హైదరాబాద్ లో ఈదురుగాలులతో భారీవర్షం: పలుచోట్ల పవర్ కట్; ఎక్కడెంత వర్షపాతం నమోదయిందంటే!!
విపరీతమైన ఎండలతో ఆపసోపాలు పడిన భాగ్యనగర వాసులు ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తెల్లవారుజామున ఈరోజు హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనేక చోట్ల చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
యాదాద్రి భువనగిరి జిల్లా తోపాటుగా హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో నగరంలోని పలు రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖైరతాబాద్, అమీర్ పేట , పంజాగుట్ట, సికింద్రాబాద్. మారేడ్ పల్లి , చిలకలగూడ, బోయిన్ పల్లి , మియాపూర్, తిరుమలగిరి, నిజాంపేట, ప్రగతి నగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, సైదాబాద్, చంపాపేట, సరూర్ నగర్ ఇలా అనేక ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. అనేక ప్రాంతాల్లో నగరంలోని రోడ్లపై వరద పొంగిపొర్లుతుంది.

ఇదిలా ఉంటే హైదరాబాద్ తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల లోనూ భారీ నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తున్న ట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా తో పాటు ఇటు వరంగల్ జిల్లాలోనూ తేలికపాటి వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ అందించిన డేటా ప్రకారం హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలు చూస్తే, సికింద్రాబాద్ లోని సీతాఫల్మండి లో 7.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.
బంసిలాల్ పేట్ లో 6.7 సెంటీమీటర్ల వర్షపాతం, వెస్ట్ మారేడ్పల్లి లో 6.1 సెంటీమీటర్ల వర్షపాతం, అల్వాల్లో 5.9 సెంటీమీటర్ల వర్షపాతం, ఎల్బీనగర్ లో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం, గోషామహల్ బాలానగర్లో 5.4 సెంటీమీటర్లు, ఏఎస్ రావు నగర్ లో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం, బేగంపేటలోని పాటిగడ్డ లో 4.9 సెంటీమీటర్ల వర్షపాతం, మల్కాజ్గిరి లో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం, సరూర్నగర్ ఫలక్నామా లో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
గన్ ఫౌండ్రీలో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం, కాచిగూడ, సికింద్రాబాద్ లలో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం, చార్మినార్ లో 4.2 సెంటీమీటర్లు, గుడిమల్కాపూర్ నాచారం లో 4.1 సెంటీమీటర్ల వర్షపాతం, అంబర్ పేటలో 4 సెంటీమీటర్ల వర్షపాతం, అమీర్ పేట, సంతోష్ నగర్ లో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం, ఖైరతాబాద్లో 3.6 సెంటీమీటర్ల వర్షపాతం, బేగంబజార్, హయత్ నగర్, చిలకనగర్ లో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications