వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త అర్థాల అధ్యాయం 'క్లిక్' మంది పార్ట్-1

By Srinivas
|
Google Oneindia TeluguNews

మాధ్యమం ఏదైనా జీవితం, సామాజిక వాస్తవికతలను కళాత్మకంగా చిత్రించగలగాలి.

కళాత్మకత ఏదని ప్రశ్నిస్తే ఇదని ఇదమిద్ధంగా చెప్పలేం. కానీ చూసే వాడినో, చదువరినో కదలించగలగాలి. ఆలోచింప చేయగలగాలి. ఒక కొత్త ఆలోచన ఆవరణాన్ని సృష్టించగలగాలి.

Photography Exhibition

అక్షరమైనా, కుంచె అయినా, కెమెరా లెన్స్ అయినా కళాత్మక వాహనమే. ఐతే ప్రతి ప్రయత్నం కళాత్మకం కాకపోవచ్చు. కాని కళాత్మకంగా ఉంచే ప్రయత్నం మాత్రం జరుగుతుంది. కొన్నిసార్లు కళా విలువలు లేకపోయినా పచ్చి వాస్తవం, గుండెలవిసే దృశ్యం మాస్టర్ పీస్ అవుతుంది. అంటే వస్తువు లేదా ఇతివృత్తం కూడా కళగా మారే అవకాశం ఉంటుంది. చిత్త ప్రసాద్ చిత్రాలు, జెనా ఫోటోలు ఇందుకు తార్కాణంగా పేర్కోవచ్చు. అరుదైన దృశ్యాలన్నీ మాస్టర్ పీసులు కాకపోయినా అవి నిలిచిపోతాయి. అందులో అత్యంత అరుదైన దృశ్యాలు కెమెరాకి పేరు ప్రఖ్యాతులు తెస్తాయి. ఫోటోగ్రఫీ కూడా 'కళే' అని నిర్ధారించడానికి వీలు కల్పిస్తుంది. నిజానికి ఫోటోగ్రఫీని కళా మాధ్యమంగా గుర్తిస్తున్నారా? ఐతే ఎలాంటి ఫోటోలని గుర్తిస్తారు? ఇది ప్రశ్నే.

ఫొటో ఫీచర్ చూడండి

నలుపు, తెలుపు, కాంతి సయ్యాటలు, వస్తు నవ్యత, అరుదుతనం అన్నీ కలిస్తే కళాత్మకంగా మారుతుందా? కేవలం కెమెరా ముందు వాటిని అమర్చి దీస్తే కళ అవుతుందా? కాదేమో.

చిత్రకారుడు ఒక చిత్రాన్ని తీరిగ్గా కూర్చుని ఆలోచించి అన్ని సదుపాయాలు సమకూరాక కుంచెతో గీస్తే అది కళాత్మక చిత్రం అయ్యే అవకాశం ఉంది. అలాగే సినీ కెమెరా కూడా. ఆర్టు సినిమాలలో ఇలాంటి అంశమే ప్రధానం. తీరిక ప్రణాళికాబద్దత, అన్నిరకాల హంగులు సమకూరితే కళా ప్రమాణాలు సాధించవచ్చేమో.

కానీ ఫోటోగ్రఫీలో కళాత్మక చిత్రం ఏలా ఉంటుందని చెప్పడం కష్టం. అన్నీ అరేంజ్ చేసి తీసే ఫోటో కూడా డొల్లగా ఉంటుంది. అంటే వస్తువు లేదా దృశ్యంలో సజీవత లోపిస్తే అది కళాత్మకం కాదు. సద్యః స్పోరకః అంటే అప్పటికప్పుడు తీసే ఫోటోలో చక్కని కాంపోజిషన్‌లో కొత్త ఇతి వృత్తం సజీవంగా ఉట్టిపడేలా పట్టుకోవాలి. అలా ఆ ఫోటోని కెమెరాలో బంధించడానికి ఎంతో శ్రమ, ఓపిక, సహనశీలత, దీక్షాగుణం అవసరం. అలా తీసిన దానిని కళాత్మక ఫోటోగ్రఫీ అనవచ్చు అంటారు కొందరు.

ఐతే కేవలం భేషజం లేని వాస్తవికత, కొత్త జీవిత కోణాన్ని ఉన్న దానిని ఉన్నట్టు కాప్చర్ చేస్తే దానిని కళాత్మక చిత్రం అనవచ్చా?

ఈ ప్రశ్నలు కందుకూరి రమేష్ బాబు హైదరాబాదులోని వాల్యూస్ ఆర్ట్ గ్యాలరీ, మారియట్ హోటల్‌లో ''సామాన్య శాస్త్రం దృశ్యాలు'' పేరుతో ఏర్పాటు చేసిన ఫోటోగ్రఫీ ప్రదర్శన చూశాక కలిగాయి. ఇంకా ఎన్నో ఆలోచనలు ముసురుకున్నాయి.

ప్రఖ్యాత భారతీయ ఫోటోగ్రాఫర్ రఘురామ్ కందుకూరికి ఆప్తుడు. ఆయన ఇలా అన్నాడు - ''సామాన్య జనమే ప్రధాన స్రవంతి అయినప్పుడు రమేష్ అనే అబ్బాయి తాను ప్రత్యేకమైన పని చేస్తున్నానని భావించవద్దు. ఈ ఫోటోగ్రఫీ ప్రత్యేకం కాదు. సాధారణమైన పనే. ఐతే సామాన్యులను ఇతివృత్తంగా ఎంచుకోవడం, దాన్ని తన బాధ్యతగా భావించడం గొప్ప విషయం.''

జీవితాన్ని వదిలి 'ఆదర్శం' కోసం ఆయాసపడటం వృథా. జీవితాన్ని గౌరవించాలి. జీవితాన్ని ఉత్సవం చేయాలి. పేదరికం వేరు. పేదల బతుకులోని జీవన శ్వాస, బతుకుపట్ల ఆత్మవిశ్వాసం అనే లక్షణాలను గుర్తించి వాటిని కీర్తించాలి. అచంచలమైన ధీశాలిత్వాన్ని అలవోకగా ప్రదర్శఇంచే జనాల వల్లే - సమాజం ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నా మళ్లీ సాఫీగా నడవటానికి కారణం అవుతున్నది.

నిత్య జీవితంలోని అనేక ఒడిదుడుకుల మధ్య సామాన్యులు ఎంత అసామాన్యంగా సమస్యలను ఎదుర్కోగలరో చూడగలగాలి. ఇలా చూసిన వాడికి మరణం లేదు. తనని తాను మేధావి అనుకునే అల్పుడు ప్రజల జీవితాల కన్నా భిన్నంగా నమూనాలనే ప్రేమిస్తాడు. అందుకే వాడి కవిత్వంలో సైతం జీవన గౌరవ భావన ఎక్కడా కనిపించదు. ఫోటోగ్రఫీలో, తెగడ్తలో తప్ప బతుకు ఆధారంగా 'పాఠం' గ్రహించడు.

సామాన్య ప్రజల పట్ల మమేకత గౌరవం లేని వాడు వాళ్లకి ఈస్తటిక్స్ ఉంటాయని అనుకోడు. వాళ్లని బాగు చేస్తానని శపథం పట్టినవాడు తనకంటే అన్నిట్లోనూ జనం అల్పులే అనుకుంటాడు. ఈ అల్పత్వ భావన వల్ల ఈ వీరుడు తాను ఎంత అల్పాది అల్పుడో తెలుసుకోలేడు. పైగా వాళ్ల కళాత్మక పరిసరాలను, పేదరికాన్ని జయించే కళాత్మక ఆవరణాన్ని, మహోన్నత జీవావరణ అలంకారాన్ని చూడలేడు. దీనిని చూసే పాఠం ఏదీ నేర్చుకోలేని వాడు. ఆ పాఠాన్ని తనకి చెప్పే గురువులని తృణీకరించిన విప్లవ చాంధసత్వం వారసుడు.

ఆకాశమెత్తు ఎదిగి జీవితాన్ని పోరాడి గెలుచుకునే సామాన్యుడిని ఆవిష్కరించే కళాసాహిత్యాలు ఇవ్వాళటి అవసరం. అలాంటి సాహిత్యాన్నే సామ్రాజ్యవాద వ్యతిరేక లక్షణం కలదిగా గుర్తించాలి. స్థానిక బతుకు ధీమాగా తలెత్తి నిలబడితే సామ్రాజ్య గ్లోబల్ వాదం ఓటమికి గురవుతుందని గుర్తించాలి. సామాన్యుడు నిలిచిన స్థానిక నేలనీ, ఆ ఆవరణనీ గుర్తించి గౌరవించడమే కళా సంప్రదాయం కావాలి. బెకం అన్నట్లు జీవితం అనే చెట్టుకి వేలాడే తేనెపట్టులోని తేనెటీగలా కవి, కళాకారుడు ఉండాలి. ఊడలే కాదు, ఆ ఊడల కింద సేద దీరే సామాన్య మనిషి బతుకుని ఎదుర్కొనే దక్షత కళాత్మక వ్యవస్తీకరణే అని ఒప్పుకోవాలి.

English summary
An eminent critic of art and literature Jayadhir Tirumala Rao analyses Kandukuri Ramesh Babu's photography exhibition, which was opened for audience at Hotel Marriott near Tankbund in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X