సీఎం కేసీఆర్ నిరాసక్తత: అందుకే సైన్స్ కాంగ్రెస్ వాయిదా.. ఓయూ విద్యార్థులంటే సర్కార్‌కు మంటే

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నూతన వసంతంలో సరికొత్త ఊసులతో ముందుకు సాగాల్సిన సమయం.. కానీ ముందే ఆ పరిస్థితే లేదని తేలిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చేనెల మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు నిర్వహించ తలపెట్టిన 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐఎస్‌సీఏ) సదస్సు ఆఖరి క్షణాల్లో రద్దయింది. గతేడాదే ఉస్మానియా యూనివర్సిటీ 100 వసంతాల (శతాబ్ది) ఉత్సవాలు పూర్తి చేసుకున్నది. అలా వందేళ్ల చరిత్ర గల ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ పేరు ప్రతిష్టలు దెబ్బ తింటాయన్న భావనతోనే సదస్సును వాయిదా వేయించారా? అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.

గమ్మత్తేమిటంటే ఈ నెల మొదటి వారం వరకు ఉస్మానియా యూనివర్సిటీ అధికార వర్గాలు సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు రూ.25 వేల కోట్లు ఖర్చు చేశాయి. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు కోసం కేంద్రం రూ.100 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.40 - 50 కోట్లు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి.

 సదస్సు ఏర్పాట్లకు నిధులు ఇవ్వబోమని తేల్చేసిన రాష్ట్ర అధికారులు

సదస్సు ఏర్పాట్లకు నిధులు ఇవ్వబోమని తేల్చేసిన రాష్ట్ర అధికారులు

అకస్మాత్తుగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన షాక్‌తో దిగ్భ్రాంతికి గురి కావడం ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల వంతైంది. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో తాము భాగస్వాములు కాబోవడం లేదని వర్సిటీ అధికారులకు తెలంగాణ ప్రభుత్వ అధికారులు సమాచారం ఇచ్చారు. అంతేకాదు.. సదస్సు ఏర్పాట్లకు నిధులు కేటాయించడం గానీ, ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు గానీ ఉండబోవని తేల్చేశారు. దీనికి కారణమేమిటంటే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొనేందుకు సీఎం, అధికార తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిరాసక్తతతో ఉండటమే దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

 ఓయూలో సదస్సుకు హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్ నిరాసక్తి

ఓయూలో సదస్సుకు హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్ నిరాసక్తి

ఇదే సమయంలో రాష్ట్ర నిఘా విభాగం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు నిర్వహణ అంత సబబు కాదని కేంద్రానికి లేఖ రాశారని సమాచారం. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయని, నిరసన వెల్లువెత్తే అవకాశం ఉన్నదని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలిసింది. ఏది ఏమైనా ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చేందుకు సీఎం కేసీఆర్ ఆసక్తి చూపడం లేదన్న విమర్శ ఉన్నది. ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీలోకి వస్తే విద్యార్థుల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఆయన సంకోచిస్తున్నారని తెలుస్తున్నది.

 కేసీఆర్ ప్రసంగించకుండానే ఓయూ శతాబ్ది ఉత్సవాల ప్రారంభం

కేసీఆర్ ప్రసంగించకుండానే ఓయూ శతాబ్ది ఉత్సవాల ప్రారంభం

గత ఏడాది వర్సిటీ శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి, గవర్నర్ మాత్రమే ప్రసంగించారు. సీఎం కేసీఆర్ ప్రసంగానికి దూరంగా ఉన్నారు. అదే సమయంలో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలిపారు. ప్రారంభోత్సవంలోనే సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని వార్తలొచ్చాయి. మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం కేసీఆర్ రాక సందర్భంగా యూనివర్సిటీలో అడుగడుగునా బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

 టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌తో టీఆర్ఎస్ ప్రతినిధులు భేటీ ఇలా

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌తో టీఆర్ఎస్ ప్రతినిధులు భేటీ ఇలా

రెండు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఉద్యోగ నియామకానికి చర్యలు తీసుకోకపోవడంపై తెలంగాణ ప్రభుత్వంపై విద్యార్థుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై తర్వాతి దశలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, ఎంపీ బాల్క సుమన్ తదితరులు విద్యార్థి సంఘాల నేతలతో సమావేశమై పరిస్థితిని అంచనా వేశారు. ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం వల్లే విద్యార్థుల్లో నిరసన వెల్లువెత్తిందన్న విమర్శలు వచ్చాయి. ఆ వెంటనే అధికార టీఆర్ఎస్ ప్రతినిధి వర్గం.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణితో సమావేశమై వడివడిగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని, అందుకు అవసరమైన ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు.

 ఓయూ విద్యార్థులపై ఇలా లాఠీల న్రుత్యం..

ఓయూ విద్యార్థులపై ఇలా లాఠీల న్రుత్యం..

తాజాగా ఇటీవల తెలంగాణ రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర శివారుల్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ‘కొలువుల కొట్లాట' సభకు హాజరయ్యేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ నేత వంటేరు ప్రతాపరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో బస చేసిన వార్తలు తెలిసిన పోలీసులు.. యూనివర్సిటీ హాస్టళ్లను జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలపై ఉక్కుపాదం మోపారని, ఇష్టారాజ్యంగా లాఠీలకు పని చెప్పారని విమర్శలు ఉన్నాయి. ఇక తెలంగాణ ఏర్పాటైన ప్రారంభంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని భూములను డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేటాయించే ఆలోచన ఉన్నదని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన కూడా విద్యార్థుల్లో వ్యతిరేకత పెరుగుదలకు కారణమైందన్న విమర్శ ఉంది.

తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ పంపిణీకి సీఎం కేసీఆర్ నో

తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ పంపిణీకి సీఎం కేసీఆర్ నో

తొలి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంటేనే సీఎం కేసీఆర్ వ్యతిరేక వైఖరి అనుసరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు తానే పూర్తిగా కారణమని ఇటీవల ఘంటాపథంగా చెప్తున్న సీఎం కేసీఆర్.. దీని క్రెడిట్ ఇతరులకు పంచేందుకు సిద్ధంగా లేరని తెలుస్తున్నది. అసలు ఖమ్మం సబ్ జైలుకు తరలించిన తర్వాత దీక్ష విరమిస్తున్నట్లు వార్తలు రావడంతో ఇటు ఉస్మానియా, అటు కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు తీవ్ర నిరసన తెలిపారు. దీంతో మళ్లీ దీక్ష కొనసాగిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. దీంతో తెలంగాణ అంతటా నాటి ప్రభుత్వంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అయ్యాయి. వాస్తవంగా తెలంగాణ ఏర్పాటులో విద్యార్థుల ఆందోళనే కీలకం అన్న సంగతి అందరికీ తెలుసు.

 2014 నుంచి ఓయూ పట్ల తెలంగాణ సర్కార్ ఇలా

2014 నుంచి ఓయూ పట్ల తెలంగాణ సర్కార్ ఇలా

ఇదిలా ఉంటే విద్యార్థుల్లో ఆందోళన, ఉద్రిక్త పరిస్థితుల పేరిట వారిని బద్నాం చేయడం సరి కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఏనాడు ప్రతిష్ఠాత్మక ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్' వంటి జాతీయ స్థాయి సదస్సుల నిర్వహణకు అభ్యంతరాలు గానీ, ఆటంకాలు గానీ కల్పించలేదని చెప్తున్నారు. 2014లో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ, విద్యార్థుల ప్రయోజనాలకు వ్యతిరేకంగానే పని చేస్తున్నదని ఒక ప్రొఫెసర్ వ్యాఖ్యానించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The cancellation of prestigious 105th Indian Science Congress scheduled to be held in Osmania University from January 3 to 7 has caused immense damage to the reputation of 100 year old university. Till the first week of December, the OU authorities were damn sure of conducting the Science Congress and made all the arrangements for the event.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి