
రాజస్ధాన్ కాంగ్రెస్ లో గెహ్లాట్, పైలట్ రాజీ- త్వరలో కేబినెట్ మార్పులు-యువనేతకు ఢిల్లీ పదవి
రాజస్తాన్ లోని అధికార కాంగ్రెస్ లో సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలట్ వర్గాల మధ్య సాగుతున్న పోరుకు అధిష్టానం మరోమారు రాజీ కుదిర్చింది. గెహ్లాట్ తీరుపై అసంతృప్తిగా ఉన్న సచిన్ పైలట్ వర్గానికి త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో ప్రాదాన్యం ఇవ్వాలని సోనియాగాంధీ నిర్ణయించారు. ఈ మేరకు తనతో సమావేశమైన పైలట్ కు ఈ విషయం చెప్పారు.
రాజస్తాన్ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో యువనేత సచిన్ పైలట్ 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు. అనంతరం రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై తనకు మరియు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు మధ్య సంధి జరగవచ్చని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ సంకేతాలు ఇచ్చారు. జులై 2020 తిరుగుబాటు తర్వాత, రాజస్థాన్‌లోని గెహ్లాట్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసి దాదాపు 18 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నుంచి తప్పుకున్న తర్వాత పైలట్ తో సోనియా గాంధీ సమావేశం కావడం ఇదే తొలిసారి.
సోనియాతో భేటీ అనంతరం పైలట్... త్వరలోనే రాజస్తాన్ కేబినెట్ విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలో కొన్ని ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయవలసి ఉందన్నారు. వాటిని సమన్వయంతో నింపాల్సి ఉందన్నారు. అనుభవం, విశ్వసనీయత, పనితీరు, ప్రాంతీయ, కులాల సమతూకాన్ని దృష్టిలో ఉంచుకుని నియామకాలు చేపట్టాలని పైలట్ ఆకాంక్షించారు.

ప్రస్తుతం రాజస్థాన్ కేబినెట్‌లో తొమ్మిది ఖాళీలున్నాయి. పైలట్ చెబుతున్నట్లుగా ఒక వ్యక్తికి, ఒకే పదవి ఫార్ములా ప్రకారం కాంగ్రెస్ పార్టీ వెళితే, ప్రస్తుత క్యాబినెట్ నుండి ముగ్గురు మంత్రుల్ని తప్పించాల్సి ఉంటుంది. విద్యా మంత్రి గోవింద్ సింగ్ దోతస్రా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు; ఆరోగ్య మంత్రి రఘు శర్మ ఇటీవలే గుజరాత్‌కు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు; అలాగే రెవెన్యూ మంత్రి హరీష్ చౌదరిని పంజాబ్ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. దీంతో వీరిని తప్పించాల్సి ఉంటుంది. దీంతో ఈ వ్యవహారంపై ఆసక్తి నెలకొంది.
కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనంతరం పైలట్ పాత్రపైనా సందిగ్ధత నెలకొంది. పైలట్ కు కేబినెట్ విస్తరణ తర్వాత తిరిగి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు గెహ్లాట్ ఇష్టపడటం లేదు. దీంతో పైలట్ కు ఢిల్లీలో ఏదైనా కీలక పదవి ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన పైలట్.. కాంగ్రెస్ పార్టీ నా విషయంల ఏం చేయాలనుకుంటుందో అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గత 20 ఏళ్లలో ఏ పని అప్పగించినా పట్టుదలతో చేశానని, ఇప్పుడు కూడా పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా.. అలాగే పనిచేస్తానన్నారు.