Kurnool: నంద్యాలలో రిపోర్టర్ దారుణ హత్య: స్క్రూడ్రైవర్‌తో పొడిచి..!
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా యుట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తోన్న ఓ రిపోర్టర్ దారుణ హత్యకు గురయ్యారు. సస్పెన్షన్‌కు గురైన ఓ కానిస్టేబుల్, అతని తమ్ముడు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. నిందితుల కోసం రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తమ అక్రమాలను వెలికి తీస్తోన్నందు వల్లే సస్పెన్షన్‌కు గురైన కానిస్టేబుల్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు చెప్పారు. స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపారని అన్నారు.
ఆ రిపోర్టర్ పేరు చెన్న కేశవ. స్థానికంగా యూట్యూబ్ అనే వీ5 అనే ఛానల్‌లో ఆయన పని చేస్తోన్నారు. నంద్యాల టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తూ సస్పెన్షన్‌కు గురైన కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య, అతని సోదరుడు నానితో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. స్థానికంగా ఓ గుట్కా వ్యాపారితో వెంకటసుబ్బయ్యకు ఉన్న సంబంధాలను చెన్న కేశవ బహిర్గతం చేయడంతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా దాన్ని ప్రచారం చేశారు. దీనితో కర్నూలు జిల్లా ఎస్పీ..ఆ కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్యను సస్పెండ్ చేశారు.

తన సస్పెన్షన్‌కు చెన్న కేశవ కారణం అయ్యాడనే ఉద్దేశంతో అతనిపై వెంకట సుబ్బయ్య కక్ష పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి ఆయనను హత్య చేయడానికి కుట్ర పన్నాడు. చెన్నకేశవను ఎన్జీవోస్ కాలనీ సమీపంలోని ఆటోస్టాండ్ వద్దకు పిలిపించాడు. ఫోన్ కాల్ రావడంతో చెన్నకేశవ తన స్నేహితుడితో కలిసి ఎన్జీవోస్ కాలనీ ఆటోస్టాండ్ వద్దకు వెళ్లారు. చెన్న కేశవను వెంకట సుబ్బయ్య, అతని తమ్ముడు నాని పక్కనే గదిలోకి తీసుకెళ్లారు. కొంత సేపటికే గదిలో నుంచి చెన్న కేశవ అరుపులు వినిపించడంతో అతని స్నేహితుడు.. అక్కడికి వెళ్లి చూడగా.. చెన్న కేశవ రక్తపుమడుగులో పడి ఉండటం కనిపించింది.
వెంటనే ఆటోలో ఆయనను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే కేశవ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. స్క్రూడ్రైవర్‌తో నిందుతులు చెన్న కేశవ వీపుపై పొడిచినట్లు పోలీసులు నిర్ధారించారు. కేశవ మృతదేహాన్ని నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ మురళీ మోహన్ పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని, గాలించడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. తమ అక్రమాలు, అవినీతి కార్యకలాపాలను వెలుగులోకి తీసుకొచ్చారనే కారణంతోనే చెన్నకేశవను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు.
రిపోర్టర్ దారుణహత్యకు గురి కావడం పట్ల జిల్లా జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తోన్నారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌కు ఓ వినతిపత్రాన్ని అందజేయనున్నారు.












Click it and Unblock the Notifications