హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాంధీ హాస్పిటల్‌కు చేతులెత్తి దండం పెట్టిన ఓ మహిళ... ఆ వైరల్ ఫోటో వెనుక అసలు కథ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

"బయట ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణాలతో బయటపడేదాన్ని కాదేమో. అందుకే గాంధీ ఆసుపత్రి నాకో గుడిలా కనిపించింది".

Gandhi Hospital

హైదరాబాద్ లోని అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకటైన గాంధీలో కరోనాకు చికిత్స తీసుకుని కోలుకున్న ఒక మహిళ బీబీసీతో చెప్పిన మాటలు ఇవి.

ఆ ఆసుపత్రికి ఆమె దండం పెడుతున్నన్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఒక తెలుగు పత్రిక ప్రతినిధి అనుకోకుండా ఆ ఫోటో తీశారు.

ఆ ఫోటోలోని మహిళ గాంధీ ఆసుపత్రికి ఎందుకు దండం పెడుతున్నారో తెలుసుకోడానికి బీబీసీ ఆమెతో. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడింది. వారు చెప్పిన విషయాలు వారి మాటల్లోనే.

మంచిర్యాల ప్రాంతానికి చెందిన ఆ 40 ఏళ్ల గృహిణి, తన వివరాలు బయటపెట్టవద్దని కోరారు.

ఆరోగ్యం బాలేకపోతే మంచిర్యాలలో చూపించుకున్నాను. టైపాయిడ్, మలేరియా వైద్యం చేశారు. సెలైన్ పెట్టారు. ఇంటి దగ్గరే ఉంటూ చికిత్స తీసుకున్నాను. కానీ తగ్గలేదు. పైగా ఆయాసం పెరిగిపోయింది. అప్పటికే వారమైంది. అప్పుడు సీటీ స్కాన్ చేయిస్తే కోవిడ్ అన్నారు. గవర్నమెంటు ఆసుపత్రికి వెళ్లమని డాక్టర్లు చెప్పారు. దీంతో గాంధీకి వచ్చాం. లక్షణాలు మొదలైన 8 రోజుల తరువాత అక్కడ చేరాను

గాంధీలో చేరిన మొదటి రెండు రోజులూ సీరియస్ గానే ఉంది. ఆక్సిజన్ పెట్టారు. చికిత్స చేశారు. తరువాత డేంజర్ నుంచి బయటపడ్డాను.

డాక్టర్లు, నర్సులు అందరూ బాగా చూసుకునేవారు. డాక్టర్లు రోజుకు కనీసం రెండుసార్లు తగ్గకుండా వచ్చేవారు. అవసరాన్ని బట్టి 3-4 సార్లు వచ్చేవారు. ఇక నర్సులెప్పుడూ అక్కడే తిరుగుతుండేవారు. బాత్రూం లాంటి విషయాల్లో సాయం చేసే సిబ్బంది, వార్డు బయట ఉండేవారు. పిలిస్తే వచ్చేవారు. కోవిడ్ వార్డు కాబట్టి వాళ్లు లోపలుండడానికి లేదు. వాళ్లు కూడా ఎప్పుడూ ఏ పనికీ విసుక్కోలేదు. ఎవరూ ఇబ్బంది పెట్టలేదు. విపరీతంగా మందులు వాడడం వల్ల చాలా మందికి నాలుకపై పొక్కులు వచ్చేవి. ఏమీ తినలేకపోయేవారు. వాటికీ మందులు ఇచ్చారు.

ఆ టైంలో, ఆ పరిస్థితిలో ఎక్కడకు పోయినా, ఎంత డబ్బు పెట్టినా బతుకుతానని నాకు నమ్మకం లేదు. అనుభవిస్తే కానీ ఆ బాధ అర్థం కాదు. బయట ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా బయటపడేదాన్ని కాదేమో. అందుకే గాంధీ ఆసుపత్రి నాకో గుడిలా కనిపించింది. ప్రాణాలతో బయటపడ్డా.. అందుకే నిజంగా దండం పెట్టాలనిపించింది. బయటికీ ఇక్కడికీ ఒకటే తేడా. బయట డబ్బుతో నడుస్తుంది. ఇక్కడ అభిమానంతో నడుస్తుంది. వారు డబ్బు ఆశించకుండా బాగా చేశారు. ఆఖరికి అక్కడ పనిచేసే కింది స్థాయి సిబ్బంది కూడా మమ్మల్ని డబ్బు అడగలేదు.

బాదం -ఎండు ద్రాక్ష

భోజనం బాగా పెట్టారు. హెల్తీ ఫుడ్ ఇచ్చారు. ఉదయం ఇడ్లీ వంటివి ఇచ్చేవారు. తరువాత స్నాక్స్, టీ, బిస్కెట్ లు ఇచ్చారు. మధ్యాహ్నం మళ్లీ అన్నం, చపాతీ కూరలు ఇచ్చేవారు. సాయంత్రం మళ్లీ స్నాక్స్, టీ, బిస్కెట్స్. వీటితో పాటూ బాదంపప్పు, జీడిపప్పు, కిస్మిస్ లాంటి ఎనర్జీ ఫుడ్ పెట్టారు. సాయంత్రం జ్యూస్, బాదంపాలు లాంటివి ఇచ్చేవారు. రాత్రికి రైస్, కర్రీస్ ఇచ్చారు. ఇక ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా గుడ్డు పెట్టేవారు. రోగులు ఆ ఆహారం వల్లే కోలుకుంటున్నట్లు అనిపిస్తంది.

నేను మొదట్లో ఇది చూసి, తెలిసిన వాళ్ల ద్వారా వచ్చేవాళ్లకీ, రికమండేషన్ ఉన్న వారికే అవన్నీ ఇస్తారేమో అనుకున్నా. కానీ అందరికీ ఇస్తున్నారని తర్వాత తెలిసింది.

సర్కార్ దవాఖానా ఇలా ఉంటుందనుకోలేదు

నేను గవర్నమెంటు ఆసుపత్రిలో ఉండడం ఇదేమొదటిసారి. ఊహించినదానికీ ఇక్కడ వాస్తవానికీ చాలా తేడా ఉంది. బయట జనం అనుకునేదానికీ ఇక్కడ ఉన్నదానికీ పొంతన లేదు. గవర్నమెంటు ఆసుపత్రి ఇలా ఉంటుందా, ఇంత బాగా చూసుకుంటారా అన్న విషయం అక్కడ ఉంటే తప్ప అర్థం కాలేదు. ఆసుపత్రి కూడా చాలా శుభ్రంగా ఉంది. అక్కడ రెండు రోజులు ఉన్నాక నాకు ధైర్యం వచ్చింది. ఇంక వీళ్లు చూసుకుంటారన్న నమ్మకం ఏర్పడింది. మొత్తం ఐదు రోజులు ఆక్సిజన్ మీద ఉన్నాను. అక్కడ చికిత్స బావుంది. చాలా మంచిగా చూసుకున్నారు.

గవర్నమెంటు ఆసుపత్రులు గురించి కొంచెం అవగాహన కల్పిస్తే, భయం పోయేలా ధైర్యం చెబితే బావుంటుంది'' అంటూ తన అనుభవాన్ని వివరించారు ఆ మహిళ

ప్రైవేటులో రోజుకు 60 వేలు.. అయినా గారెంటీ లేదన్నారు.

ఎప్పుడూ గాంధీ ఆస్పత్రికి వెళ్లలేదని, అక్కడ వాటర్ బాటిల్ సహా అన్నీ వాళ్లే ఇచ్చారని ఆ మహిళ కుమారుడు బీబీసీకి చెప్పారు.

"అమ్మకు ఆస్తమా ఉంది. జ్వరం వచ్చి, రుచి పోయింది. మంచిర్యాలలో వారం పాటూ చూపించినా తగ్గలేదు, పైగా సీరియస్ అయిపోయింది. మంచిర్యాలలో ఆరా తీస్తే, రోజుకు 60-70 వేలు అవుతుందన్నారు. అది కూడా మందులు కాకుండా. దానికితోడు రెమిడిసివిర్ ఇంజెక్షన్ మేమే తెచ్చుకోవాలన్నారు. అప్పటికీ పేషెంట్‌కు గ్యారెంటీ లేదన్నారు. ఇవన్నీ కాదని గాంధీకి తీసుకొచ్చాం. గాంధీకి రాగానే అన్నీ వివరాలూ అడిగి, ఒక అరగంట ఆగమని, బెడ్స్ క్లీనింగ్ అయ్యాక అమ్మకు ఒక ఫోన్ ఇచ్చాం. అంతే. 23న డిశ్చార్జి అయింది" అని వివరించారు.

అయితే, శుక్రవారం డిశ్చార్జి అయ్యాక మరో రెండు రోజులు ఐసోలేషన్ లో ఉండమని డాక్టర్లు సూచించారని, వీలుంటే మళ్లీ ఆదివారం తీసుకురమ్మన్నారని చెబుతూ, " ఆదివారం మళ్లీ గాంధీకి తీసుకువెళ్లాం అమ్మని చెక్ చేశాక ఇక మీరు మామూలుగా ఉండవచ్చు, ఏ ప్రాబ్లం లేదు అన్నారు. అప్పుడు బయటకు రాగానే, మా అమ్మ ఆసుపత్రివైపు తిరిగి దండం పెట్టింది. ప్రాణం లేచొచ్చింది అన్న సంతోషంలో" అన్నారు ఆమె కుమారుడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
The real story behind the viral photo of a woman who put namaskar to Gandhi Hospital
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X