
ఇండియాలో చైనా గూఢచారి
న్యూఢిల్లీలో ఓ చైనా మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నార్త్ క్యాంపస్ సమీపంలోని మజ్నుకా టిల్లా వద్ద టిబెట్ శరణార్థులు నివసిస్తున్నారు. ఈమెను అక్కడే పోలీసులు గుర్తించారు. పురుష బౌద్ధ సన్యాసిలా ఎరుపు రంగు వస్త్రధారణలో గుండుతో ఉంది. దాదాపు మూడు సంవత్సరాల నుంచి మారువేషంలో అక్కడ ఉంటున్నట్లు తెలుసుకున్నారు. చైనా కోసం ఆమె గూఢచర్యం చేస్తోందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. డోల్‌మా లామా పేరుతో చలామణీ అవుతున్న ఆమె వద్ద తనిఖీలు చేయగా నేపాల్‌లోని ఖాట్మండ్ కు చెందిన అడ్రస్ లభించింది. దీన్ని బట్టి ఆమె అసలు పేరు కాయ్‌రో అని స్పష్టమైంది.
రికార్డులు తనిఖీ చేయగా ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రార్ ఆఫీస్ (ఎఫ్‌ఆర్‌ఆర్‌వో) ప్రకారం ఆమె కాయ్‌రో పేరుతో చైనా పాస్‌పోర్టు ఉపయోగించుకొని 2019లో భారత్‌లోకి ప్రవేశించింది. దీనిపై పోలీసులు ప్రశ్నించగా.. తనకు చైనాలోని కమ్యూనిస్టు పార్టీ నేతల నుంచి ప్రాణహాని ఉందని వెల్లడించింది. ఇంగ్లిష్, నేపాలీ, మాండరీన్ భాషలు మాట్లాడుతోంది. ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్ పోలీసులు కాయ్ రో ను అదుపులోకి తీసుకున్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఆమె పాత్ర ఎంత ఉంది? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా దేశాల్లోకి తన అధికారులను పంపిస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్న చైనా అంతర్జాతీయ వేదికలపై భారత్ కు వ్యతిరేక ధోరణిని కొనసాగిస్తూనే ఉంది. ఇటీవలే లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు, పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది హఫీజ్ తల్హా సయీద్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలంటూ ఐక్యరాజ్యసమితిలో భారత్, అమెరికా ప్రతిపాదన చేశాయి. వాటిని చైనా అడ్డుకుంది. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులను రక్షించేందుకు చైనా తన వీటో అధికారాన్ని ఉపయోగించుకుంటుండటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నా ఆ దేశం వాటిని ఖాతరు చేయడంలేదు.