పొంచి ఉన్న స్థానికత ముప్పు.. ఉపాధ్యాయ నియామకాలు జరిగేనా?

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: తెలంగాణలో తొలిసారి ఉపాధ్యాయ నియామకాలకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం.. డీఎస్సీ ప్రకటించనున్నదని వచ్చిన వార్తలు నిరుద్యోగ యువతను సంతోష పెడుతున్నా.. ఆచరణలో స్థానికత సమస్య వారికి అడ్డంకిగా మారనున్నది. గతేడాది వరకు అందరూ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉండే వారు. కానీ గత ఏడాది కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల ప్రాతిపదికన డీఎస్సీ నిర్వహిస్తామని.. అందుకు జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తామని తెలంగాణ ప్రభుత్వం తేల్చేసింది.

తదనుగుణంగా క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో గతేడాది విజయదశమికి ముందు ఉమ్మడి జిల్లా పరిధిలోకి వస్తామని భావిస్తున్న నిరుద్యోగ అభ్యర్థులంతా.. ప్రభుత్వ తాజా నిర్ణయంతో నీరు గారిపోయారని వార్తలొస్తున్నాయి. పలువురు అభ్యర్థులు వివిధ కారణాల రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో స్థిర పడ్డారు. వారంతా ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాల కోసం కొత్త జిల్లా నిబంధనలు అమలు చేస్తే తమకు అవకాశాలు సన్నగిల్లుతాయని ఆందోళన చెందుతున్నారు. వారు చదివిన ప్రాంతం వేరే జిల్లా పరిధిలోకి రావడంతో స్థానికత సమస్య తలెత్తుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను, ఉమ్మడి జిల్లాలను దృష్టిలో ఉంచుకుంటే ఉద్యోగార్థులకు స్థానికత ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పాత పది జిల్లాలకే చోటు ఉంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై ఇంకా కేంద్రం గెజిట్‌ విడుదల చేయలేదు. రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా కొత్త జిల్లాల ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించకుండా కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామకాల నోటిఫికేషన్‌ ఎలా జారీ చేస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

అభ్యర్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నదని నిరుద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలోని వేలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులు స్థానికత అంశం పేరుతో మనోవేదనకు గురవుతున్నారు. చదివింది ఓ జిల్లాలో అయితే నివాసముండేది మరో జిల్లాలో ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. తాము ఏ జిల్లాకు స్థానికులం అని మదనపడుతున్నారు. నివాసం ఉండే సొంత జిల్లాలోనే స్థానికేతరులుగా మారాల్సిన పరిస్థితి తలెత్తింది. సొంత జిల్లాలో ఎక్కువ పోస్టులున్నా స్థానికేతరులుగానే దరఖాస్తు చేసేందుకు అవకాశముంటుంది.

 ఆమన్‌గల్ గతంలో పాలమూర్ జిల్లా.. ఇప్పుడు రంగారెడ్డి పరిధి

ఆమన్‌గల్ గతంలో పాలమూర్ జిల్లా.. ఇప్పుడు రంగారెడ్డి పరిధి

'నేను ఉమ్మడి నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలంలో పాఠశాల విద్యను చదివాను. మా కుటుంబం మోత్కూర్‌ మండలంలో స్థిరపడింది. 20 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నాం. నిబంధనల ప్రకారం మోత్కూర్‌ మండలంలోనే ఆధార్‌, ఆదాయ, కుల, నివాస, ఓబీసీ నాన్‌ క్రీమీలేయర్‌ ధ్రువపత్రాలు తీసుకున్నాను. ఒకే జిల్లా కావడంతో ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. సీఎం ఆదేశం ప్రకారం ఉపాధ్యాయ నియామకాలు కొత్త జిల్లాల ప్రకారం చేపడతామని విద్యాశాఖ ప్రకటించింది. నాలుగో తరగతి నుంచి 10వ తరగతి వరుసగా నాలుగేండ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో నేను పదో తరగతి వరకు చదివిన మండలం సూర్యాపేట జిల్లాలో ఉంది. మేము ఉంటున్న మోత్కూర్‌ మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో భాగమైంది. చదివింది ఒక జిల్లాలో, నివాసం ఇంకో జిల్లాలో ఉంది.

స్థానికత ఎలా...

స్థానికత ఎలా...

