వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ ర్యాలీపై టీఆర్ఎస్ ఫైర్: రేవంత్‌పై ఏసీబీ నిఘా, వీడియో రికార్డ్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జాతి విముక్తి కోసం పోరాడిన వ్యక్తికి ఆహ్వానం పలికినట్లు రేవంత్ రెడ్డికి భారీ ర్యాలీ తీయడం విడ్డూరమని తెలంగాణ రాష్ట్ర సమితి నేత కర్నె ప్రభాకర్ బుధవారం నాడు మండిపడ్డారు. దొంగకు బెయిల్ వస్తే పండుగనా అని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారన్నారు.

ప్రజా కోర్టులో రేవంత్ దొంగొనని గట్టు రామచంద్ర రావు అన్నారు. దొంగను సమర్థిస్తే సమాజం సహించదన్నారు. రేవంత్ రెడ్డిని చూస్తే కసబ్ గుర్తుకు వస్తున్నాడని సోలిపేట రామలింగా రెడ్డి ధ్వజమెత్తారు. పిచ్చికూతలకు ప్రజా కోర్టే సమాధానం చెబుతుందన్నారు.

దొంగలకు ఊరేగింపా అంటూ నమస్తే తెలంగాణ

ఓటుకు నోటు కేసులో ఏ1 నిందితుడు ఎమ్మెల్యే రేవంత్ తీరుపై ఏసీబీలో ఆగ్రహం వ్యక్తమవుతున్నదని, రేవంత్‌కి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని, బెయిల్ పొందిన తర్వాత తన నియోజకవర్గానికే పరిమితమై ఉండాలని న్యాయస్థానం బెయిల్ షరతుల్లో స్పష్టం చేసిందని, అయితే రేవంత్ చర్లపల్లి జైలు నుంచి విడుదలైన క్షణం నుంచి బలప్రదర్శన చేస్తూ ర్యాలీ నిర్వహించారని, అంతేకాదు ఆ ర్యాలీలో పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలైన రేవంత్ అడుగడుగునా షరతులను ఉల్లంఘించిన తీరుచూసి నిందితులు ఊరేగడమేమిటని ఏసీబీ ప్రశ్నిస్తున్నదని నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చింది.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన నిందితుడు జైలు నుంచి విడుదలైన దేశభక్తుడి మాదిరిగా ఊరేగింపులు చేయడంపై తీవ్రంగా స్పందిస్తున్నదని రాసింది. కేసులో సాక్షులను బెదిరింపులకు గురిచేసేలా రేవంత్ వ్యవహరించినట్టు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారని రాసింది.

 ACB surveillance on Revanth Reddy?

బెయిల్‌పై విడుదలైన మరుక్షణం నుంచి రేవంత్ చేసిన ప్రతి ఓవర్ యాక్షన్‌ను ఏసీబీ బృందాలు వీడియో రికార్డు చేసినట్టు ఆ విభాగపు ఉన్నతాధికారులు తెలిపారని రాసింది. ఎక్కడా కూడా ర్యాలీలు తీయడం గానీ, సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరించరాదంటూ హైకోర్టు షరతులు పెట్టినా వాటిని తుంగలో తొక్కుతూ రేవంత్ వ్యవహరించారని ఏసీబీ ఓ నివేదిక రూపొందించిందని పేర్కొంది.

రేవంత్ బెయిలు, హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన తీరును సుప్రీం కోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమైందని పేర్కొంది. బెయిల్‌పై విడుదలయ్యాక రేవంత్ చేసిన బెయిల్ షరతుల ఉల్లంఘనను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు ఏసీబీ న్యాయవాదులు సిద్ధమైనట్టు తెలుస్తోందని రాసింది.

బెయిల్ పొందిన వెంటనే తన నియోజకవర్గమైన కొడంగల్ వెళ్లాల్సిందిపోయి చర్లపల్లి నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు భారీ ర్యాలీ తీయడం, పదేపదే కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా మైక్‌లో ప్రసంగించడం ఇవన్నీ పరోక్షంగా సాక్షులను బెదిరించే అంశాలే అవుతాయని ఏసీబీ దర్యాప్తు విభాగపు అధికారులు తెలిపారని పేర్కొంది.

రేవంత్ బెయిల్ రద్దు చేయాలని ఏసీబీ సుప్రీం కోర్టులో బుధవారం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ గురువారం లేదా శుక్రవారం బెంచ్ మీదకు వచ్చే అవకాశాలున్నట్టు ఉన్నతాధికారులు ద్వారా తెలిసిందని పేర్కొంది.

ఇదిలా ఉండగా, రేవంత్ కొడంగల్‌కు వెళ్లకుండా హైదరాబాద్‌లోనే ఉండటంతో ఆయన కదలికలపై డేగకళ్లతో పహారా కాసేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయని, రేవంత్ ఏం చేస్తున్నారు? ఎవరెవరితో మాట్లాడుతున్నారు? కేసుకు సంబంధించినవారితో భేటీలు కావడం, రహస్య సమావేశాలు ఏర్పాటుచేయడం వంటి కార్యక్రమాలపై ఏసీబీ దర్యాప్తు బృందాలతో పాటు నిఘా బృందాలను సైతం రంగంలోకి దింపినట్టు ఏసీబీ వర్గాలు తెలిపాయని రాసింది.

కేసు కీలకదశలో ఉన్నందున ప్రతీ అంశాన్ని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, కేసును కుట్రపూరితంగా నీరుగార్చేందుకు వ్యవహరిస్తే రేవంత్ చేసే పనులపై కోర్టుకు ఫిర్యాదు చేస్తామని, బెయిల్ రద్దుకు ఇవన్నీ కీలకంగా మారుతాయని ఉన్నతాధికారులు తెలిపారని పేర్కొంది.

English summary
ACB surveillance on Revanth Reddy?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X