సుజాత, చెరగని గోరింటాకు

గోరింటాకు చిత్రం ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకుల కుటుంబ సభ్యురాలిగా మారిపోయారంటే ఆశ్చర్యం లేదు. గోరింటాకు చిత్రంలో హీరోయిన్‌గా ఆమె తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నారో వెంకటేష్ చంటి సినిమాలో తల్లి పాత్రలోనూ అంతే ఆకట్టుకున్నారు. అక్కినేని నాగేశ్వర రావు సరసన ఆమె ఎక్కువగా నటించారు. దాసరి నారాయణ రావు సరసన ఎమ్మెల్యే ఏడుకొండలు వంటి చిత్రాల్లో ఆమె నటించారు.
భాష రాదనే ఉద్దేశంతో సుజాత తెలుగులో నటించడానికి అంగీకరించలేదు. అయితే, రచయిత్రి కె. రామలక్ష్మి ఒత్తిడి చేయడంతో ఆమె గోరింటాకు చిత్రంలో నటించడానికి అంగీకరించారు. భాష రాకపోవడంతో ఓ పెద్ద డైలాగ్ చెప్పడానికి సుజాత 16 టేకులు తీసుకుంది. దీంతో భాష రాకపోతే ఈ బాధ తప్పదని ఆమె తెలుగు భాష నేర్చుకున్నారు. గోరింటాకు చిత్రంలో సుజాతకు సరిత డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత స్వయంగా ఆమె డబ్బింగ్ చెబుకున్నారు.
శ్రీలంకలో పుట్టి సొంత రాష్ట్రం కేరళకు చేరుకున్న సుజాత తమిళం, మలయాళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో నటించారు. మూడు వందలకు పైగా చిత్రాల్లో ఆమె నటించారు. తెలుగు సినిమాకు సంబంధించినంత వరకు త్యాగం, మంచితనం మూర్తీభవించిన పాత్రలను ఎక్కువగా పోషించారు. సుజాత క్రమశిక్షణ గల నటి. షూటింగుకు కూడా తన వాహనంలోనే వచ్చేవారంటే ఆమె ఎంతటి వ్యక్తిత్వం గల నటో చెప్పుకోవచ్చు.
సహజ నటిగా పేరు పొందిన జయసుధ అసలు పేరు సుజాత. జయసుధ సినీ రంగ ప్రవేశం చేసేనాటికే సుజాతకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో సుజాత తన పేరును జయసుధగా మార్చుకోవాల్సి వచ్చింది. జయసుధ మొదటి సినిమా టైటిళ్లలో సుజాత అనే వేశారు. అంతగా సుజాత సినీ రంగంలో స్థిరపడిపోయారు. సినిమాల్లోని పాత్రలకు సుజాత జీవం పోశారు. సుజాత నటించిన పాత్రలన్నీ తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ కదులాడుతాయి. ఏమైనా, ఆమె మరణం సినీ రంగానికి తీరని లోటుగానే చెప్పవచ్చు.