పులివెందులలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మహిళా కూలీలు మృతి,ఆరుగురికి గాయాలు...
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు,జీపు,మున్సిపాలిటీ ట్రాక్టర్ ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పులివెందులలోని ముద్దనూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే... ముద్దనూరు మీదుగా వెళ్తున్న ఓ జీపు,కారు ఒకదానికొకటి ఢీకొని మున్సిపాలిటీ ట్రాక్టర్‌ను కూడా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా రైతు కూలీలు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలవడంతో వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతులు కొత్తపల్లె గ్రామానికి చెందిన మహిళా కూలీలుగా గుర్తించినట్లు తెలిపారు. గాయపడినవారు మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు.

రెండు రోజుల క్రితం విజయనగరం జిల్లా సుంకరిపేట వద్ద కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గ్యాస్ సిలిండర్ల లారీ, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఐదుగురు చనిపోగా.. 40మందికిపైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే డంపింగ్ యార్డు ఉంది. ఇక్కడ చెత్తను తగలబెట్టడంతో రహదారిపై ఆ పొగ కమ్ముకుపోయింది. ఆ పొగ వల్లే దారి కనిపించక రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నట్లు అనుమానిస్తున్నారు. లారీలో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలి ఉంటే ప్రమాద తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండేదని స్థానికులు చెప్తున్నారు.
ఇక ఈ నెల 18న కడప జిల్లాలోని ఓబులవారిపల్లెంలోనూ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఏడాది జనవరిలో జిల్లాలోని మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లెలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో గుజరాత్‌కు చెందిన 25 మంది గాయపడ్డారు. బస్సులు తిరుమల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాద ఘటనలు చోటు చేసుకుంటుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.