
58లక్షల ప్యాకేజీతో పెద్ద ఉద్యోగం.. జాబ్ లో చేరేలోపే యువ ఇంజనీర్ గుండెపోటుతో హఠాన్మరణం!!
బాగా చదువుకొని, గొప్ప ఉద్యోగం సంపాదించి, త్వరలో ఉద్యోగ బాధ్యత స్వీకరించడానికి రెడీ అయిన ఓ యువ ఇంజనీర్ గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి కే చంద్రశేఖర్ రెడ్డి పెద్ద కుమారుడు 22 సంవత్సరాల అభిజిత్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం పొందారు.

క్రికెట్ మ్యాచ్ చూసి పడుకున్నాడు.. అర్దరాత్రి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు
నిన్న రాత్రి టీవీలో క్రికెట్ మ్యాచ్ చూసి నిద్రపోయిన అభిజిత్ రెడ్డి అర్ధరాత్రి దాటిన తర్వాత గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అభిజిత్ రెడ్డిని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అభిజిత్ రెడ్డి ఈరోజు తెల్లవారుజామున మృతిచెందాడు.
అభిజిత్ రెడ్డి వరంగల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో కెమికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చదివారు. సౌదీ అరేబియాకు చెందిన చమురు కంపెనీ సౌదీ అరామ్ కో లో ఏడాదికి 70 వేల డాలర్ల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సాధించారు.

వచ్చే నెలలో ఉద్యోగంలో చేరాల్సిన యువ ఇంజనీర్.. హఠాన్మరణం
ఈ ఉద్యోగానికి అభిజిత్ రెడ్డికి ఇండియన్ కరెన్సీ లో 58 లక్షల రూపాయలు రానున్నాయి. వచ్చే నెలలో ఆ ఉద్యోగంలో చేరవలసి ఉండగా, ఈలోపే గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. చేతికి ఎదిగొచ్చిన చెట్టంత కొడుకు గుండెపోటుతో మృతిచెందడంతో తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గా పనిచేస్తున్న తండ్రి చంద్రశేఖర్ రెడ్డి కన్నీరుమున్నీరయ్యారు.

బాధిత కుటుంబానికి మంత్రుల, ఎమ్మెల్యేల పరామర్శ
ఇక ఈ విషయం తెలిసిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ చంద్రశేఖర్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యుక్తవయసులో ఉన్న అభిజిత్ రెడ్డి మరణం పట్ల వారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

యువకుల్లో పెరుగుతున్న హార్ట్ ఎటాక్ ల సంఖ్య.. బీ కేర్ ఫుల్
ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు. ముఖ్యంగా శారీరక వ్యాయామం తక్కువగా ఉండే వారిలో సడన్ గా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని వైద్యులు చెబుతున్నారు. అభిజిత్ రెడ్డి మరణం కూడా ఇదే విధంగా సంభవించి ఉంటుందని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే గుండెపోటు విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అప్పుడప్పుడు జనరల్ చెకప్ చేయించుకోవాలి అని సూచిస్తున్నారు.