వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెపటైటిస్ డే: వ్యాక్సీన్లను ఎందుకు తప్పనిసరి చేశారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

కాలేయ వ్యాధి మాత్రమే కాదు, కాలేయ క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉన్న హెపటైటిస్ వైరల్ ఇన్ఫెక్షన్ల మీద అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా జూలై 28న ప్రపంచ హెపటైటిస్ డే పాటిస్తున్నారు. హెపటైటిస్ నివారణకు వ్యాక్సీన్ తీసుకోవడం ఉత్తమ మార్గంగా గుర్తించారు. దాంతో, ఈ వ్యాక్సీన్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేశారు.

ఇలా రకరకాల ఇన్ఫెక్షన్లకు ప్రపంచవ్యాప్తంగా టీకాలు తీసుకోవడం తప్పనిసరిగా మారింది. వ్యాక్సీన్లను తప్పనిసరి చేయడమన్నది ఎలా మొదలైంది?

అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న 'వర్జీనియా మేసన్ ఫ్రాన్సిస్కాన్ హెల్త్' మెడికల్ సెంటర్ 2021 అక్టోబరు 18 నాటికి తన సిబ్బంది మొత్తం రెండు డోసుల కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకోవడం తప్పనిసరి అని చెప్పింది.

అయితే, గడువు తేదీ నాటికి సిబ్బందిలో 95 శాతం మంది మాత్రమే రెండు డోసుల వ్యాక్సీన్ వేయించుకోవడమో, లేదంటే తగిన వైద్య కారణాలతో మినహాయింపు పొందడమో చేశారు.

మిగతా 5 శాతం మందిలో కొందరు పూర్తిగా వేయించుకోకపోగా కొందరు ఒక డోస్ వరకు వేయించుకోగలిగారు.

దీంతో, వర్జీనియా మేసన్ ఫ్రాన్సిస్కాన్ హెల్త్ సెంటర్.. వ్యాక్సీన్ పూర్తికాని సిబ్బందిని సెలవులో పంపించింది.

వర్జీనియా మేసన్‌‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ చార్లీన్ తాచిబనా దీనిపై మాట్లాడుతూ... వ్యాక్సినేషన్ విషయంలో తమ సంస్థ మొదటి నుంచి పట్టుదలగా ఉంటుందని చెప్పారు. చార్లీన్ కెరీర్ మొత్తం వర్జీనియా మేసన్‌లోనే పనిచేశారు.

ఏటా తన సిబ్బంది మొత్తం ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సీన్ వేయించుకున్న తొలి మెడికల్ సెంటర్‌గా వర్జీనియా మేసన్ 2004 నాటికే ఘనత సాధించింది.

వర్జీనియా మేసన్ సిబ్బంది ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సినేషన్ రేటు రెండేళ్లలోనే 54 నుంచి 98 శాతానికి పెరిగింది.

అప్పటి అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు తాజా పరిస్థితులలో కరోనా వ్యాక్సీన్ అవసరాన్ని మరింతగా తెలియజెప్పాయి. సిబ్బంది ఇబ్బంది పడకుండా వ్యాక్సీన్ తీసుకునే అవకాశం కల్పించడం, వివిధ భాషల్లో సమాచారం అందుబాటులో ఉంచడం వంటి అనేక చర్యలు చేపట్టారు.

''సంస్థ తప్పనిసరి అని చెబితే మేం దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోం'' అన్నారు చార్టీన్.

''వ్యాక్సీన్ వల్ల మేలు జరుగుతుందని సైన్స్ చెబుతోంది. వ్యాక్సీన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తేలింది.. మరెందుకాలస్యం అని మేమంతా వ్యాక్సీన్ వేయించుకున్నాం'' అన్నారు చార్లీన్.

వర్జీనియా మేసన్ అనుభవాలు చూస్తే.. ప్రజారోగ్య రక్షణకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడమనేది శక్తిమంతమైన సాధనంగా కనిపిస్తుంది. అయితే, తప్పనిసరి చేయడం సరైందేనా అనే చర్చ కూడా ఉంది.

ప్రస్తుతం కోవిడ్-19 అవసరాల రీత్యా చూస్తే చారిత్రకంగా ఏం జరిగిందన్నది అర్థం చేసుకోవడం ప్రధానం.

17వ శతాబ్దంలో చైనా వైద్యులు గాయాలకు కౌపాక్స్‌ను పూసినప్పుడు అది అంతకంటే ప్రమాదకరమైన మశూచి నుంచి రక్షణ కల్పిస్తుందని గుర్తించారు.

అక్కడి నుంచి ప్రపంచమంతా ఈ విధానం వ్యాప్తిలోకి రాగా కొందరు నాయకులు మశూచి నివారణకు ఇలాంటి టీకాలను తప్పనిసరి చేశారు.

1777లో అమెరికా రివల్యూషనరీ వార్ సమయంలో ఆ దేశ దళాలన్నిటికీ మశూచి నిరోధక వ్యాక్సీన్ వేయాలని జార్జ్ వాషింగ్టన్ ఆదేశించారు.

