కేటీఆర్ చొరవ: ఆదిభట్లలో జీఈ-టాటా ఏరో ఇంజిన్ల పరిశ్రమకు శంకుస్థాపన(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చేస్తున్న కృషి ఫలిస్తోంది. తాజాగా వైమానిక రంగంలో ప్రసిద్ధ సంస్థలైన టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌, జనరల్‌ ఎలక్ట్రిక్‌(జీఈ) సంస్థల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని ఆర్థికమండలిలో వైమానిక ఇంజిన్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నాయి. దీనికి సోమవారం మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన ఈ కార్యక్రమంలో రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, టాటా సన్స్‌ వైమానిక, రక్షణ, మౌలిక వసతుల విభాగం ఛైర్మన్‌ బన్మాలి అగ్రవాలా, జీఈ దక్షిణాసియా అధ్యక్షుడు, సీఈవో విశాల్‌ వాంచూ, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ ఎండీ ఇ.వెంకటనర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ శ్రేణి ఇంజిన్ల తయారీ

ప్రపంచ శ్రేణి ఇంజిన్ల తయారీ

దేశంలో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో తొలిసారిగా అత్యున్నత నాణ్యత గల ప్రపంచశ్రేణి సీఎఫ్‌ఎం లీప్‌ ఇంజిన్లు, జెట్‌ ఇంజిన్లు, వాటి విభాగాల తయారీ, అసెంబ్లింగు, టెస్టింగు పరిశ్రమతో పాటు పరిశోధన, అభివృద్ధి కోసం ప్రతిభ కేంద్రం (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌)ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి వైమానిక సెజ్‌లో రాష్ట్రప్రభుత్వం 40 ఎకరాలను కేటాయించింది. ఇందులో 21 ఎకరాలను అప్పగించింది. దీనిద్వారా 500 మంది వైమానిక నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి కలుగనుంది.

దేశంలో తొలిసారి ఆదిభట్లలోనే

దేశంలో తొలిసారి ఆదిభట్లలోనే

కాగా, హైదరాబాద్ నగర శివార్లలోని ఆదిభట్లలో టాటా సంస్థ వైమానిక సెజ్‌లు నడుస్తున్నాయి. తాజాగా విమానాల ఇంజిన్లను, వాటి విడిభాగాల తయారీకి కొత్త పరిశ్రమ వస్తోంది. లీప్‌ ఇంజిన్లు చైనా, కొరియా, జపాన్‌లలోనే తయారవుతున్నాయి. దేశంలో తొలిసారిగా వీటిని భారత్‌లో ఉత్పత్తి చేయనుండటం విశేషం.

టీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు: ఆదిభట్లలో విమాన ఇంజిన్ల తయారీ

మంత్రి కేటీఆర్ కృషి

మంత్రి కేటీఆర్ కృషి

పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ గత ఏడాదిగా వైమానిక పరిశ్రమను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని జీఈ సంస్థను కోరుతున్నారు. 2016లో అమెరికా పర్యటన సందర్భంగా ఆయన సంస్థ ఛైర్మన్‌ జాన్‌ ఎల్‌ ప్లానరీతో కలిసి ఆహ్వానించారు. గత డిసెంబరులో ఢిల్లీలోనూ మరోసారి ప్లానరీని కలిసి ఈఅంశాన్ని ప్రస్తావించారు. వెంటనే జీఈ సంస్థ గత డిసెంబరులో ముంబైలో జరిగిన కార్యక్రమంలో వైమానిక ఇంజిన్ల తయారీ పరిశ్రమ కోసం టాటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కేటీఆర్‌ వినతిని పరిగణనలోకి పరిశ్రమ స్థాపనకు హైదరాబాద్‌ను ఎంపిక చేశారు.

తెలంగాణకు గర్వకారణం

‘ప్రపంచంలో పేరొందిన వైమానిక ఇంజిన్ల తయారీకి తెలంగాణ వేదిక కావడం గర్వకారణంగా ఉంది. ఇదో గొప్ప వరం. రాష్ట్రానికి ఇది తలమానికం. ప్రస్తుతం జీఈ సంస్థ వైమానిక ఇంజిన్ల తయారీలో అగ్రస్థానంలో ఉంది. వచ్చే అయిదేళ్లకు ఇంజిన్ల ఆర్డర్లు ఉన్నాయి. టాటాసంస్థ వైమానిక రంగంలో ముందంజలో ఉంది. రెండు ప్రపంచస్థాయి సంస్థలు చేతులు కలపడం శుభసూచకం' అని కేటీఆర్ చెప్పారు.

పూర్తి సహకారం

‘భారత్‌లో వైమానిక రంగం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ దేశాలకు ఇంజిన్లను ఎగుమతిచేసే స్థాయికి ఎదుగుతుంది. విమానయాన నిపుణులను తీర్చిదిద్దాలి. ఇందుకు నైపుణ్య అకాడమీ ఉపయోగపడుతుంది. తెలంగాణ వైమానిక కేంద్రంగా మారింది. రెండు వైమానిక సెజ్‌లున్నాయి. 5 విమానాల విడిది కేంద్రాలున్నాయి. రెండు అత్యుత్తమ శిక్షణ సంస్థలు నడుస్తున్నాయి. తాజా పరిశ్రమ తెలంగాణలో వైమానికరంగం అభివృద్ధికి మరింత ఊతమిస్తుంది. ఈ పరిశ్రమకు సహాయ సహకారాలను అందిస్తాం' అని మంత్రి కేటీఆర్ చెప్పారు. బన్మాలీ అగ్రవాల మాట్లాడుతూ.. ‘భారత్‌లో తయారీ స్ఫూర్తితో మా కొత్త ప్రాజెక్టు చేపడుతున్నాం. భారతదేశ రక్షణ, వైమానిక రంగాల్లో అగ్రగామిగా ఉంది. లీప్‌ ఇంజిన్లకు డిమాండు పెరుగుతున్నందున మాసంస్థ టాటాతో చేసుకున్న ఒప్పందం ద్వారా నిర్ణీత లక్ష్యాలను చేరుకుంటాం. ఈ పెట్టుబడి ద్వారా నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టించడంతో పాటు ఎగుమతులను పెంచుతాం' అని అన్నారు.

తెలంగాణ సహకారం బాగుంది..

విశాల్‌ వాంచూ మాట్లాడుతూ.. ‘పరిశ్రమ స్థాపనకు మంత్రి కేటీఆర్‌, రాష్ట్రప్రభుత్వం అధికారుల నుంచి చక్కటి సహకారం అందింది. గడువు కంటే ముందే భూములను అప్పగించారు. డిసెంబరు నాటికి ఈ పరిశ్రమలో ఇంజిన్‌ను ఉత్పత్తి చేస్తాం. మా సంస్థ జీఈతో పాటు టాటా ప్రపంచంలోనే దిగ్గజ సంస్థలు. హైదరాబాద్‌లోని పరిశ్రమ ద్వారా సీఎఫ్‌ఎం ఇంజిన్లతో పాటు వాణిజ్య, మిలటరీ ఇంజిన్లను తయారుచేస్తాం' అని వివరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
American multinational GE and Tata Group on Monday launched work to build a world-class structural Centre of Excellence (COE) focused on aero-engine components here.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి