వైయస్ నేరస్థుడే, కొడుక్కోసం కుట్ర: సిబిఐ చార్జిషీట్

"దివంగత రాజశేఖర రెడ్డి అవినీతి నిరోధక చట్టంలోని 11వ సెక్షన్ కింద నేరానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఐదో నిందితుడైన వెంకటరామిరెడ్డి (నాటి వుడా వైస్ చైర్మన్)ని ప్రభావితం చేసి... అతి దుర్మార్గమైన రాంకీ లేఔట్ ప్లాన్‌ను ఆమోదించేలా చేశారు. వుడా మాస్టర్ ప్లాన్‌కు భిన్నంగా ఉన్న ఈ ప్లాన్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వానికి నష్టం చేశారు. రాంకీ అధిపతి అయోధ్య రామిరెడ్డికి అయాచిత లబ్ధి చేకూర్చారు. దీనివల్లే... జగతి పబ్లికేషన్స్‌లో ఆయన టీడబ్ల్యూసీ, మెసర్స్ ఈఆర్ఈఎస్‌ల ద్వారా రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టారు'' అని సీబీఐ తన చార్జిషీట్‌లో వివరించింది. దీంతోపాటు అవినీతి నిరోధక చట్టం, 1988లోని 11వ సెక్షన్‌ను పూర్తిగా వివరిస్తూ... దీని ప్రకారం వైఎస్‌కు ఆరునెలల నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా పడే అవకాశం ఉందని తెలిపింది.
తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లబ్ధి పొందినట్లు చార్జిషీటులో సీబీఐ నిర్ధారించింది. "ఫార్మాసెజ్‌లో గ్రీన్ బెల్ట్‌ను 250 మీటర్ల నుంచి 50 మీటర్లకు తగ్గించేలా జగన్ తన తండ్రిపై ఒత్తిడి తెచ్చారు. 2005 నవంబర్ 23న దీనిపై వైఎస్ నిర్ణయం తీసుకున్నారు. దీని మేరకు ఉడా వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి గ్రీన్ బెల్ట్‌ను 50 మీటర్లకు పరిమితం చేసే ప్లాన్‌ను ఆమోదించారు. దీనికి ప్రతిఫలంగానే జగన్ పెట్టుబడి రూపంలో రూ.10 కోట్లు పొందారు'' అని సిబిఐ తెలిపింది. ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రిని ప్రభావితం చేసి, అయోధ్య రామిరెడ్డికి అయాచిత లబ్ధి చేకూర్చిన, క్విడ్ ప్రొకోకు పాల్పడిన జగన్ అవినీతి నిరోధక చట్టం, 1988లోని 9, 12 సెక్షన్ల కింద నేరానికి పాల్పడ్డారని తెలిపింది. వైయస్ జగన్, విజయ సాయిరెడ్డి, వెంకటరామి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని తెలిపింది.
కంపెనీ టర్నోవర్, లాభదాయకత వంటి వివరాలను మోసపూరితంగా దాచిపెట్టి భారీ ధరకు పెట్టుబడులు సేకరించారని, ఇందుకు జగన్, సాయిరెడ్డి కలిసి కుట్ర చేశారని సిబిఐ తెలిపింది. ఇదంతా 'క్విడ్ ప్రొ కో'లో భాగంగా లంచాలు తీసుకునేందుకేనని తెలిపింది. జగతి పబ్లికేషన్స్‌కు ఇప్పటికీ భారీ నష్టాలే వస్తున్నాయని తెలిపింది. ప్రీమియం ధర పెంచి చూపేందుకు డెలాయిట్ నివేదికను ఉపయోగించుకున్నారని వివరించింది. జగతి సంస్థలోకి వచ్చింది పెట్టుబడులు కావని, షేర్లకు అధిక ధర నిర్ణయించి, ఆ రూపంలో లంచాలు తీసుకున్నారని సిబిఐ ఆరోపించింది. రాంకీ అయోధ్య రామిరెడ్డి నుంచి రూ.10 కోట్లు లంచం పుచ్చుకున్నారని తెలిపింది. ముద్రణే ప్రారంభం కాని పత్రిక షేరును... 35 రెట్లు అధికంగా రూ.350గా నిర్ణయించడం హేతువుకు అందదని, లంచానికి పెట్టుబడి ముసుగు వేయడమే దీని అంతరార్థమని తెలిపింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!