వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చార్జీల పేరిట ఇష్టారాజ్యం: నడ్డి విరుస్తున్న బ్యాంకులు

బ్యాంకులు మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా కనీస నిల్వ పేరుతో బ్యాంకులు నడ్డి విరిచేస్తున్నాయి. గత ఏడాది పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో నిల్వలు తగ్గిపోయాయి.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ అమరావతి: ప్రస్తుతం ప్రతి ఒక్కరు తాము సంపాదించే ఆదాయంలో ఒకింత పొదుపు చేయడం కోసం బ్యాంకుల్లో పొదుపు (సేవింగ్స్) ఖాతాలు నడపడం సర్వ సాధారణం. కానీ బ్యాంకులు మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా కనీస నిల్వ పేరుతో బ్యాంకులు నడ్డి విరిచేస్తున్నాయి.

గత ఏడాది పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో నిల్వలు తగ్గిపోయాయి. దీనికి తోడు ఏటీఎంల్లో నగదు లభ్యత తగ్గిపోయింది. కొత్తనోట్లు చలామణిలోకి తెచ్చినా ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు అల్లాడిపోతున్నారు. వేతన జీవులు మినహా మిగతా వారి వద్ద భారీగా చార్జీలు వసూలు చేస్తున్నాయి బ్యాంకులు. దీనికి తోడు మూడేళ్ల క్రితం అమలులోకి తెచ్చిన జన్ ధన్ యోజన స్కీం కింద ప్రారంభించిన కోట్ల ఖాతాల నిర్వహణ బ్యాంకులకు తలకు మించిన భారంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. నోట్ల రద్దు, జన్ ధన్ యోజన పథకం అమలుతో బ్యాంకర్లు తమపై పడే ఆర్థిక భారాన్ని ఖాతాదారులపైకి తోసేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫలితంగా ఆయా ఖాతాదారుల నుంచి ఏటా రూ. కోట్లలో రుసుము వసూలు చేసుకునేందుకు మార్గం సుగమమవుతున్నది. అయితే ఛార్జీల భారం సామాన్యుడిపైనే అధికంగా పడుతున్నది. గమ్మత్తేమిటంటే చార్జీల వడ్డనలో ఒక్కో బ్యాంక్ ఒక్కోరకం అన్నమాట. ఈ నేపథ్యంలో ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ ఉంచకపోతే ఆయా బ్యాంకులు వసూలు చేస్తున్న ఛార్జీలు అధిక స్థాయిలో ఉంటున్నాయని, వీటిని నియంత్రించాలని కోరుతున్నారు. ముఖ్యంగా తక్కువ స్థాయి ఆదాయ వర్గాలపై ఇవి భారాన్ని మోపుతున్నాయని.. వెంటనే ఈ ఛార్జీల తగ్గింపుపై బ్యాంకులు దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు.

మోయలేని భారంగా చార్జీలని ఖాతాదారుల ఆవేదన

మోయలేని భారంగా చార్జీలని ఖాతాదారుల ఆవేదన

‘డబ్బులేనిదే అడుగుతీసి అడుగేయలేం. ఇది వాస్తవం. అందుకే మన అవసరాలు పోగా.. కొద్దో, గొప్పో బ్యాంకుల్లో దాచుకుంటాం. ఇది మనమంతా చేసేదే. ఎందుకుంటే సొమ్ముకు రక్షణ ఉంటుందని.. ఎంతోకొంత వడ్డీ డబ్బులైనా వస్తాయని. సాధారణంగా అవసరాలకు అనుగుణంగా వాడుకోవడానికి పొదుపు (సేవింగ్స్‌) ఖాతాల్లోనే నిల్వ చేసుకుంటాం. నెలాఖరుకు అనుకోకుండా వచ్చే ఖర్చులను తట్టుకోవడానికి ఒక్కోసారి ఆ డబ్బులు వాడుకుంటాం. ఇదేనా మనం చేస్తున్న తప్పు' అని మనం అనుకుంటాం. కానీ ఇది తప్పని అంటున్నాయి బ్యాంకులు. ‘మీ ఖాతాల్లో కనీస నిల్వలు లేనప్పుడు ఛార్జీలు విధించడం సహజమే' అని బ్యాంకులు చెబుతున్నాయి. అయితే ఆ ఛార్జీలే భరించలేకుండా ఉంటున్నాయని అంటున్నారు ఖాతాదారులు. ఛార్జీలు ఎక్కువ స్థాయిలో ఉండటంతో పాటు, ఖాతాల్లో నిర్వహించాల్సిన కనీస మొత్తం పరిమితులు కూడా అధికంగానే ఉంటున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

Recommended Video

Bank Charges on Transactions Is Cruel - Oneindia Telugu
తల్లడిల్లుతున్న సామాన్యుడు

తల్లడిల్లుతున్న సామాన్యుడు

ముఖ్యంగా మెట్రో నగరాలు, పెద్ద పట్టణాల్లో ఈ నిల్వల పరిమితి ఎక్కువగా ఉంటోంది. ఇదే భారంగా మారుతోందన్నది ఖాతాదారుల మాట. మెట్రో నగరాలు, పట్టణాల్లో బతుకుతున్నంత మాత్రాన అందరి బతుకులూ లోటులేకుండా సాగిపోయే స్థాయిలో ఉండవని, పేదవాళ్లు, సగటు జీతగాళ్లు, దిగువ మధ్య తరగతి వ్యక్తులు, పింఛన్లు పొందే వృద్దులు కూడా ఉంటారన్న విషయాన్ని బ్యాంకులు పట్టించుకోవాలని వారు సూచిస్తున్నారు. అందరినీ ఒకే గాటన కట్టేయడం.. అందరికీ ఒకేరీతిన ఛార్జీలు వడ్డించేయడం ఇబ్బంది కలిగించే విషయమని అంటున్నారు. నిజమే మరి. బ్యాంకులు వసూలు చేస్తున్న అధిక ఛార్జీల వల్ల ఎక్కువ భారాన్ని మోస్తున్నవారిలో ప్రధానంగా సామాన్యులు, రైతులు, విద్యార్థులు, చిన్న ఉద్యోగులు, చిన్న వ్యాపారులే ఎక్కువగా ఉంటున్నారు. రిజర్వు బ్యాంకు నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వల్ల ఒక్కో బ్యాంకు ఒక్కో రీతిలో మెట్రో, పట్టణం, సెమీ అర్బన్‌, గ్రామీణం.. అంటూ వర్గీకరించి ఈ ఛార్జీలను వసూలు చేస్తున్నాయి.

ఆంధ్రాబ్యాంకుదీ అదే బాట

ఆంధ్రాబ్యాంకుదీ అదే బాట

ఎస్‌బీఐలో ఇటీవల పలు బ్యాంకులు విలీనమయ్యాయి. ఆ బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతాల్లో పాటించాల్సిన కనీస నిల్వ పరిమితిని అమాంతం పెంచేసింది. ఇలా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాల్లో ‘కనీస నిల్వ' (మినిమమ్‌ బ్యాలెన్స్‌) పాటించని ఖాతాదారుల నుంచి ఛార్జీల రూపేణా వసూలు చేసిన సొమ్ము ఇది. దేశవ్యాప్తంగా ఇలాంటి 388.74 లక్షల మంది ఖాతాదారుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినప్పుడు ఎస్‌బీఐ ఈ వివరాలు బయటపెట్టింది. మిగిలిన బ్యాంకులు కూడా కొంచెం అటూఇటూగానే ఛార్జీలను వసూలు చేసి ఉండొచ్చని భావించొచ్చు.

ఆయా బ్యాంకులు తమ వద్ద ‘కనీస నిల్వ' పాటించని ఖాతాదారుల నుంచి ప్రతి మూడు నెలలకోసారి జరిమానా రూపంలో రూ.50 నుంచి రూ.750 వరకు వసూలు చేస్తున్నాయి. సేవింగ్స్‌ ఖాతాల్లో ఖాతాదారు కనీసం రూ.5వేలు నిల్వ ఉంచాలి. అలా చేయని పక్షంలో మూడు నెలలకోసారి ఆ బ్యాంకు ‘నెల సగటు నిల్వ' (మంత్లీ యావరేజ్‌ బ్యాలెన్స్‌) ఛార్జీల పేరిట రూ.వంద, సేవా పన్నులు కలిపి వసూలు చేస్తోంది. ఇలా ఒక్కో బ్యాంకు ఒక్కో విధంగా ఖాతాదారుల నుంచి ఛార్జీల రూపేణా భారీ ఎత్తున వసూలు చేస్తున్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మెట్రో నగరాల పరిధిలో రూ.5000, పట్టణ ప్రాంతాల్లో రూ.3000, సెమీ అర్బన్ గ్రామాల్లో రూ.2000, గ్రామీణులు రూ.1000 కనీస నిల్వగా పాటించాలి. లేదంటే రూ.100 నుంచి రూ.25 - 50 అదనపు రుసుము వసూలు చేస్తోంది. ఇక మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘ఆంధ్రాబ్యాంక్' ఆరు రకాల పొదుపు ఖాతాలు నిర్వహిస్తున్నది. ఖాతాను బట్టి కనీస నిల్వ రూ.100 నుంచి రూ.5 లక్షలు ఉంచాల్సిందే. లేదంటే మూడు నెలలకోసారి ఖాతాను బట్టి రూ.100 నుంచి రూ.250 వసూలు చేస్తున్నది.