చదువు ఆధారంగా స్థానికత వర్తించినప్పుడు నేను ఆధార్‌, ఆదాయ, కుల, స్థానిక (రెసిడెన్స్‌) ధ్రువపత్రాలు ఎలా పొందాలి?. ఆ మండల తహశీల్దార్‌ ధ్రువపత్రాలు ఏ ప్రాతిపదికన ఇస్తారు?. ఈ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి'అని మధుసూదనాచారి అనే నిరుద్యోగ అభ్యర్థి అన్నారు. 'మాది ఆమన్‌గల్‌ మండలం ముద్విన్‌ గ్రామం. ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేటలో ఐదు నుంచి పదోతరగతి వరకు చదివాను. చదువు పరంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాకు స్థానికున్ని అవుతాను. జిల్లాల పునర్విభజనలో మా గ్రామం రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చింది. నా ఆధార్‌, ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలన్నీ ఆమన్‌గల్‌ మండలం పేరుతో ఉన్నాయి. డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటే నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందినట్లుగా ఆధార్‌, ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలుండాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి'అని ఉపాధ్యాయ అభ్యర్థి డీ వెంకటయ్య చెప్పారు.

 కొత్త జిల్లాల ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు

కొత్త జిల్లాల ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు

తెలంగాణలో కొత్త జిల్లాలు 2016, అక్టోబర్‌ 11వ తేదీన ఆవిర్భవించాయి. అయినా ఇప్పటి వరకు నోటిఫికేషన్లన్నీ ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే జారీ అయ్యాయి. కానీ కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రకారం జారీ అయితే అనేక ఆటంకాలు తలెత్తే ప్రమాదం ఉంది. సీఎం కేసీఆర్‌ మాత్రం ఉపాధ్యాయ నియామకాలను కొత్త జిల్లాల ప్రకారమే చేపట్టాలని నిర్ణయించడం అందరినీ గందరగోళానికి గురిచేస్తున్నది. కొత్త జిల్లాలకు గెజిట్‌ రాకపోవడంతో న్యాయపరమైన చిక్కులు రానున్నాయి. ఇంకోవైపు స్థానికత అంశం గందరగోళంగా మారడంతో అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం లేకపోలేదు. ఇన్ని సమస్యల నడుమ డీఎస్సీ ప్రక్రియ గట్టెక్కేనా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అసలు ఉత్తర్వులే రాలేదు...

అసలు ఉత్తర్వులే రాలేదు...

కొత్త జిల్లాల నేపథ్యంలో స్థానికత అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ఆదేశాలు విడుదల చేయలేదు. చదువు ఉన్న చోట ఆధార్‌, ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలు ఇవ్వాలని రెవెన్యూ శాఖ నుంచి ఉత్తర్వులు రాలేదు. ఇలాంటి ముందస్తు చర్యలేమీ తీసుకోకుండా హడావుడి నిర్ణయాలపై ఉపాధ్యాయ నియామకానికి జారీచేసిన మార్గదర్శకాలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ నియామకాలపై ఈనెల 28న సుప్రీం కోర్టులో విచారణ ఉంది. సుప్రీం కోర్టులో ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకోవడానికి ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు జారీచేసిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. స్థానికత సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నందున పాత జిల్లాల ప్రకారమైతే ఉపాధ్యాయ నియామకాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తేవి కాదని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

స్థానికతపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ ఇలా

స్థానికతపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ ఇలా

నాలుగు నుంచి పదో తరగతి వరకు వరుసగా నాలుగేండ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులుగా పరిగణిస్తామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జీ కిషన్ తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగానే ఉపాధ్యాయ నియామకాల మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. గతం నుంచి ఉన్న నిబంధననే పాటిస్తున్నామని, కొత్తగా ఏమీ మార్చలేదని చెప్పారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన సిలబస్‌ను టీఎస్‌పీఎస్సీనే విడుదల చేస్తుందని, ఇప్పటికే ఖాళీల వివరాలు ప్రభుత్వానికి అందజేశామని జీ కిషన్ వివరించారు. రాజ్యాంగబద్ధంగా ఉపాధ్యాయ నియామకాలుండాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తున్నది. ఉపాధ్యాయ నియామకాల నోటిఫికేషన్‌ కోర్టుల్లో వీగిపోయేలా జారీ చేయొద్దని, అభ్యర్థులకు నష్టం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని పేర్కొన్నది. సిలబస్‌ను తక్షణమే విడుదల చేయాలని, డిగ్రీ ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా బీఎడ్‌ అర్హత ఉన్న అందరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని తెలిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There will be doubts on Teachers recruitment in Telangana. CM KCR had dicided to recruitment as per New districts. Hence State Government decision leads confusion on candidates locality. Thousands of unemployed youth disappointed with government decision.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి