నిమ్మగడ్డ బ్రహ్మాస్త్రం- గవర్నర్ లేఖ లీక్‌పై సీబీఐ విచారణకు పిటిషన్-ప్రివిలేజ్‌కు కౌంటర్
ఏపీలో వైసీపీ సర్కార్ వర్సెస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌గా సాగిపోతున్న వార్ ఇవాళ మరో మలుపు తిరిగింది. గతంలో స్ధానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రయత్నాలు చేస్తున్న తనను టార్గెట్ చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై గవర్నర్‌కు ఎస్ఈసీ ఫిర్యాదు చేశారు. ఆ లేఖలో అనుచిత వ్యాఖ్యలున్నాయంటూ ప్రభుత్వం నిమ్మగడ్డకు ప్రివిలేజ్ నోటీసులు పంపింది. దీంతో ఆయన అసలు ఆ లేఖలో తాను చేసిన వ్యాఖ్యలు ఎలా బహిర్గతం అయ్యాయంటూ ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు.

జగన్‌కు నిమ్మగడ్డ భారీ కౌంటర్
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై గవర్నర్‌కు రాసిన లేఖలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రభుత్వం తనకు పంపిన ప్రివిలేజ్ నోటీసులపై తాడోపేడో తేల్చుకునేందుకు నిమ్మగడ్డ సిద్దమయ్యారు. దీంతో ఆయన ఆ నోటీసులకు నిన్న ఘాటుగా సమాధానం ఇచ్చారు. అసలు ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసే అధికార పరిధి మీకు లేదంటూ రివర్స్ అయ్యారు. దీంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. అంతటితో ఆగకుండా ఇవాళ ఆయన మరో బ్రహ్మాస్త్రం సంధించారు. ఏకంగా హైకోర్టులోనే తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టుకు
గవర్నర్‌కు తాను రాసిన లేఖలు లీక్ కావడం, వాటి ఆధారంగా అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ తనకు నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహంగా ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇప్పుడు దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అసలు తాను గవర్నర్‌కు రాసిన అధికార రహస్యమైన లేఖ ఎలా లీక్ అయింది. దీని ఆధారంగా అసెంబ్లీ ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వడమేంటని హైకోర్టులో ప్రశ్నించారు. అంతే కాదు ఈ లీక్‌కు కారకుల్ని తేల్చాలంటే సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో నిమ్మగడ్డ కోరారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం కీలక మలుపు తీసుకుంది.

గవర్నర్ రాసిన లేఖ లీక్ కావడమా ?
హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఎస్ఈసీ నిమ్మగడ్డ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఇందులో రాజ్యాంగ పదవుల్లో ఉన్న తనకూ, గవర్నర్‌కూ మధ్య అధికారిక రహస్యంగా ఉండాల్సిన లేఖలు ఎలా లీక్ అయ్యాయో తేల్చాల్సిన అవసరం ఉందని కోరారు. ఈ లేఖలు లీక్ కావడం వల్లే అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ తనకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఈ లీకుల వ్యవహారం తేల్చాలంటే సీబీఐ దర్యాప్తు చేయించడం తప్పనిసరి అని నిమ్మగడ్డ హైకోర్టను కోరారు.. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ జరిపే అవకాశం ఉంది.

ప్రతివాదులుగా కేంద్ర, రాష్టాలు, గవర్నర్ కార్యదర్శి, సీఎస్
గవర్నర్ హరిచందన్‌కు తాను రాసిన లేఖలు లీక్ అయిన వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో ప్రతివాదులుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి, సీబీఐ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలను ఆయన చేర్చారు. వీరితో పాటు గుంటూరు జిల్లాకు చెందిన మిట్టు రామిరెడ్డి అనే వ్యక్తిని కూడా ప్రతివాదిగా చేర్చారు. దీంతో ఈ కేసు విచారణలో వీరంతా ప్రతివాదులు కాబోతున్నారు.