సామాజిక ఫించన్ ఖాతాలపైనా చార్జీల భారం

సామాజిక ఫించన్ ఖాతాలపైనా చార్జీల భారం

తెలుగు రాష్ట్రాల్లో కూడా సామాన్యులు ఇలా ‘కనీస నిల్వ' బారీన పడుతున్నారు. తెలంగాణాలో 5259 బ్యాంకుల్లో మొత్తం 5.05 కోట్ల ఖాతాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య దాదాపు 6.50కోట్ల ఖాతాలున్నట్లు అంచనా. బ్యాంకుల వద్ద, బ్యాంకర్ల కమిటీ వద్ద ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని ఖాతాలున్నాయనే దానిపైన నిర్ధిష్ట సమాచారం లేదు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జన్‌ధన్‌యోజన పథకం కింద తెలంగాణలో 52.23 లక్షలు, ఆంధ్రాలో 1.18కోట్ల ఖాతాలున్నాయి. జన్‌ధన్‌యోజన ఖాతాల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు.

కొన్ని బ్యాంకులు సామాజిక పింఛన్ల పంపిణీకి సంబంధించిన ఖాతాల నుంచి కూడా వసూలు చేయడం లేదు. మరికొన్ని మాత్రం వసూలు చేస్తున్నాయి. బ్యాంకుల్లో ప్రధానంగా సేవింగ్స్‌ , కరెంటు ఖాతాలని రెండు రకాలు ఉంటాయి. ప్రతి ఖాతాలోనూ ఆయా బ్యాంకులు ప్రతి నెలా ఇంత మొత్తంలో తప్పనిసరిగా ‘కనీస నిల్వ' ఉండేలా పాటించాలని చెబుతుంటాయి. చాలా మంది ఖాతాదారులు బ్యాంకుల సూచించిన మేరకు కనీస నిల్వలు పాటించకుండా డబ్బులు అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఆయా ఖాతాల నుంచి ఆ బ్యాంకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఛార్జీలు, సేవా పన్నుల రూపేణా వసూలు చేస్తున్నాయి. ప్రతి బ్యాంకు శాఖలోనూ కనీసం 15 శాతం ఇలాంటి ఖాతాలు ఉంటాయని అంచనా.

ఒక్కో బ్యాంకు ఒక్కోరకం ఫీజు

ఒక్కో బ్యాంకు ఒక్కోరకం ఫీజు

కనీస నిల్వల విషయంలో బ్యాంకులు ఏకీకృతంగా వ్యవహరించడంలేదు. దాంతో ఒక్కో బ్యాంకు ఒక్కో విధంగా ఛార్జీలను నిర్ణయించాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులు ‘ఐసిఐసిఐ', ‘హెచ్‌డీఎఫ్‌సీ' కూడా భారీగానే చార్జీలు వసూలు చేస్తున్నాయి. మెట్రో, పట్టణ ప్రాంతాల్లో కనీస నిల్వగా రూ.10 వేలు, సెమీ అర్బన్ ఏరియాలో రూ.5000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2500గా ఐసీఐసీఐ బ్యాంక్ కనీస నిల్వగా నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో ఖాతాలకు అనుగుణంగా నిల్వలు లేకపోతే రూ.750 చార్జీలు వసూలు చేస్తోంది. ఇక హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కనీస నిల్వల శ్లాబులు నాలుగు నిర్వహిస్తున్నది. రూ.7500 - రూ.10,000లకు రూ.150, రూ.5000 - రూ.7500లకు రూ.300, రూ. 2500లకు రూ.450, రూ.2500లోపు రూ.600, అదే సెమీ అర్బన్ పట్టణ ప్రాంతాల్లో రూ.5000 లోపు రూ.150, రూ.2500 లోపు ఖాతాదారులపై రూ.300 రుసుము వసూలు చేస్తున్నాయి. వీటికి తోడు చెక్ బుక్ ల జారీకి కూడా బ్యాంకర్లు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఖాతాలో సరిపడా నిధులు లేకుండా చెక్ జారీ చేస్తే రూ.350 వసూలు చేస్తున్నాయి.

English summary
State Bank of India (SBI) has realised Rs 235.06 crore as penalty from 388.74 lakh accounts for not maintaining monthly average balance in the first quarter of the current fiscal, an RTI query has revealed. "An amount of Rs 235.06 crore has been realised from our 388.74 lakh accounts which did not maintain monthly average balance in the first quarter ended June 30," SBI said in its reply to an application filed by Neemuch-based RTI activist Chandrashekhar Gaud. This information was furnished by a Mumbai-based Deputy General Manager rank officer of the bank's operations department, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X