• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణపై కదిలిన సోనియా గాంధీ

By Pratap
|

Sonia Gandhi
న్యూఢిల్లీ/మంగళూర్/హైదరాబాద్: తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి శనివారం తెలంగాణ అంశంపై దృష్టి సారించారు. అటు ఢిల్లీలోనూ ఇటు హైదరాబాదులోనూ తెలంగాణ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. సోనియా గాంధీతో శనివారం కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీ సమావేశమయ్యారు. తెలంగాణపై కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనపై స్పష్టత కోరుతూ తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు రాజీనామాలు చేసిన నేపథ్యంలో సోనియా కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. కాగా, తెలంగాణపై రెండో ఎస్సార్సీ అవసరం లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. సమస్యను చర్చల ద్వారా ప్రశాంత వాతావరణంలో పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

తెలంగాణపై పోరాటానికి ఏర్పడిన అఖిల పక్ష జెఎసిలోకి తెలుగుదేశం పార్టీని రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు కాంగ్రెసు పార్టీ ఒక వైపు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మరో వైపు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. జెఎసి కన్వీనర్ కోదండరామ్ అందుకు తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిని కలిశారు. అయితే తాము అందుకు సిద్ధంగా లేమని నాగం స్పష్టం చేశారు. ప్రముఖ సినీ నటి, పార్లమెంటు సభ్యురాలు విజయశాంతిని తెరాస శాసనసభ్యులు జెఎసిలోకి అహ్వానించారు. వారు విజయశాంతిని కలిసి జెఎసిలో చేరాల్సిందిగా కోరారు.

మరో వైపు, ముఖ్యమంత్రికి తమ రాజీనామా లేఖలు ఇచ్చిన మంత్రులు, కాంగ్రెసు ఎమ్మెల్యేలు విడివిడిగా సమావేశమయ్యారు. తెలంగాణ సాధన కోసం తమ కార్యాచరణపై వారు చర్చించారు. తెలంగాణ మంత్రులు సోమవారం ఢిల్లీ వెళ్లి అధిష్టానం నాయకులను కలుసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను కలిశారు. తెలంగాణ ప్రక్రియ కొనసాగుతుందని వీరప్ప మొయిలీ చెప్పిన విషయాన్ని మధుయాష్కీ గుర్తు చేశారు. కేంద్రం నుంచి మూడో ప్రకటన అవసరం లేదని, తెలంగాణ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తారనే స్పష్టత మాత్రమే కావాలని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్రం ప్రకటించినట్లు ప్రారంభించాలని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. పరిస్థితిని తామొక్కరమే చక్కదిద్దుతామనే కేంద్ర ప్రభుత్వ వైఖరి సరైంది కాదని ఆయన న్యూఢిల్లీలో అన్నారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యమాల వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు రాజీనామాలు చేయడం సరైంది కాదని, ఏదైనా ఉంటే అధిష్టానంతో మాట్లాడుకోవడం మంచిదని ఆయన గుంటూరులో అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా లేదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

కాగా, అఖిల పక్ష జెఎసిలో చేరకూడదని తెలుగుదేశం నిర్ణయించుకోవడంపై ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల జెఎసి తీవ్రంగా మండిపడింది. తెలుగుదేశం నాయకులను తెలంగాణలో తిరగనివ్వబోమని హెచ్చిరించింది. 2010 తెలంగాణ రాష్ట్ర సాధన సంవత్సరంగా ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X