జవాబులు లేని ప్రశ్నలు?: ‘మేధోమథన’ సంస్థలో డైరెక్టర్లు కేంద్ర మంత్రులు: ఇండియా ఫౌండేషన్ దూకుడు

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ : అది ఒక చిన్న సంస్థ. కేరళలో అతివాద ఇస్లాం, ఆదివాసీల బలవంతపు మత మార్పిళ్లు తదితర అంశాలపై దాదాపు 2009 నుంచి మోనాగ్రాఫులు రూపొందిస్తూ వచ్చిన చిన్నపాటి స్వచ్చంధ సంస్థ.. దాని పేరు ఇండియన్ ఫౌండేషన్. అటువంటి చిన్న సంస్థ 2014 తర్వాత అనతికాలంలోనే ఊహించనంత బడా సంస్థగా మారిపోయింది. ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత ప్రభావశీలమైన 'మేథో మథన' వేదికల్లో ఒకటిగా ఆ సంస్థగా నిలిచింది.

విదేశీ, స్వదేశీ కార్పొరేట్ పారిశ్రామిక పెద్దలు, కేంద్ర మంత్రులు చర్చల ద్వారా తమకు అనువైన ప్రభుత్వ విధానాలను రూపొందించుకొనేందుకు వీలైన వేదికగా ఎదిగింది. చిన్నపాటి సంస్థ స్వల్పకాలంలోనే అంత ఉన్నత స్థానానికి ఎలా ఎగబాకింది? దీనివెనుక ఎవరున్నారు? ఈ ప్రశ్నలకు జవాబులు అన్వేషిస్తూ 'ద వైర్‌' అనే వెబ్ సైట్ సాగించిన పరిశీలనలో ఆశ్చర్యపోయే అంశాలు వెలుగు చూశాయి.

 డైరెక్టర్లుగా కేంద్ర మంత్రులు నైతికతకు విరుద్ధం

డైరెక్టర్లుగా కేంద్ర మంత్రులు నైతికతకు విరుద్ధం

ఇండియా ఫౌండేషన్‌ సంస్థ జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌ తనయుడు శౌర్య దోవల్‌కు చెందింది కావడం ఒక విశేషమైతే, కేంద్ర మంత్రులు ఇందులో డైరెక్టర్లుగా ఉండటం మరో ఆసక్తికర పరిణామం. ఒక జాతీయ భద్రతా సలహాదారు తనయుడిగా భారత రాజకీయాల్లో నూతన వారసత్వం నెరిపేందుకు పూనుకున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వేతర సంస్థల్లో డైరెక్టర్ స్థాయి పదవులను కేంద్ర మంత్రులు నిర్వహించడం నైతికతకు విరుద్ధం. ఒక రాజకీయ పార్టీ కానీ, ప్రధానకార్యదర్శి పదవుల్లో ఉన్నవారు వ్యక్తిగతంగా కానీ విదేశాల నుంచి నిధులు తీసుకోవడం నిబంధనలకు విరుద్ధం.

 ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్లుగా మంత్రుల సమాధానమే కరువు

ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్లుగా మంత్రుల సమాధానమే కరువు

గతంలో సోనియాగాంధీ అధికార యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు విపక్షంలో బీజేపీ చేసిన నానా యాగీ అంతా ఇంతా కాదు.. దీంతో ఆమె తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, మళ్లీ గెలిచారు. ఫైనాన్షియల్‌ సేవలందించే బడా వాణిజ్య సంస్థ 'జెమినీ ఫైనాన్షియల్‌ సర్వీ సెస్‌' కంపెనీలో భాగస్వామి శౌర్య దోవల్‌. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న స్వచ్చంధ సంస్థ ఇండియా ఫౌండేషన్‌లో డైరెక్టర్లు కేంద్ర మంత్రులు సురేశ్ ప్రభు, నిర్మలా సీతారామన్, జయంత్ సిన్హా, ఎంజె అక్బర్‌లతోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్. గతంలో సోనియాపై విమర్శలకు సారథ్యం వహించిన బీజేపీ నేతలుగా వారు రాజీనామా చేసేందుకు సిద్ధమేనా? అంటే సమాధానమే కరువవుతోంది.

 వివరణకు, వాస్తవాలకు పొంతన కరువు

వివరణకు, వాస్తవాలకు పొంతన కరువు

తమ ఫౌండేషన్, అందులో డైరెక్టర్లకు వాణిజ్య ప్రయోజనాలతోగాని, వ్యక్తిగత ప్రయోజనాలతో గానీ సంబంధం లేదని ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ శౌర్య దోవల్ వివరణ ఇచ్చారు. ఈశాన్య భారతంలో ప్రగతి, భారతదేశంలో పెట్టుబడుల వాతావరణం, భౌగోళిక రాజకీయాలు, సంస్క్రుతి తదితర అంశాలపై సమావేశాలు ఏర్పాటు చేయడమే తమ ఫౌండేషన్ ఎజెండా అని సెలవిచ్చారు శౌర్య దోవల్. విదేశీ విరాళాలు స్వీకరించడం లేదని కూడా చెప్పారు. తమ సంస్థ పూర్తిగా పారదర్శకంగా పని చేస్తున్నదని పేర్కొన్న శౌర్య దోవల్.. తనకు సదరు వెబ్ సైట్ పంపిన ప్రశ్నావళిపై స్పందించేందుకు నిరాకరించడం గమనార్హం. ఇక మంత్రులుగా ఉన్న వారిలో నిర్మలా సీతారామన్, సురేశ్ ప్రభు తదితరులు స్పందించిన పాపాన పోలేదు. శౌర్య దోవల్ వివరణకు, వాస్తవాలకు పొంతన లేకుండా ఉన్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 ప్రధాని మోదీ ప్రకటనకు.. ఆచరణకు భిన్నమైన వైనం

ప్రధాని మోదీ ప్రకటనకు.. ఆచరణకు భిన్నమైన వైనం

ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ కో ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఒఇసిడి) సభ్య దేశాలకు, ఆసియా దేశాలకు మధ్య వాణిజ్య లావాదేవీలు, పెట్టుబడుల రాక వంటి విషయాల్లో జెమిని ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ 'లాబీయింగ్‌' వంటి ప్రత్యేక సేవలు అందిస్తుంది. 'శక్తి కేంద్రాలను (పవర్‌ కారిడార్స్‌) పూర్తిగా తుడిచేస్తాం' అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీని శౌర్య దోవల్‌ నిర్వహిస్తున్న పాత్ర నీరు గార్చేలా ఉన్నది. జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌ తనయుడుగా శౌర్య దోవల్‌ అత్యంత రాజకీయ ప్రభావం చూపగలగడం 'యాధృచ్చికం'గానే భావించినా మొన్న సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా భాగస్వామిగా ఉన్న ఒక ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ సౌదీ రాజుతో రక్షణ ఒప్పందాల ద్వారా అయాచిత లబ్ది పొందిందన్న ఆరోపణలు, నిన్న అమిత్‌ షా తనయుడు జయ్‌షా కంపెనీల బాగోతంగా, ఇప్పుడు శౌర్య దోవల్‌ వ్యవహారం దేశంలో రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాల సమ్మిళితంగా 'కొత్తరకం వారసత్వ దోపిడి పోకడ'గా మారనున్నదని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

 సంస్థ కార్యక్రమాలకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల స్పాన్షర్షిప్

సంస్థ కార్యక్రమాలకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల స్పాన్షర్షిప్

ఇండియా ఫౌండేషన్‌లో ఏకంగా నలుగురు కేంద్ర మంత్రులు, ఆరెస్సెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ప్రధాన కార్యదర్శి డైరెక్టర్లుగా ఉండి, ప్రధానమంత్రి కార్యాలయంలో అత్యంత ప్రభావశీల పదవిలో తండ్రిని కలిగి ఉన్న ఒక వ్యాపారవేత్త నిర్వహణలో 'ఇండియా ఫౌండేషన్‌' దేశంలోనే అత్యంత ప్రభావశీల మేధో మథన సంస్థగా మారడం వెనుక ఏం జరిగి ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంస్థ నిర్వహించిన ప్రతి కార్యక్రమానికీ ఆయా రంగాల్లోని కీలక నిర్ణయాలు తీసుకునే నాయకులు, ఉన్నతాధికారులతోపాటు దేశ, విదేశాలకు చెందిన ప్రయివేటు కంపెనీల ప్రతినిధులు హాజరౌతారు. కేవలం హాజరు కావడమే కాదు.ఇండియా ఫౌండేషన్‌ కార్యక్రమాలకు పోషకులు (స్పాన్షర్‌షిప్‌)గా ఉంటారు. ఇంతటి 'గొప్ప విజయం', గొప్ప బలహీనత వెనుక పలు అంశాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి.

 వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు అనుమతించని నిబంధనలు

వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు అనుమతించని నిబంధనలు

ఒకటి ఆయాచిత లబ్ది, లాయిబీంగ్‌ చేసి ప్రభుత్వం నుంచి ప్రాజెక్టులు దక్కేలా చేసినందుకు గాను స్వదేశీ, విదేశీ బడా కంపెనీలు ఫౌండేషన్‌ 'కార్యక్రమాల'కు స్పాన్షర్‌షిప్‌ పేరుతో ప్రోత్సాహం అందిస్తున్నారు. వాస్తవానికి ఇండియా ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థగా ఉన్నందున వ్యాపార కార్యకలాపాలు నిర్వహించరాదు. ఆదాయ వ్యయాల పత్రాలను కూడా ఒక ట్రస్టుగా బహిర్గతం చేయాలి. నలుగురు కేంద్ర మంత్రులు డైరెక్టర్లుగా ఉన్న ఈ సంస్థ ఆదాయ వనరులపై 'ద వైర్‌' అడిగిన ప్రశ్నలకు కనీసం సమాధానం ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. ఈ సంస్థలోని ఆరుగురు డైరెక్టర్లకు ప్రశ్నావళి పంపితే డైరెక్టర్లుగా ఉన్న మంత్రులెవ్వరూ కనీసం స్పందించలేదు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ మాత్రం 'తగిన వ్యక్తి స్పందిస్తారని' మాత్రమే బదులిచ్చారు.

 పార్టీ, పార్టీ నేతలు విదేశీ నిధుల నిరాకరణ కుదరదు

పార్టీ, పార్టీ నేతలు విదేశీ నిధుల నిరాకరణ కుదరదు

వాస్తవంగా ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు ఆదాయం వచ్చే పదవుల్లో కొనసాగరాదు. కానీ ఇక్కడ కేంద్ర మంత్రులే డైరెక్టర్లుగా ఉన్నారు. మరో ముఖ్యమైన అంశం ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం -2010'లోని సెక్షన్‌ 3 ప్రకారం ఏ రాజకీయ పార్టీ కానీ, దాని ఆఫీస్‌ బేరర్లు కానీ విదేశీ నిధులు స్వీకరించరాదు. ఇండియా ఫౌండేషన్‌ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న రామ్‌ మాధవ్‌ బిజెపి ప్రధానకార్యదర్శిగా కొనసాగుతున్నారు. అందువల్ల ఇదంతా కచ్చితంగా నేరమే అవుతుందని, దీనిపై విచారణ చేపట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఆదాయ వనరులపై ప్రశ్నించగా శౌర్య దోవల్‌ మాత్రం 'సదస్సులు, ప్రకటనలు, జర్నల్‌' ద్వారా లభించినట్లు చెప్పారు. అయితే ట్రస్టుగా నమోదైన సంస్థ రోజువారీ వ్యాపారాలు ఎలా నిర్వహిస్తుంది? అసలు ఎవ్వరెవ్వరు ఎంతెంత ఇచ్చారు? ట్రస్టు కార్యాలయాన్ని ఎలా అద్దెకు ఇస్తారు? ఇలాంటి ప్రశ్నావళికి మాత్రం బదులివ్వలేదు.

