాహిత్యంలో పేరెన్నిక గన్న మహిళకు ఆయన ప్రదానం చేస్తూ వచ్చారు. మధ్యలో ఓసారి ఆయన లిఫ్టులో గాయపడ్డారు. దానివల్ల ఆయనకు తర్వాతి కాలంలో నడవడం కూడా కష్టమైంది. అటువంటి సందర్భంలో తెలంగాణ సాహిత్య పరిషత్ సమావేశం అంటే రెక్కలు కట్టుకుని వాలుతూ వచ్చారు.

రాజకీయ నేతలతో...

రాజకీయ నేతలతో...

రాజకీయ నాయకులు సాధారణంగా తెలుగులో సాహిత్యవేత్తలను గౌరవించడం అరుదు. కానీ, ఆయన వారి గౌరవాన్ని పొందారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన చేసిన సేవలు కూడా మరుపునకు రానివే. ముఖ్యమంత్రుల స్థాయి నాయకులు ఆయన పెద్దవాడిగా గౌరవిస్తూ వచ్చారు. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు సినారెను గౌరవించి ఆదరించారు. తెలుగు సాహిత్యానికి ఆయన అందించిన మరో గౌరవం ఇది.

English summary
The Telugu literary person C Narayana Reddy (Cinare) made his own mark in Teugu literature.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X