హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ షర్మిల పాదయాత్ర: కేసీఆర్ ఏం చేస్తున్నట్టు.. అబద్దాలని ఫైర్

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల విరుచుకుపడ్డారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర నాలుగో రోజు దిగ్విజయంగా సాగింది. ఉదయం 10.00 గంటలకు శంషాబాద్‌లో గల పోశెట్టిగూడ క్రాస్‌లో పాదయాత్ర ప్రారంభం అయ్యింది. గొల్లపల్లి, రషీద్ గూడ, హమీదుల్లా నగర్, చిన్నగోల్కొండ, బహదూర్ గూడ, పెద్ద గోల్కొండ మీదుగా మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామం వరకు సాగింది. 12.1 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. మహిళలు షర్మిలకు మంగళహారతులు పడుతూ స్వాగతం పలికారు. రైతులు, వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులు తమ గోడును వెల్లబోసుకున్నారు. తానున్నాననే భరోసా ఇస్తూ షర్మిల ముందుకుసాగారు. సాయంత్రం పెద్దగోల్కోండలో 'మాట-ముచ్చట' కార్యక్రమం నిర్వహించగా.. ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఉద్యోగాలు రావడం లేదని, పెన్షన్లు ఇవ్వడం లేదని, డబుల్ బెడ్ రూం ఇండ్లు రాలేదని కంటతడి పెట్టారు.

అబద్దాలు

అబద్దాలు

సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సమస్యలే లేవని పచ్చి అబద్దాలు చెబుతున్నారని షర్మిల విరుచుకుపడ్డారు. ప్రజలు తమ బాధలు చెప్పుకుంటూ రోదిస్తుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని ఫైరయ్యారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. నిరుద్యోగ భృతి అమలు చేయడం లేదు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వడం లేదు. కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదు. ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చి, ఓట్లు దండుకున్న కేసీఆర్.. ఎన్నికల తర్వాత ఆయన ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా దున్నపోతు మీద వానపడ్డట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఆయన కుటుంబం తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. ప్రాజెక్టు పేరుతో కోట్లు దోచుకున్న కేసీఆర్.. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. సొంత నియోజకవర్గానికే సీఎంలా వ్యవహరిస్తూ నీళ్లు, నిధులు దోచుకుపోతున్నారు. కేసీఆర్‌కు రెండు సార్లు అధికారం కట్టబెట్టినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు.

మోసం

మోసం

నిత్యావసర ధరలు పెంచి అంటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పబ్పం గడుపున్నారని ఫైరయ్యారు. పెట్రోల్ ధరలు పెంచి సామాన్యలు నడ్డి విరుస్తున్నారు. పెట్రోల్ ధరలు కేవలం కేంద్రమే పెంచుతోందని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. తమ వాటా ఎంత ఉందో చెప్పడం లేదు. చిత్తశుద్ధి ఉంటే ప్రజలపై ప్రేమే ఉంటే పెట్రోల్ ధరల్లో రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా తగ్గించి, కేంద్రంపై ఒత్తిడి తేవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలు భారీగా పెంచి, పేదలకు భారం మోపుతున్నాయి. అన్ని రేట్లు పెంచి జనాల రక్తం తాగుతున్నారు.

సంక్షేమ పాలన

సంక్షేమ పాలన

వైఎస్ఆర్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క చార్జీ పెంచకుండా అద్భుతంగా పాలన సాగించారని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా పేద పిల్లలకు ఉన్నత చదువులు చేరువ చేశారు. ఐదేళ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా 46 లక్షల పక్కా ఇండ్లు కట్టించారు. 108, 104 సర్వీసులు ప్రవేశపెట్టి మారుమూల గ్రామాలకు సైతం వైద్యాన్ని చేరువ చేశారు. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి కార్పొరేట్ హాస్పిటల్ మాదిరిగా ఉచిత వైద్యం అందించారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి ఆదుకున్నారు. మూడు సార్లు నోటిఫికేషన్లు వేసి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. ప్రైవేటు రంగంలోనూ 11 లక్షల ఉద్యోగాలు సృష్టించారు. తమ పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే వైఎస్ఆర్ గారి సువర్ణ పాలన మళ్లీ తీసుకొస్తా.. పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తా. ప్రతి ఒక్కరికీ ఇండ్లు కట్టిస్తా.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి, పేదరికం అనేదే లేకుండా చేస్తానని షర్మిల హామీనిచ్చారు.

సమస్యలు

సమస్యలు

శంషాబాద్ విమానాశ్రయం దగ్గరలో ఉండడంతో విమానాల శబ్దాలతో తమ ఇంట్లోని సామాన్లు అదురుతున్నాయని గొళ్లపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి చుట్టాలు రావడమే మానేశారని తెలిపారు. గొళ్లపల్లిలో గల ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థలకు చేరగా.. షర్మిల పరిశీలించారు. ప్రభుత్వ టీచర్‌తో మాట్లాడి..ప్రభుత్వ పాఠశాల ఒకే గది, ఒక టీచర్ ఉండడంపై ఆరా తీశారు. అధికారంలోకి వచ్చాక సమస్యను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. గొళ్లపల్లిలో భర్త చనిపోయిన ఓ వితంతువుకు వైయస్ షర్మిల రూ.15,000 ఆర్థిక సాయం అందజేశారు.

పర్మినెంట్ చేయలే

పర్మినెంట్ చేయలే

కొత్తగూడం దగ్గరలోని తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 20 ఏండ్లుగా పనిచేస్తున్నా తమను పర్మినెంట్ చేయడం లేదని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కన్నీరు పెట్టారు. బాల్ గూడంలో 80 ఏండ్లుగా తమకు పట్టా పాస్ పుస్తకాలు రావడం లేదని అక్కడి ప్రజలు షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. 63 ఏండ్లు ఉన్నప్పటికీ తనకు పెన్షన్ రాలేదని కమలమ్మ అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్ రాక ఫీజులు తామే కడుతున్నామని మీరాబాయ్ అనే మహిళ తెలిపారు. తమకు ఇల్లు లేదని, డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా ఇవ్వడం లేదన్నారు. తన భర్త కరోనా వల్ల చనిపోయాడని లక్షలు ఖర్చు చేసినా బతకలేదన్నారు. ఆరోగ్యశ్రీ ఉంటే తమకు ఇబ్బంది లేకుండా ఉండేదని ఏడుస్తూ మహిళ చెప్పారు. బుడగ జంగాల కులస్తులకు.. ఎలాంటి సౌకర్యాలు లేవని మరో మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు టెట్ నోటిఫికేషన్ వేయలేదని, తల్లిదండ్రులకు భారంగా మారామని పీజీ పూర్తి చేసిన ఓ స్టూడెంట్ కన్నీరు పెట్టింది. చాలీచాలని జీతాలతో ప్రైవేటులో ఉద్యోగాలు చేస్తున్నామని కంటతడి పెట్టింది. ఇలా 4వ రోజు పాదయాత్ర ముగిసింది.

English summary
ysrtp chief sharmila angry on cm kcr. cm kcr what is doing she alleges. sharmila fourth day praja prastanam padayatra completed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X