
ఫిరాయించిన నేతలు టీఆర్ఎస్ లో ఉన్నా పనిచేసేది బీజేపీకే: ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలనం
మునుగోడులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ లోని ముఖ్య నాయకులను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం జోరుగా సాగుతుందని పేర్కొన్న ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఇప్పటివరకు పార్టీ ఫిరాయించిన నేతలందరూ భౌతికంగా అక్కడ ఉన్నా మనసు మాత్రం బిజెపి లోనే ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించిన నేతలు టీఆర్ఎస్ లో ఉన్నా పనిచేసేది బీజేపీకే నంటూ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

త్వరలో బీజేపీలోకి ఆ జిల్లాల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నాటి రాజకీయాలు ఎటు పోతున్నాయో ప్రజలు గమనించాలన్నారు. వెయ్యి కోట్లు పంచయినా మునుగోడులో గెలవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రలోభాలకు గురి చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చిన్నచిన్న నాయకులను కూడా పార్టీ మార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ జిల్లాల నుండి ఇద్దరు చొప్పున అధికార పార్టీ ఎమ్మెల్యేలు బిజెపిలోకి వస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉప ఎన్నిక తర్వాత బీజేపీలోకి వలసలు ఖాయం: ఎమ్మెల్యే రఘునందన్ రావు
మునుగోడు ఉప ఎన్నికల తర్వాత బీజేపీ లోకి వలసలు ఖాయమని ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. చౌటుప్పల్ నుండి నారాయణపూర్ కు వచ్చే రోడ్డును 2014-2018 మధ్యలో మంజూరు చేసారని ఇక్కడొక ఎమ్మెల్యే చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నేత ఎమ్మెల్యేగా ఉన్నాడని అది వేయలేదా.. మీరు మునుగోడు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారో ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉప ఎన్నిక ఉన్నదని గొర్రెలకు బదులు నగదు మంజూరు చేశారని, గొర్రెలకు సంబంధించిన డబ్బులు బిజెపి ఆపింది అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ ఫిరాయింపులు రేపు పిరంగులయి మీ మెడకే చుట్టుకుంటాయి
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నేతల పై వ్యక్తిగత దుష్ప్రచారం జరుగుతోందని రఘునందన్ రావు పేర్కొన్నారు. బలవంతంగా నియోజాకవర్గానికి సంబంధం లేని నాయకులను కొంటే మునుగోడుకు వచ్చే నష్టం లేదన్నారు. కేసీఆర్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని రఘునందన్ రావు పిలుపునిచ్చారు. మీరు ప్రోత్సహించే ఈ ఫిరాయింపులు రేపు పిరంగులయి మీ మెడకే చుట్టుకుంటాయని రఘునందన్ రావు పేర్కొన్నారు.

మీ పాపం మీకే వస్తుంది.. జాగ్రత్త
ఆంధ్ర కాంట్రాక్టర్ ల మాఫియా, ఇసుక మాఫియా, భూ మాఫియా ల ద్వారా వచ్చిన డబ్బు టిఆర్ఎస్ పార్టీ దగ్గర ఉందని, దాంతోనే నేతలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు. ఒక్క రాష్ట్రాన్ని పాలించే టిఆర్ఎస్ కి ఇన్ని తెలివితేటలు ఉంటే, దేశంలోని అనేక రాష్ట్రాలలో పాలించే బిజెపికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి అని ప్రశ్నించారు. మీరు చేసిన ప్రతి పాపం మీకే వస్తుందన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కలుగులో దాక్కున్న ఎలుకలను బయటకు లాగుతాం
ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ హైదరాబాద్ కి వచ్చిందని పేర్కొన్న ఆయన మీరు ఏ కలుగులో దాక్కున్నా ఆ కలుగుకు మంట పెడతామని, బయటకు అవినీతి ఎలుకలను తెస్తామని హెచ్చరించారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇస్తానని ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులతో కేసీఆర్ మంతానలు జరిపినట్టు మా వద్ద సమాచారం ఉందన్నారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా, ఎంత మందిని మునుగోడుకు పంపించినా మునుగోడులో గెలిచేది బీజేపీనే అని రఘునందన్ రావు తేల్చి చెప్పారు.