విషమిస్తున్న కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి

కెసిఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేయడం, పత్రికా కార్యాలయాలకు, మానవ హక్కుల కమిషనర్ సుభాషణ్ రెడ్డికి ఫోనులు చేసి మాట్లాడడంతో ఖమ్మం ఆస్పత్రిలో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. పోలీసులు తనపై తీవ్రమైన దౌర్జన్యం చేస్తున్నారని కెసిఆర్ ఆరోపించారు. సుభాషణ్ రెడ్డి జోక్యంతో పోలీసులు ఆస్పత్రిని ఖాళీ చేశారు. కెసిఆర్ వద్ద పోలీసులు ఎవరూ లేకుండా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఆయన వద్ద ఉన్నారు.
ఆమరణ నిరాహార దీక్షను కెసిఆర్ తనంత తానుగా ఏ షరతులు పెట్టకుండా విరమించారనే అపోహతో విద్యార్థులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ కు వ్యతిరేకంగా మంగళవారం ఆందోళనలకు దిగారు. తెరాస నాయకులు, తెరాస సిద్ధాంతకర్త జయశంకర్ వివరణ ఇవ్వడంతో వారు శాంతించి, కెసిఆర్ కు అనుకూలంగా మారారు.