కంపెనీల విరాళాలు ఎంతో వెల్లడికి నిరాకరణ

కంపెనీల విరాళాలు ఎంతో వెల్లడికి నిరాకరణ

'స్మార్ట్‌ బోర్డర్‌ మేనేజ్‌మెంట్‌' పేరుతో ఇండియా ఫౌండేషన్‌ నిర్వహించిన రెండు కార్యక్రమాల్లో ఇదొకటి. వేదిక పోస్టర్లపై చూడండి ఈ కార్యక్రమాలను స్పాన్షర్‌ చేస్తున్న కంపెనీల పేర్లు చూడండి. అన్నీ కూడా బోయింగ్‌, ఇజ్రాయెల్‌ కంపెనీ మేగల్‌ వంటి విదేశీ రక్షణ, వైమానిక కంపెనీలే. డిబిఎస్‌ వంటి విదేశీ బ్యాంకులు కూడా ఇండియా ఫౌండేషన్‌ స్పాన్షర్‌షిప్‌ల్లో ఉన్నాయి. భారత్‌కు చెందిన అనేక కార్పొరేట్‌ కంపెనీలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమాల నిర్వహణకు ఈ కంపెనీలు ఎంత చెల్లించాయి? ఎవరికి చెల్లించాయి? అనే ప్రశ్నలకు మాత్రం ఇండియా ఫౌండేషన్‌ బదులివ్వడం లేదు.

 మంత్రులు రాజీనామా చేయాల్సిందే

మంత్రులు రాజీనామా చేయాల్సిందే

ఇండియా ఫౌండేషన్‌పై ద వైర్ లేవనెత్తిన పలు ప్రశ్నలకు కేంద్ర మంత్రులు గానీ, శౌర్య దోవల్‌ కానీ సమాధానాలు ఇవ్వక పోవడంతో కేంద్ర ప్రభుత్వంపై విపక్ష పార్టీలు చెరిగాయి. జవాబు చెప్పలేని మంత్రులు పదవులకు రాజీనామా చేయాల్సిందేనని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. ఇండియా ఫౌండేషన్‌ డైరెక్టర్లు మంత్రులను తక్షణమే మంత్రి పదవుల నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని డిమాండ్‌ చేసింది. 'సమాధానాలు చెప్పలేని ప్రశ్నలు చాలా మిగిలిపోయాయి. అయాచిత లబ్దికి ఇదే నిదర్శనం. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న మంత్రులు ఇంకా పదువుల్లోనే కొనసాగుతున్నారు. వారంతా కచ్చితంగా రాజీనామా చేయాలి' అని ఏచూరి డిమాండ్‌ చేశారు.

 ఆయాచిత లబ్దికి నిదర్శనమన్న కాంగ్రెస్

ఆయాచిత లబ్దికి నిదర్శనమన్న కాంగ్రెస్

కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నవారు ప్రభుత్వేతర సంస్థకు డైరెక్టర్లుగా ఎలా ఉంటారనీ, ఇదే అయాచిత లబ్దికి ప్రత్యక్ష నిదర్శనమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ విమర్శించారు. డైరెక్టర్లుగా వారి ప్రయోజనాలు వారు పొందుతుంటారనీ, అందువల్ల ఇది కూడా పదవిని అడ్డుపెట్టుకొని లాభాలు గడించడమే అవుతుందని ఆయన అన్నారు. జాతీయ సలహా మండలి (ఎన్‌ఏసి) ఛైర్‌పర్సన్‌ పదవి చేపట్టిన సమయంలో పార్లమెంటు సభ్యత్వానికి తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజీనామా చేశారనీ ఆయన గుర్తు చేశారు. ఆమె కనీసం కేంద్ర మంత్రి కూడా కాదని, అయినా పార్లమెంటులో బిజెపి వాళ్లు రభస చేశారనీ, వారంతా ఇప్పుడేమంటారనీ సిబల్‌ నిలదీశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India Foundation, run by Shaurya Doval, who is partner in a financial services firm, has top ministers as directors, and relies on financial support from foreign and Indian corporates some of which have dealings with the government. For an organisation that has been around since 2009 producing monographs on themes like radical Islam in Kerala and the ‘forced conversion’ of adivasis, the rise of the India Foundation since 2014 has been nothing short of meteoric.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి