• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్, కేసిఆర్‌ లాస్ట్! బొత్స ఝాన్సీయే ఫస్ట్

By Srinivas
|

YS Jagan - K Chandrasekhar Rao
లోకసభలో మన రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యుల తీరు చాలా పేలవంగా ఉందని ఓట్ ఫర్ ఇండియా అనే స్వచ్చంధ సంస్థ తెలిపింది. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జూలై వరకు లోకసభ పనితీరును ఓట్ ఫర్ ఇండియా అధ్యయనం చేసింది. అందులో సభ జరిగిన తీరు, ఆయా పార్లమెంటు సభ్యులు సభను సద్వినియోగం చేసుకున్న అంశాలను వివరించింది. ముఖ్యమైన పది అంశాలపై పరిశీలన చేసి రిప్రజెంటేటివ్ ఎట్ వర్క్ అనే నివేదికను ప్రచురించింది. మంగళవారం లోక్‌సభ ఉప సభాపతి కరియా ముండా దానిని ఆవిష్కరించారు.

ఆ నివేదిక ప్రకారం.. పార్లమెంటు వేదికను సద్వినియోగం చేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఎంపీల్లో బొత్స ఝాన్సీ ప్రథమ స్థానంలో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆఖరు స్థానాలలో ఉన్నారు. సమావేశాలు జరిగిన ఎనబై ఐదు రోజుల్లో మన ఎంపిల హాజరు శాతం 59 ఉండగా, రాష్ట్రాల వారీగా చూస్తే ఎపి చివరి స్థానంలో నిలిచింది. మొత్తంగా చివరి నుంచి 2వ స్థానంలో ఉంది.

మొత్తంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఎనబై ఒక్క శాతం హాజరుతో పదిహేడవ స్థానంలో నిలిచింది. ఎంఐఎం హాజరు 29వ స్థానం, తెలుగుదేశం 32వ స్థానం, తెరాస హాజరు 39వ స్థానం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎనిమిది శాతం హాజరుతో చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు మినహా ఎంపీల్లో ఉండవల్లి అరుణ్‌ కుమార్ 85 రోజులు, బొత్స ఝాన్సీ, హర్ష కుమార్ 74 రోజుల చొప్పున హాజరై తొలి మూడు స్థానాల్లో నిలిచారు. మేకపాటి రాజమోహనరెడ్డి 6 రోజులతో, జగన్ 8, విజయశాంతి 14, కెసిఆర్ 14 రోజులతో చివరి నాలుగు స్థానాల్లో ఉన్నారు.

నియోజకవర్గ ప్రజల సమస్యలపై పార్లమెంటులో గొంతెత్తే అవకాశం లభించకున్నా రాతపూర్వక ప్రశ్నల రూపంలో సమాధానాలు రాబట్టొచ్చు. సగటున 72.31 శాతం ప్రశ్నలతో ఎపి 11వ స్థానంలో నిలిచింది. సభలో లేవనెత్తిన ప్రశ్నల సగటును చూస్తే ఎంఐఎందే పైచేయి. అందరికంటే ఎక్కువగా 248 ప్రశ్నలతో మొదటి స్థానంలో నిలిచింది. ఒక్క ప్రశ్నా అడగని వైయస్సార్ కాంగ్రెసు 38వ స్థానంలో, టిఆర్ఎస్ చివరన నిలిచాయి. ఎంపీల వారీగా చూస్తే.. అసదుద్దీన్ ఒవైసీ 248 ప్రశ్నలు (సభలో 6వ స్థానం), అంజన్‌కుమార్ యాదవ్ 210 ప్రశ్నలు (18), రాయపాటి 205 ప్రశ్నలు(24) సంధించి.. తొలి మూడు స్థానాల్లో నిలిచారు.

ఇక విజయశాంతి, జగన్, సర్వే సత్యనారాయణ, సబ్బం హరి, ఎస్పివై రెడ్డి, బలరాం నాయక్, మేకపాటి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, కెసిఆర్, కనుమూరి బాపిరాజు, చింతామోహన్, జి.వినోద్ తదితరులు ఒక్క ప్రశ్నా వేయలేదు. విధాన నిర్ణయాలు తీసుకునే లోక్‌సభ చర్చల్లో మన ఎంపీలు పాలుపంచుకునేదీ తక్కువే. ఈ విషయంలో ఎంఐఎం మెరుగ్గా.. 22వ స్థానంలో నిలవగా.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ 23, టిడిపి 27వ స్థానంలో నిలిచాయి.

వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలవి చివరి స్థానాలే. ఎంపీల్లో.. బొత్స ఝాన్సీ (56 చర్చల్లో), నామా నాగేశ్వరరావు(30), కావూరి సాంబశివ రావు(12) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. కెసిఆర్, జగన్ ఒక్క చర్చలో మాత్రమే పాల్గొన్నారు. అసలు చర్చల్లో పాల్గొనని ఎంపీల్లో చింతామోహన్, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, సబ్బం హరి, రమేశ్ రాథోడ్, మేకపాటి, విజయశాంతి ఉన్నారు. మరో విషయం ఏమిటంటే.. మన రాష్ట్రం నుంచి ఒక్క ఎంపీ కూడా ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టలేదు.

సభా కార్యక్రమాలకు అడ్డుపడటంలో మాత్రం మన రాష్ట్ర ఎంపీలు ముందున్నారు. ముఖ్యంగా, తెలంగాణ అంశంపై లోక్‌సభ చాలాసార్లు వాయిదా పడింది. ఏడాది కాలంలో 12,201 సార్లు సభకు అంతరాయం కలగ్గా.. 110 సార్లు వాయిదా పడింది. గత ఏడాది కాలంలో 24 సార్లు తెలంగాణ అంశంపై సభ వాయిదా పడగా బైఠాయింపులూ జరిగాయి. గత ఏడాది రాష్ట్రానికి చెందిన సభ్యులెవరూ సభ నుంచి వాకౌట్ చేయలేదు. తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రతి ఎంపీ రూ.14 కోట్లు వినియోగించుకోవచ్చు. దీన్నే ఎంపీ ల్యాడ్స్‌గా వ్యవహరిస్తారు.

రాష్ట్రం 37 శాతం వినియోగంతో 9వ స్థానంలో నిలిచింది. 42 మంది ఎంపీలున్న మన రాష్ట్రంలో 588 కోట్ల వినియోగానికి అవకాశముంటే.. 217 కోట్లే ఖర్చు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు 44 శాతం నిధులను వినియోగించుకోగా.. తరువాత స్థానాల్లో టిడిపి (42%), టీఆర్ఎస్ (34), కాంగ్రెస్ (32), ఎంఐఎం (16%) నిలిచాయి. విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీ 7.80 కోట్లు వినియోగించుకుని రాష్ట్రంలో తొలిస్థానం కొట్టేశారు. నిమ్మల కిష్టప్ప (7.51 కోట్లు), సురేశ్ షెట్కార్ (6.94 కోట్లు) 2, 3 స్థానాల్లో నిలిచారు.

చివరి నుంచి చూస్తే చింతా మోహన్ (2.09 కోట్లు), అసదుద్దీన్ ఒవైసీ (2.30 కోట్లు), మధుయాష్కీ (2.62 కోట్లు) ఉన్నారు. తమ నియోజకవర్గ సమస్యలు, ఇతర అంశాలను సభ్యులు ప్రత్యేక ప్రస్తావన ద్వారా లేవనెత్తుతారు. కానీ, ఎంపీలు దీనిపై పెద్దగా ఆసక్తి చూపటం లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సగటున 1.99, టీఆర్ఎస్ ఒకటి, టీడీపీ 0.33 చొప్పున ప్రత్యేక ప్రస్తావనలు చేస్తే.. వైయస్సార్ కాంగ్రెసు అసలు ఏ ప్రస్తావనా చేయలేదు. ఎంపీల్లో బొత్స ఝాన్సీలక్ష్మి 15, లగడపాటి రాజగోపాల్ 4, నామా నాగేశ్వరరావు 2 ప్రస్తావనలతో తొలి మూడు స్థానాల్లో నిలిచారు. కనుమూరి బాపిరాజు, హర్ష కుమార్, మధుయాష్కీ గౌడ్, రాయపాటి సాంబశివ రావు ఒక్కో ప్రస్తావన చేశారు.

English summary
Vote for India Survey said that YSR Congress and Telangana Rastra Samithi did not used parliament sessions between August 2011 and July 2012.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X