జయప్రకాష్ 2014 మిషన్

'మిషన్-2014'లో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాల్ని నాయకత్వం బేరీజు వేస్తుంది. అనంతరం, సభ్యత్వ నమోదుతో పార్టీ పునర్నిర్మాణం, విస్తరణపై దృష్టి కేంద్రీకరించనుంది. నిజాయతీ, నాయకత్వ పటిమగల వ్యక్తులనే పార్టీలో చేర్చుకోవాలని లోక్ సత్తా భావిస్తోంది. ఈ మేరకు అనుబంధ, ప్రాథమిక, కార్యనిర్వాహక సభ్యుల పేరిట మూడు రకాల సభ్యత్వాలు ఇవ్వాలని నిర్ణయించింది. వీరితోపాటు సమాజంలో ఒకస్థాయిలో ఉండి రాజకీయాల్లో, జనం జీవితాల్లో మార్పు తేవాలన్న తపన ఉన్న ప్రభావశీలురైన వ్యక్తులను పార్టీయే సాదరంగా ఆహ్వానించి గౌరవ సభ్యుత్వం ఇస్తుంది.
సభ్యత్వ నమోదు పూర్తయ్యాక పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండేలా పార్టీ పదవులకు నాయకత్వం ఎన్నికలు నిర్వహించనుంది. జిల్లాల వారీగా సమగ్రమైన సమీక్ష నిర్వహించాక పార్టీ కమిటీలను పునర్నిర్మించనుంది. ఆ తర్వాత రక్షిత తాగునీరు, పారిశుద్ధ్యం, సొంత ఇల్లు, రహదారులపై గుంటలు లాంటి ప్రజల దైనందిన సమస్యల నుంచి భూ ఆక్రమణల వరకు వివిధ సమస్యలను గుర్తించి, వాటికి నిర్దిష్టమైన పరిష్కారాలను చూపుతూ ప్రజల ముందుకు వెళ్లాలని పార్టీ సంకల్పించింది.
మిషన్ 2014 అమలుకు గ్రేటర్ హైదరాబాదు నగరపాలక ఎన్నికలతోనే శ్రీకారం చుడతామని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ చెప్పారు. ఆ ఎన్నికల్లో తమకు పూర్తిగా సానుకూల పరిస్థితులు ఉంటాయన్నారు. ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో లోక్ సత్తాకు ఓటేయటం వృథా అన్న విషప్రచారం తమకు తీవ్ర నష్టం చేసిందని, తమకున్న ఆదరణలో 10 శాతంలోపు మాత్రమే ఓట్లుగా పొందగలిగామని ఆయన శుక్రవారమిక్కడ మీడియా ప్రతినిధులతో అన్నారు. "గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక ఎన్నికల్లో కులాల ప్రాతిపదికన ఓట్లు చీలిపోయే అవకాశాలు తక్కువ. గెలుపు, ఓటముల గురించి ప్రజల్లో పెద్దగా ఒత్తిడి ఉండదు కాబట్టి ఈ ఎన్నికల్లో కచ్చితంగా మాకు ఓట్లు పడతాయి" అన్నారు.












Click it and Unblock the Notifications