ఏపీలో రోడ్ల దుస్థితి .. నాట్లేస్తూ చిత్తూరులో, గుంతలు పూడుస్తూ కర్నూలులో టీడీపీ నేతల నిరసనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై టిడిపి నేతలు ఆందోళనలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు జలమయం కావడంతో, గుంతల రోడ్లపై ప్రయాణం చెయ్యాలంటే ప్రజలు భయపడుతున్నారు అంటూ, వైసీపీ పాలనలో రోడ్ల దుస్థితికి నిరసనగా టిడిపి నేతలు జగన్ సర్కార్ పాలనను టార్గెట్ చేశారు.
తాజాగా కర్నూలు జిల్లాలోని సంజామల మండలం పేరుసోములలో టిడిపి నేతలు రోడ్ల దారుణ పరిస్థితి పై ఆందోళన చేపట్టారు. గుంతల మయంగా మారిన రోడ్లపై ట్రాక్టర్లతో మట్టి తెచ్చి, జెసిబి సహాయంతో గుంతలను పూడ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైసీపీ పాలన పై విరుచుకుపడ్డారు టిడిపి నేతలు. బనగానపల్లె నియోజకవర్గం లో రివర్స్ టెండరింగ్ జరగడం లేదని, రోడ్ల మరమ్మతులకు ఎలాంటి చర్యలు లేవని అసహనం వ్యక్తం చేశారు టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి.

ఇదే సమయంలో స్టేటస్ కోసం విజయమాల్యా అప్పులు చేసి దేశం విడిచి పారిపోయాడని, అప్పుల గురించి ప్రశ్నిస్తే వైసిపి నాయకులు కూడా అదే పని చేస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా జగన్ సర్కార్ పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించిన ఆయన ఇప్పటికైనా ప్రభుత్వం రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని హితవుపలికారు.
చిత్తూరు జిల్లాలోనూ శ్రేణులు చెరువులను తలపిస్తున్న రోడ్లపై నిరసన కార్యక్రమం చేపట్టారు. గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద రోడ్లన్నీ చెరువులుగా మారడంతో వరి నాట్లు వేసి టిడిపి నేతలు నిరసన తెలిపారు. అంతేకాదు జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు వర్షానికి గుంతలమయంగా చెరువుని తలపిస్తున్నాయి అని, ఇప్పటికైనా జగన్ సర్కారు కళ్లు తెరవాలని వారు విమర్శించారు చిత్తూరు జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం టిడిపి అధ్యక్షుడు పులివర్తి నాని పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications