గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసు పార్టీలపై మంగళవారం మరోసారి విరుచుకు పడ్డారు. ఉప ఎన్నికలు పూర్తయినందున ఆయన తన ఓదార్పు యాత్రను గుంటూరు జిల్లాలో తిరిగి ప్రారంభించారు. జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలో ఆయన ఓదార్పు యాత్ర మంగళవారం ప్రారంభమైంది. కారుమంచి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ విగ్రహాలను ఆవిష్కరించిన జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ఎంతగా కుమ్మక్కయ్యాయంటే సమాచార హక్కు చట్టం కమిషనర్లను పంచుకొని అమ్మేంత స్థాయిలో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో నీచ రాజకీయాలు చేస్తున్నాయన్నారు.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ నేతలకు చిత్తశుద్ధి లేదన్నారు. సమస్యలను ఎప్పుడో గాలికి వదిలేశాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని అప్రతిష్ట పాలు చేసేందుకే ఆ పార్టీలు శ్రద్ధ చూపిస్తున్నాయన్నారు. ప్రజల కష్టాలు చూస్తుంటే తనకు చాలా బాధేస్తుందన్నారు. టిడిపి, కాంగ్రెసులకు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పంట రైతుల వద్ద ఉన్నప్పుడు రూ.700గానే ఉందని కానీ దళారుల చేతుల్లోకి వెళ్లాక రూ.1000 నుండి రూ.1500 వరకు పెరిగిందని విమర్శించారు. కాగా కారుమంచిలో ప్రారంభమైన జగన్ ఓదార్పు యాత్ర పైకల్లు, గుంటుపాలెం, భాస్కరనగర్, చినకంచర్ల, ముండ్రవారిపాలెం మీదిగా వెళుతోంది.