సత్తాతోనే కొలువు: లేదంటే ఇంటికే నిపుణులకే ఐటీలో పెద్దపీట..

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌:ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు ఉపాధి కల్పతరువుగా మారిన ఐటీ రంగం ఇప్పుడు ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. రెండేళ్ల క్రితం వరకు ఐటీ ఉద్యోగమంటే భారీ వేతనాలు, విలాసవంతమైన జీవితం కనిపించేది. కానీ, ఇప్పుడు క్రమంగా పరిస్థితులు మారుతున్నాయి. ఓ వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చర్యలు.. మరోవైపు అంతర్గతంగా కూటమి కడుతున్న కంపెనీలతో వెరసి భారతీయ ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రధాన కంపెనీల్లోనూ ప్రారంభ వేతనాలు రూ.1.8 లక్షలకు పరిమితం అవుతున్నాయి. క్యాంపస్ సెలక్షన్లు నామమాత్రం అయ్యాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకు తెస్తున్న వీసాల వివాదం భారత్, అమెరికాలకు మంచిది కాదని నాస్కామ్ స్పష్టం చేసింది. కానీ రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొస్తున్న నూతన టెక్నాలజీ, యాప్‌లు, టూల్స్ లీడ్ చేసే సామర్థ్యం గల యువ ఇంజినీర్లకు మాత్రం అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఐటీ సంస్థలు నైపుణ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.

 పెద్ద ఐటీ సంస్థల్లోనూ భారీగా తగ్గిన వేతనాలు

పెద్ద ఐటీ సంస్థల్లోనూ భారీగా తగ్గిన వేతనాలు

ప్రస్తుత పరిణామాలపై ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో టీవీ మోహన్‌దాస్‌ స్పందిస్తూ ‘ఐటీ కంపెనీలన్నీ ఒక బృందంగా ఏర్పడి కొత్తగా నియమితులయ్యే ఇంజినీర్లకు వేతనాలు తక్కువగా ఇస్తున్నాయి. ఇది అనైతికం, విలువలతో కూడిన నిర్ణయాలు కావు' అని వ్యాఖ్యానించారు. గతంలో కొత్తగా చేరే ఐటీ ఉద్యోగికి కనీస వేతనం ఏడాదికి రూ.3.2 లక్షల వరకు ఉండేదని ఇప్పుడు చిన్న కంపెనీలతోపాటు పెద్ద వాటిలోనూ వేతనాలు భారీగా తగ్గిపోయాయని హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ఒకరిద్దరి నియామకానికే ఐటీ సంస్థలు పరిమితం

ఒకరిద్దరి నియామకానికే ఐటీ సంస్థలు పరిమితం

ప్రస్తుతం భారతదేశంలో ఐటీ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు బెంగళూరు, హైదరాబాద్‌, పుణె నగరాలు చిరునామాగా ఉన్నాయి. ఐటీ కంపెనీలు తమకు అవసరమైన మానవ వనరులను క్యాంపస్ సెలక్షన్లతోపాటు ఇతర మార్గాల్లోనూ నియమించుకునేవి. కనీస వేతనాలు రూ.3.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు చెల్లించేవి. ప్రస్తుతం కంపెనీలు కొన్ని కళాశాలల్లో క్యాంపస్ సెలక్షన్లకే పరిమితమై వేతనాల్లోనూ భారీగా కోతపెడుతున్నాయి. అత్యధిక నైపుణ్యం కలిగిన విద్యార్థులకు మాత్రమే రూ.3 లక్షల వరకు వేతన ప్యాకేజీలు అందిస్తున్నాయి. ఈ తరహా ప్యాకేజీల కింద ఒక్కో కంపెనీ ఇద్దరు, ముగ్గురిని మాత్రమే తీసుకుంటున్నాయి. అవసరాల మేరకు ఇతర విద్యార్థులను ఎంపిక చేసినా... గరిష్ఠంగా ఏడాదికి రూ.2 లక్షల వరకు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరిస్తున్నాయి. ఆటోమేషన్‌ కారణంగా ఇప్పుడు ఐటీ నియామకాలు తగ్గుతున్నాయి.

 నూతన కోర్సులు నేర్చుకోవాల్సిందే

నూతన కోర్సులు నేర్చుకోవాల్సిందే

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రారంభ వేతనాలు మరింత తగ్గాయి. గత ఏడాది వరకు ప్రముఖ కంపెనీలు మినహా మిగతా సంస్థలు ఏడాదికి రూ.2.1 లక్షల నుంచి రూ.2.4 లక్షల వరకు ఇచ్చాయి. ఈ ఏడాదికి ఆ మొత్తాన్ని రూ.1.8 లక్షల నుంచి రూ.2.1 లక్షలకు పరిమితం చేశాయి. ‘గతంతో పోలిస్తే ఏడాది వేతనం రూ.40 వేల వరకు తగ్గిన మాట వాస్తవమే. పెద్ద కంపెనీలు ఇప్పటికీ రూ.2.4 లక్షల వరకు ఆఫర్‌ చేస్తున్నాయి. అయితే బీపీవో ఉద్యోగాల్లో వేతనాలు రూ.1.8 లక్షల వరకు ఉంటున్నాయి' అని సెలక్షన్ ప్రక్రియలో కీలకంగా ఉండే అధికారి ఒకరు తెలిపారు. ‘కోర్‌ రంగంలో ఉద్యోగాలు పెరగడం లేదు. ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన వారందరికీ ఐటీ, ఐటీఈఎస్‌ ఉద్యోగాలే ఆధారమయ్యాయి. తక్కువ వేతనం ఇచ్చినా వెంటనే ఉద్యోగంలో చేరేందుకు పట్టభద్రులు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే కోర్సు పూర్తయ్యాక ఏడాది ఖాళీగా ఉంటే.. ఉద్యోగం దొరకడం కష్టమవుతోంది. వేతనం తక్కువని బాధపడకుండా నూతన కోర్సులు నేర్చుకుంటే భవిష్యత్ బాగుంటుంది' అని తెలంగాణ ఐటీ అసోసియేషన్‌ ప్రతినిధి సందీప్‌కుమార్‌ పేర్కొన్నారు.

 మార్కెట్‌ను బట్టి నూతన టెక్నాలజీపై పట్టు సాధించాలి

మార్కెట్‌ను బట్టి నూతన టెక్నాలజీపై పట్టు సాధించాలి

వేతన ప్యాకేజీలు తగ్గిన విషయాన్ని పక్కనపెడితే ప్రారంభ ఉద్యోగులకు కొన్ని కంపెనీలు ఇప్పటికీ అధిక వేతనాలు చెల్లిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘ఐటీ రంగంలో ప్రస్తుతం కొత్త టెక్నాలజీలకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, అడోబ్‌, ఏఐ తదితరాల్లో కోర్సులు నేర్చుకున్న వారికి ఏటా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. విద్యార్థులు ఎప్పటికప్పుడు మార్కెట్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నూతన టెక్నాలజీల్లో నైపుణ్యం సాధించాలి. నైపుణ్యాలు ఉంటే వేతనాలు అవే పెరుగుతాయి.'' అని టాస్క్‌ అధికారి భాస్కర్‌ పేర్కొన్నారు. సింప్లీ ఎర్న్ కెరీర్ డేటా ప్రకారం వివిధ కంపెనీల డిజిటల్ వ్యూహం ప్రకారం ఈ ఏడాది డిజిటల్ టెక్నాలజీ, క్లౌడ్, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, తదితర అంశాల్లో ఎప్పటికప్పుడు నైపుణ్యం పెంచుకున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు మాత్రమే మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని గత ఆరు నెలల పరిస్థితులను బట్టి తెలుస్తోంది.

 ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్లు, ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్లకు పుష్కల అవకాశాలు

ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్లు, ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్లకు పుష్కల అవకాశాలు

క్లౌడ్ కంప్యూటింగ్ పూర్తిచేసిన నిపుణులకు సంప్రదాయంగానే కొద్ది రోజులుగా ప్రాధాన్యం ఇస్తున్నారు. పలు ఐటీ సంస్థలు క్లౌడ్ ఇంజినీర్లను రూ.11.73 లక్షల ప్యాకేజీతో నియమించుకునేందుకు వెనుకాడటం లేదు. క్లౌడ్, అజూర్ ఆర్కిటెక్‌లు, డెవ్ అప్స్ ఇంజినీర్లు, ఎడబ్ల్యూఎస్ కన్సల్టెంట్లకూ డిమాండ్ పుష్కలంగా ఉంది. ఇక మొబైల్, సాఫ్ట్ వేర్ డెవలప్‌మెంట్ విభాగంలో శరవేగంగా మారిపోతున్నది. ప్రతిరోజూ నూతన యాప్స్, ప్రొడక్ట్స్, టూల్స్ విడుదలవుతున్న నేపథ్యంలో ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్లకు, ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్లకు రూ. 5.25 లక్షల నుంచి రూ.8.50 లక్షల ప్యాకేజీ వేతనాలిచ్చేందుకు ఐటీ, మొబైల్, సాఫ్ట్‌వేర్ సంస్థలు బారులు తీరుతున్నాయి.

