వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన సోదరి షర్మిళ, బావ బ్రదర్ అనిల్ కుమార్ సువార్త సభలను ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ ఓ వైపు రాజకీయంగా వెళుతుండగా అనిల్ కుమార్ రాష్ట్రంలోని ఓ వర్గాన్ని పూర్తిగా జగన్ వైపు మరల్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అందుకు సువార్త సభలను ఆయన వినియోగించుకుంటున్నారనే వాదనలు వినపడుతున్నాయి. యేసు క్రీస్తు నామం జపించాల్సిన చోట అంతకంటే ఎక్కువంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి నామస్మరణ చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఎక్కడ యేసుక్రీస్తు సభలు జరిపినా అక్కడ బ్రదర్ అనిల్ కుమార్ వైయస్సార్ పేరును ప్రస్తావిస్తూ దేవుని వ్యాక్యంలో రాజకీయ డైలాగులు చెబుతున్నారని అంటున్నారు.
ఇటీవల గోదావరి జిల్లాలోని అమలాపురంలో సువార్ సభలో అనిల్ తో పాటు ఆయన భార్య షర్మిళ కూడా పాల్లొన్నారట. అక్కడ అనిల్ మాట్లాడుతూ.. అద్వితీయమైన కుమారుడిని ఇచ్చారంటూ పరోక్షంగా వైయస్సార్, జగన్‌లను ఉద్దేశించి ప్రస్తావించారట. ఆ తర్వాత మాట్లాడిన షర్మిళ కూడా తన తండ్రి వైయస్సార్‌ను ప్రస్తావించారట. వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టాక ఆయనను ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశ్యంలో భాగంగా ప్రతి దైవ సభలోనూ అనిల్ ఇలాంటి పొలిటికల్ ప్రస్తావన తీసుకు వస్తున్నారట. గతంలోనూ అనిల్ తన బావమరిది జగన్ కోసం చర్చిలలో ప్రార్థనలు చేశారనే వాదనలు వినిపించాయి. జగన్ కోసం అనిల్ ప్రార్థనలు చేశారనే అంశం అప్పుడు చర్చనీయాంశమైంది. సువార్త సభల్లో, చర్చిలలో ఇలాంటి రాజకీయ ప్రస్తావని తీసుకు రావడాన్ని పలువురు ఖండిస్తున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి