వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు సభ్యుడు, సత్య సాయి బాబా సోదరుడి కుమారుడు రత్నాకర్‌తో గల సంబంధాలపై రాజకీయ వర్గాల్లో దుమారం చెలరేగుతోంది. రత్నాకర్ వైయస్ జగన్‌తో భేటీ కావడం ఈ దుమారానికి కారణమైంది. అనంతపురం జిల్లాలో ఓదార్పు యాత్ర సందర్భంగా జగన్‌ను రత్నాకర్ తనతో పాటు సత్య సాయి బాబా మహా సమాధి వద్దకు తీసుకుని వెళ్లారు. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు వైయస్ జగన్‌ను లక్ష్యం చేసుకోవడానికి కారణమైంది.
ఇది తోక అంటే అదిగో పులి అన్నట్లుగా సత్య సాయి ట్రస్టులో వైయస్ జగన్‌కు భాగస్వామ్యం ఉందా తేల్చాలని తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకుడు నిమ్మల కిష్టప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సత్య సాయి బాబా మరణించినప్పుడు అటు వైపు కూడా చూడని జగన్, 35 లక్షల రూపాయలు పట్టుబడిన తర్వాత రత్నాకర్‌తో మంతనాలు జరపడం అనుమానంగా ఉందని ఆయన అన్నారు. ఏమైనా, లోగుట్టు సత్య సాయి బాబాకు తెలుసునని వ్యాఖ్యానిస్తున్నారు.