 సైబర్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఐటీ సంస్థలు

సైబర్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఐటీ సంస్థలు

బిగ్ డేటా, అనలిటిక్స్ విభాగాల్లో పట్టు సాధించిన ఐటీ నిపుణుల అవకాశాలకు కొదవలేదు. బిగ్ డేటా రంగ నిపుణులకు ఫార్చ్యూన్ 500 కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకు ‘ఆకర్షణీయ ప్యాకేజీ' ఆఫర్లు ఆహ్వానం పలుకుతున్నాయి. మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్లకు రూ.13 లక్షలు, డేటా శాస్త్రవేత్తలకు రూ.8.5 లక్షల వరకు డిమాండ్ ఉంది. ఇక సైబర్ సెక్యూరిటీ విభాగంలో భారతదేశంతోపాటు అంతర్జాతీయంగా నిపుణుల కొరత బాగా ఉంది. భారీగా సెబర్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో పలు ఐటీ సంస్థలు సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్‌ల నియామకం కోసం భారీగా వేతన ప్యాకేజీలిచ్చేందుకు వెనుకాడటం లేదు. సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్‌లకు భారీగా రూ.19.80 లక్షల నుంచి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్లకు రూ.11 లక్షలు, సెక్యూరిటీ అడిటర్లకు రూ.9.9 లక్షల ప్యాకేజీలివ్వడానికి వెనుకాడటం లేదు.

 అమెరికాలో నిపుణుల కొరతే ప్రధాన సమస్య అన్న చంద్రశేఖర్

అమెరికాలో నిపుణుల కొరతే ప్రధాన సమస్య అన్న చంద్రశేఖర్

అమెరికాలో ప్రధాన సమస్య నిపుణుల కొరతేనని స్పష్టీకరణ
హెచ్‌-1బీ వీసాల వివాదం మరింతగా ముదిరితే భారత్, అమెరికా రెండు దేశాల ప్రయోజనాలకూ విఘాతం కలుగుతుందని దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. అమెరికన్‌ ఉద్యోగాలను కాపాడే పేరుతో విదేశీయుల హెచ్‌-1బీ వీసాల గడువు పొడిగించకుండా కొత్త నిబంధన చేర్చేందుకు అమెరికా కసరత్తు చేస్తోందన్న వార్తల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన పక్షంలో గ్రీన్‌ కార్డుల కోసం నిరీక్షిస్తున్న పది లక్షల మంది పైగా హెచ్‌-1బీ వీసా హోల్డర్లను కూడా (ఇందులో సింహభాగం భారతీయులే ఉన్నారు) వారి వారి స్వదేశాలకు పంపే అవకాశం ఉంది. ఇలాంటి పరిణామం కేవలం భారతీయ ఐటీ పరిశ్రమకే కాకుండా హెచ్‌-1బీ వీసాలనను ఉపయోగించే భారతీయులందరిపైనా ప్రభావం చూపుతుందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అమెరికాలో అసలు సమస్యల్లా సుశిక్షితులైన నిపుణులు తగినంత మంది దొరక్కపోవడమే.

 ఐటీ నిపుణులకు స్వాగతం పలుకుతానన్న ఆనంద్ మహీంద్రా

ఐటీ నిపుణులకు స్వాగతం పలుకుతానన్న ఆనంద్ మహీంద్రా

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వీసాలపరంగా ఏ ప్రతికూల నిర్ణయం తీసుకున్నా అది ఇటు భారత్, అటు అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది' అని నాస్కామ్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ చెప్పారు. వీసా నిబంధనల్లో మార్పులతో భారత ఐటీ కంపెనీల వ్యయాలు ఏటా 5-10 శాతం మేర పెరిగిపోయే అవకాశం ఉందని గ్రేహౌండ్‌ రీసెర్చ్‌ వ్యవస్థాపకుడు, చీఫ్‌ అనలిస్ట్‌ సంచిత్‌ వీర్‌ గోగియా పేర్కొన్నారు. మరోవైపు, మహీంద్రా గ్రూప్‌ చీఫ్‌ ఆనంద్‌ మహీంద్రా మాత్రం వీసాల వివాద తీవ్రతను కాస్త తగ్గించే ప్రయత్నం చేశారు. వీసాల వివాదం కారణంగా తిరిగివచ్చే వారందరికీ తాను స్వాగతం పలుకుతానని, భారత వృద్ధికి తమ వంతు కృషి చేసేందుకు వారు సరైన సమయంలో తిరిగొచ్చినట్లు అవుతుందని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The year 2017 brought about many changes in the IT jobs scenario in India. With automation, machine learning and other emerging technologies becoming the norm at IT firms, certain legacy IT skills became irrelevant. Early in 2017, as reports of mass layoffs at major IT companies started coming in, techies realised that re-skilling is no longer a mere buzzword but a necessity and they are taking measures to learn new tech skills.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి