హైదరాబాద్: సమైక్యాంధ్ర నినాదంతో లోకసభలో ప్లకార్డును ప్రదర్శించిన తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను అధిష్టానం మందలించినట్లు కాంగ్రెసు సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి చెప్పారు. జగన్ కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్న తెలంగాణ నాయకులు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరిణతి లేని నాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికలకు ముందు జై తెలంగాణ అన్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వడానికి తమ పార్టీ అంగీకరించింది కాబట్టే చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన మాట తప్పబోరని ఆయన అన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ నాయకుల అపోహలను తొలగించడానికి తమ పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తోందని, అది పార్టీ అధిష్టానం బాధ్యత కూడా అని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. తెలంగాణ 53 ఏళ్ల పోరాట ఫలితమని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు అవసరమైన సబ్ కమిటీని వేస్తారని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి