చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యారు. చెన్నైకి తిరిగి వెళ్లొచ్చని సింగపూర్ వైద్యులు ఆయనకు తెలిపారు. సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో చికిత్సపొందిన రజనీ డిశ్చార్జ్ అయిన తర్వాత అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారని పరీక్షలు జరిపిన అనంతరం అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో రజనీ చెన్నై వచ్చేందుకు ఆయన కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆయన కోసం ప్రత్యేకంగా ఇంటిని సిద్ధం చేయాలన్న ఆలోచన విరమించుకున్నారు. పోయెస్ గార్డెన్ ఇంట్లోనే ఉంటానని రజనీ చెప్పడంతో అక్కడే ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. వాస్తు ప్రకారం కూడా కొన్ని మార్పులు చేస్తున్నట్టు సమాచారం. రాణా షూటింగ్ సందర్భంగా అస్వస్థతకు గురైన రజనీకాంత్ చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కూడా రెండు సార్లు ఆస్పత్రిపాలయ్యారు.