1796లో ఎడ్వర్డ్ జెన్నర్ మశూచి టీకా అభివృద్ధి చేసిన తరువాత ఆ వ్యాక్సీనేషన్ మరింత సులభరీతిలో సాధ్యమైంది. అక్కడికి కొన్నేళ్లలోనే మశూచి టీకాను తప్పనిసరి చేశారు. 1806లో నెపోలియన్ సోదరి ఎలీసా నవజాత శిశువుల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఈ వ్యాక్సీన్ తప్పనిసరి చేశారు.

1853లో ఇంగ్లండ్, వేల్స్‌లో శిశువులకు కూడా మశూచి టీకాలు వేసేలా నిర్బంధ టీకా చట్టం తీసుకొచ్చారు.

''అమెరికాలో 1970ల చివరి నుంచి కొన్ని వ్యాక్సీన్లను తప్పనిసరి చేశారు'' అని వ్యాక్సీన్ సంస్థ 'గవి'లో ఎపిడమాలజిస్ట్‌గా ఉన్న లీ హ్యాంప్టన్ చెబుతున్నారు.

ఇటలీలో హెపటైటిస్-బి, డిఫ్తీరియా, పెర్టూసిస్, పోలియో వైరస్, టెటానస్, హీమోఫిలస్ ఇన్‌ఫ్లుయెంజా టైప్-బి, మీజిల్స్, గవదబిళ్లలు, రుబెల్లా, వరిసెల్లా వంటి అనేక రకాల వ్యాధికారక క్రిములపై పోరాడేందుకు గాను పిల్లలకు టీకాలు వేయించడం తప్పనిసరి.

అయితే, వ్యాక్సినేషన్‌ను తప్పనిసరి చేయడమనేది ఒక్కోచోట ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు స్లొవేనియాలో పాఠశాల విద్యార్థులంతా హైపటైటిస్-బి వ్యాక్సీన్ వేయించుకోవడం తప్పనిసరి. అలాగే, యూకేలోని కొన్ని ప్రాంతాల్లో మూత్రపిండాల మార్పిడి అవసరమైనవారు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించుకుని ఉండాలి.

అధికాదాయ దేశాల్లో వ్యాక్సీన్ మాండేట్స్ సాధారణమేనన్నారు లీ హ్యాంప్టన్. ప్రభుత్వాలను బట్టి కూడా వ్యాక్సినేషన్ తీరుతెన్నులుంటాయి. బలమైన, ఏకస్వామ్య, నిరంకుశ పాలన ఉన్నదేశాల్లో వ్యాక్సీన్ తప్పనిసరి చేయడం కూడా సాధారణమే.

గాంబియాను ఉదాహరణగా తీసుకుంటే 2007లో అక్కడ పిల్లలకు వ్యాక్సీన్లు తప్పనిసరిచేశారు. అప్పటికి గాంబియాలో నిరంకుశ ప్రభుత్వం ఉంది.

అదేసమయంలో ప్రజాస్వామ్య దేశాల్లో కూడా అత్యవసర పరిస్థితుల్లో టీకాలను తప్పనిసరి చేయడమనేది ఉంది. ముఖ్యంగా మహమ్మారుల సమయంలో ఇలాంటి నిర్బంధ టీకాల విధానాలు అమల్లోకి తెస్తారు.

2009లో అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం స్వైన్ ఫ్లూ మహమ్మారి నుంచి రక్షణకు హెల్త్‌కేర్ వర్కర్స్ అంతా తప్పనిసరిగా ఫ్లూ వ్యాక్సీన్లు వేయించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

సొరచేప కాలేయం.. కోతుల కిడ్నీ కణాలను టీకాలలో వాడడంపై అభ్యంతరాలు

వ్యాక్సీన్లలో వాడే పదార్థాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తమైన సందర్భాలున్నాయి. జంతు సంబంధిత పదార్థాలు మిళితమైన వ్యాక్సీన్లపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన సందర్భాలున్నాయి. సొరచేప కాలేయం నుంచి తీసే స్క్వాలీన్ అనే పదార్థాన్ని ఉపయోగించి రూపొందించే ఓ వ్యాక్సీన్.. అలాగే, తొలినాళ్లలో తయారైన పోలియో వ్యాక్సీన్లలో కోతుల కిడ్నీల నుంచి సేకరించిన కణాలను ఉపయోగించడంపై శాకాహారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ప్రారంభంలో ప్రారంభ మశూచి వ్యాక్సీన్‌లో.. దూడలకు ఉన్న కౌపాక్స్ బొబ్బల నుంచి కారే ద్రవం ఉండేది. బ్రిటన్‌లోని శాకాహారులు... బతికుండే జీవులపై చేసే ప్రయోగాలను వ్యతిరేకించేవారు(వివిసెక్షనిస్ట్స్) ఇలాంటి టీకాలపై అభ్యంతరాలు వ్యక్తంచేశారు.

ఇలాంటి టీకాలకు అభ్యంతరం చెప్పడానికి వేర్వేరు కారణాలున్నాయని డూండీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న సిల్వియా వాలైంటెన్ చెప్పారు. ''మానవ శరీరం జంతుపదార్థాలతో కలుషితం కారాదన్నది కొందరి నమ్మకం.. అలాంటివారంతా దీన్ని వ్యతిరేకించారు'' అన్నారామె. అలాగే.. వివిసెక్షనిస్ట్‌లు మశూచి వ్యాక్సీన్‌ను వ్యతిరేకించడానికి కారణం దూడల కౌపాక్స్ గాయాల నుంచి స్రావాలను సేకరించినప్పుడు అవి హింసకు గురవుతాయన్న ఉద్దేశం కావచ్చని సిల్వియా చెప్పారు.

ఇక.. టీకాలలో పోర్సిన్ కణజాలంపై కొందరు ముస్లింల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ టీకాలు పవిత్రమైనవేనా అన్న ఆందోళన కొందరిలో ఉండేది. పందుల నుంచి తీసే జిలాటిన్‌ను ఉపయోగించే టీకాలపై వ్యతిరేకత వచ్చింది.

2018లో ఇండోనేసియాలో మీజిల్స్ టీకా వేయడంలో ఇది పెద్ద సవాలుగా మారింది.

కరోనా వ్యాక్సీన్ విషయానికొస్తే ఇండోనేసియాలోని ముస్లిం మత పెద్దలు దీనికి అనుమతి ప్రకటించారు. కోవిడ్ టీకాలలో పంది మాంసం ఉత్పత్తులు లేవని టీకా తయారీ సంస్థలు కూడా స్పష్టం చేశాయి.

మరోవైపు పంది మాంసానికి సంబంధించిన పదార్థాలు వ్యాక్సీన్లలో వాడినప్పటికీ.. అవి నోటి ద్వారా తీసుకునే వ్యాక్సీన్లు కాకపోతే ఎలాంటి అభ్యంతరం తమకు లేదని యూదు మత వర్గాలు ప్రకటించాయి.

దశాబ్దాల కిందట కొన్ని టీకాల తయారీ దశ ప్రయోగాలలో మానవ పిండాల కణాలు(చట్టబద్ధమైన గర్భవిచ్ఛిత్తి తరువాత తొలగించినవి) వాడడంపైనా వివాదాలున్నాయి.

వ్యాక్సీన్ల విషయంలో వివిధ మత వర్గాలు, అందులోని శాఖలు, వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వ్యాక్సీన్లను పూర్తిగా నిషేధించిన మతాలేవీ లేవు.

నిజానికి చరిత్రను తరచిచూస్తే మతపెద్దలు టీకాలను ప్రోత్సహించడంతో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషించారు కూడా. భక్తుల ఆరోగ్య పరిరక్షణ వారికి అత్యంత ప్రాధాన్యాంశం.

అయితే, ఆధ్యాత్మికపరమైన కొన్నికొన్ని అభ్యంతరాలతో పాటు కార్మికోద్యమ వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చిన సందర్భాలున్నాయి.

విక్టోరియా శకంలో కొందరు ఆంగ్ల యజమానులు మశూచి వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా వేయించుకోవాలని కార్మికులను ఆదేశించడంపై శ్రామిక వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది.

అంతెందుకు 2004లో వర్జీనియా మేసన్ ఫ్లూ వ్యాక్సీన్‌ను తప్పనిసరి చేసినప్పుడు కూడా నర్సుల సంఘాలు వ్యతిరేకించాయి.

ఇంగ్లండ్‌లో 1898 నుంచి టీకాలపై అభ్యంతరాలు, మినహాయింపులను అనుమతించేవారు. అయితే, 1907 వరకు ఇలాంటి మినహాయింపులు పొందడం అంత సులభంగా సాధ్యమయ్యేది కాదు.

మాండేటరీ వ్యాక్సినేషన్

''ప్రస్తుతం వ్యాక్సీన్లను వ్యతిరేకిస్తున్న వారితో పోల్చితే విక్టోరియా కాలంలోని టీకాల వ్యతిరేక ఉద్యమం చాలా పెద్దది'' అన్నారు యుటా యూనివర్సిటీకి చెందిన చరిత్రకారిణి నజా డర్బాచ్

1947లో నిర్బంధ మశూచి టీకా కార్యక్రమానికి ఇంగ్లండ్‌లో ముగింపు పలికి స్వచ్ఛంద టీకా విధానాలు తీసుకొచ్చారు.

అయితే, నిర్బంధ టీకా విధానాలతోనే వ్యాక్సినేషన్ ఎక్కువగా జరిగిన ఉదాహరణలున్నాయి. 2018 తరువాత జన్మించిన చిన్నారులందరికీ 9 ప్రాణాంతక వ్యాధులకు వ్యతిరేకంగా పనిచేసే టీకా వేయడం తప్పనిసరి అని ఫ్రాన్స్ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల తరువాత టీకాలు వేయించుకున్న చిన్నారుల సంఖ్య అంతకుముందు సంవత్సరాలతో పోల్చితే గణనీయంగా పెరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Hepatitis Day: Why are vaccines mandatory?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X