danam nagender c ramachandraiah chiranjeevi chandrababu naidu heritage fdi దానం నాగేందర్ సి రామచంద్రయ్య చిరంజీవి చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఎఫ్‌డిఐ
హెరిటేజ్ కోసమే: బాబుపై దానం, దేశద్రోహులు కలకలం

దీంతో మండలి మూడు సార్లు వాయిదా పడింది. ఆయా నిర్ణయాలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. దీనిపై మంత్రి దానం నాగేంద్ర మండిపడ్డారు. హెరిటేజ్‌ను కాపాడుకోవడానికి చంద్రబాబు నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలపై సభలో చర్చకు ఒత్తిడి చేయడం అర్థరహితమని, ఎన్డీయే హయాంలో పెట్రో ఉత్పత్తుల ధరలు 11 సార్లు పెరిగాయన్నారు. ఎఫ్‌డిఐల వల్ల చిల్లర వర్తకులు రోడ్డున పడతారని ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వమే తీర్మానాన్ని సభలో ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా సభలో నినాదాలు చేస్తూ టిడిపి, సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్ పోడియం ముందు బైఠాయించారు. దీంతో శాసనమండలి చైర్మన్ చక్రపాణి 20 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. తిరిగి సభ మొదలైనా పరిస్థితి మారలేదు. ఈ క్రమంలో సభ మరోసారి వాయిదా పడింది. ఆ తర్వాత కూడా విపక్షాలు ఆందోళనను విరమించకపోవడంతో సభను చైర్మన్ శుక్రవారానికి వాయిదా వేశారు.
దేశద్రోహులు కలకలం
కాగా శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మస్తాన్ వలి దేశద్రోహులు అంటూ చేసిన వ్యాఖ్యలు కొద్దిసేపు కలకలం లేపాయి. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేస్తుండగా, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క.. వలికి మాట్లాడే అవకాశమిచ్చారు. విపక్షాలపై మండిపడడ్ వలీ ప్రజా సమస్యలపై చర్చించేందుకు టిడిపికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, ప్రతిపక్షాలన్నీ రాజకీయ ప్రయోజనాల కోసమే సభలో గొడవలు సృష్టిస్తున్నాయన్నారు.
సభలో సమస్యలు చర్చకు రాకుండా చేయడం ద్వారా అభివృద్ధిని అడ్డుకునే వారిని ప్రజలు దేశద్రోహులుగా గుర్తించే అవకాశం ఉందన్నారు. దీనిపై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలైన దేశ ద్రోహులు మీరే అంటూ ఎదురుదాడికి దిగారు. వలీకి మాట్లాడే అవకాశం ఎలా ఇస్తారంటూ టిడిపి ప్రశ్నించింది. వివాదం మరింత పెరుగుతుండటంతో మల్లు భట్టివిక్రమార్క సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.