విన్నపాలు వినవలె.. సీఎం జగన్ కు నారా లోకేష్ వినతులు.. స్పందన కష్టమే !!
కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో విధించిన లాక్ డౌన్ తో అన్ని రంగాల కార్మికులు నరక యాతన అనుభవిస్తున్నారు. ఇక తాజా పరిణామాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్ కు విన్నపాలు చేశారు . లేఖలు సైతం రాశారు . ఇక తాజాగా సీఎం జగన్ కు నారా లోకేష్ రాసిన లేఖలో భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యను ప్రస్తావించారు . మొన్నటికి మొన్న స్వర్ణకారులను, చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరిన నారా లోకేష్ ఇప్పుడు నిర్మాణ రంగ కార్మికుల కోసం జగన్ కు విన్నపం చేశారు .

భవన నిర్మాణ కార్మికుల జీవితం దుర్భరంగా ఉందని లేఖ
లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో 50లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ ఏడాది ఇసుక సమస్య కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే.. తాజా లాక్ డౌన్ వల్ల పుట గడవని దుర్భర జీవితం గడుపుతున్నారని వారికి ప్రభుత్వ సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు . ఇక అంతేకాదు నూతన ఇసుక విధానం వలన ఉపాధి లేక, కుటుంబాలను పోషించలేక కొందరు ఆత్మహత్యకు పాల్పడటం ఎంతో కలచి వేసింది. ఇప్పుడు లాక్ డౌన్ వారిని మరింత దెబ్బతీసింది.కార్మికులకు అందుబాటులో ఉన్న 1900కోట్ల బిల్డింగ్ సెస్ వారి సంక్షేమానికే ఖర్చు చేయాలి అని ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు.

10 వేల రూపాయల ఆర్ధిక సాయం అందించాలని విజ్ఞప్తి
భవన నిర్మాణ కార్మికులకు 10 వేల రూపాయిల ఆర్థిక సహాయం,చంద్రన్న భీమాను పునరుద్ధరించటంతో పాటు వారి జీవన భవిష్యత్తు కు ప్రభుత్వం భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు . ఏపీ సర్కార్ ఈ విషయంపై దృష్టి సారించాలని కోరారు . ఇక నిన్నటికి నిన్న చేనేత కార్మికుల ఇబ్బందులను గురించి ప్రభుత్వానికి లేఖ రాశారు. లాక్ డౌన్ వల్ల దాదాపు మూడున్నర లక్షల మంది చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 81వేల పవర్ లూమ్ కార్మికులపైనా లాక్ డౌన్ ప్రభావం చూపింది. వారి జీవన విధానం దెబ్బతినటమే కాకుండా తయారు చేసిన ఉత్పత్తులు అమ్ముడుకాక అనేక ఇబ్బందులు పడుతున్నారు అని ఆ లేఖలో పేర్కొన్నారు నారా లోకేష్ .

నేతన్నలకు 15 వేల రూపాయలు సాయం , స్వర్ణకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి
ఆప్కో ద్వారా నేతన్నల వద్ద తయారై సిద్ధంగా ఉన్న స్టాక్ ను వెంటనే కొనుగోలు చేయాలి. లాక్ డౌన్ సమయంలో వీరంతా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నందున ప్రతి కుటుంబానికి 15వేల రూపాయల సాయం అందించాలి. క్లిష్ట సమయంలో నేతన్నల పట్ల ప్రభుత్వం దయచూపుతుందని ఆశిస్తున్నా అంటూ లేఖలో పేర్కొన్నారు . లాక్ డౌన్ దృష్ట్యా 1.5 లక్షల మంది స్వర్ణకారులు (విశ్వ బ్రాహ్మణులు) ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ ఎత్తిచూపారు. తక్షణ ఉపశమనం కల్పించాలని మరియు స్వర్ణకారులకు సభ్యులకు దీర్ఘకాలిక ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఒక సంస్థను స్థాపించాలని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు నారా లోకేష్ .

ఎన్ని విన్నపాలు చేసినా స్పందించని సర్కార్
ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్ని విజ్ఞప్తులు చేసినా , ఎన్ని లేఖలు రాసినా వాటికి సీఎం జగన్ కానీ వైసీపీ ప్రభుత్వం కాని స్పందించిన దాఖలాలు లేవు . అయినప్పటికే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గా టీడీపీ నేతలు జగన్ కు సలహాలు , సూచనలు ఇస్తూనే ఉన్నారు . విమర్శలు చేస్తూనే ఉన్నారు . అవేవీ పట్టించుకోకుండా వైసీపీ సర్కార్ తన పని తాను చేసుకుపోతూనే ఉంది .