• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాలో లగడపాటితో జగడం

By Pratap
|
Lagadapati Rajagopal
వాషింగ్టన్ డి. సి లో నవంబర్ 20వ తేదీన ఏ.పి.ఎన్నారై ఫోరం నిర్వహించిన ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవాల్లో తెలంగాణ ఎన్నారైలు ఆందోళనకు దిగారు. పార్లమెంటు సభ్యుడు లగడ పాటి, పయ్యావుల కేశవ్, తీగల కృష్ణా రెడ్డి, ఇంకా తదితరులు పాల్గొన్న ఈ సమావేశం ఆద్యంతం తెలంగాణా ఎన్నారైల అరుపులు, నినాదాలతో పూర్తిగా విఫలం అయ్యింది. మొదటగా సమావేశ ప్రదేశంలో భవనం వెలుపల తెలంగాణా ఎన్నారైలు తమ ప్లకార్డులను చుపిస్తూ సమైక్యాంధ్ర అంటే తెలంగాణా లేని ఆంధ్ర మాత్రమే అని, ఈనాడు, ఏనాడూ ఈ సీమంధ్రులు తెలంగాణా కి ప్రాతినిథ్యం కల్పించలేదని, తెలంగాణా కి రాజ్యాధికారం లేని ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ వారికి అక్కరలేదని అవతరణ దినోత్సవాల పేరుతో అమాయక తెలుగు ప్రజలకు అబద్ధాలు చెప్తూ, వారికి తప్పుడు సమాచారమిస్తూ తెలంగాణా పై వారి అధికారాన్ని కొనసాగించాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ చెల్లవని, తెలంగాణా రాష్ట్రం అతి త్వరలో ఏర్పడనుందని, ఈ దొంగ నాటకాలు, డబ్బుతో రాజ్యాధికారాన్ని కొనే ప్రయత్నాలు కట్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

స్వల్ప వ్యవధి నిరసన ప్రదర్శనల తరువాత వారు సమావేశ హాలు లోనికి ప్రవేశించారు. కొద్ది నిమిషాల లగడపాటి ప్రసంగం తరువాత, ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై తెలంగాణా ఎన్నారైలు తీవ్రంగా నిరసనలతో స్పందించారు. లగడపాటి కోతలు కట్టి పెట్టాలని, మొన్నటి ఉప ఎన్నికల ఫలితాలు చూసి అయినా సిగ్గు తెచ్చుకోవాలని, తెలంగాణా ప్రజల ఆకాంక్షను అర్ధం చేసుకోవాలని అన్నారు. వారి కోరికకు అనుగుణంగా రాష్ట్ర విభజన జరుగుతుందని, ఆంధ్రుల అంధకార పాలన నశించి, తెలంగాణా ప్రజల దుఖం తొలిగిపోయే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. సీమాంధ్రులు తెలంగాణా వారినేప్పుడైనా, ఏ విషయం లొనూ సమ ఉజ్జీగా చూడ లేదని, మా ఇంట్లో మేమే కూలీలయినామని, ఈ నిలువు దోపిడీ ఇకపై సహించమని చెప్పారు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తీ, ఒక జాతిని మరొక జాతి పీడించే సంస్కృతీ ఇంకానా ఇకపై సాగదని అన్నారు. తెలంగాణా ప్రజల ఒత్తిడి వల్లనే విశాలాంధ్ర ఏర్పడిందని చెప్పిన లగడపాటి కి సిగ్గు, సిగ్గు నినాదాలు ఎదురయ్యాయి. ఈ వ్యాఖ్యలకి చారిత్రక నిరూపణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రా కన్నా తెలంగాణాయే ఎక్కువ అభివృద్ధి అయ్యిందన్న లగడపాటి వ్యాఖ్యలని తెలంగాణా ఎన్నారైలు తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి లో, జనాభా లెక్కల్లో, నీటి ప్రాజెక్టుల విషయంలో లగడపాటి చెప్పిన అబద్ధాలు, తప్పుల తడక లెక్కలు తెలంగాణా ఎన్నారైలకి ఆగ్రహం తెప్పించాయి. కరీం నగర్ లో ఎక్కువ పంటలు పండేది రైతుల బోరు బావుల వాళ్ళ మాత్రమే అని. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రా రైతులకి ఉదారంగా ఇస్తున్నటువంటి నీరు, నిధుల లాంటివి కావని. తెలంగాణా లోని బోరు బావి వ్యవసాయం ఖర్చు, ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులనుండి కాలువల ఆధారంతో నడుస్తున్న ఆంధ్రా సాగుతో పోలిస్తే కనీసం ఆరు రెట్లు ఎక్కువ. తెలంగాణా రైతు తనకున్న అతి కొద్దిపాటి వనరుల్ని, ఈ బోరు బావులపై ఖర్చు చేస్తాడని, ఆ పైన నిరంతరం కారి పోయే మోటార్ల రిపేర్ల ఖర్చులు తడిసి మోపెడై తెలంగా రైతు నడ్డి విరుగుతుందని. ఈ విషయం పరిగణన లోకి తీసుకోకుండా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణా కు జరిగిన లెక్క లేనన్ని అన్యాయాల్లో ఇదొకటని, ఇలాగే ప్రతి విషయంలోనూ, సీమంధ్ర పాలకులు నిస్సిగ్గుగా, తప్పుడు లెక్కలు చూపుతున్నారని అన్నారు. ప్రజలను, శ్రీ కృష్ణ కమిటీని ఇలా తప్పుడు సమాచారంతో పక్కదోవ పట్టిస్తున్న సీమంధ్రులు అబద్ధాలు తెలంగాణపై వారి ఆధిపత్యాన్ని ఎప్పటికీ నిలుపుకోలేరని, సత్యమే చివరి వరకు నిలుస్తుందని, నిలిచి గెలుస్తుందని అన్నారు.

సీమాంధ్ర నాయకులు అవకాశవాదాలతో తమ పబ్బం గడుపుకోవడానికి ఇచ్చిన అన్ని మాటలని తప్పారని, అన్ని ఒప్పందాలని తుంగలో తొక్కారని, ఇంకా నమ్మడానికి తెలంగాణా ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. ఆంధ్ర ప్రజలు కూడా ఈ నీతి మాలిన నాయకుల్ని మట్టి కరిపించాలని, విడిగా రెండు రాష్ట్రాలుగా మన తెలుగు వాళందరూ అభివృద్ధి చెందేటట్లుగా రాష్ట్ర విభజనకు 1973 లో పట్టుబట్టినట్లు మళ్ళీ పట్టు పట్టాలని కోరారు.

హైదరాబాద్ అభివృద్ధి పై ఆంధ్ర నాయకులు చేస్తున్న వితండ వాదనలని తెలంగాణా ఎన్నారైలు గేలి చేశారు. హైదరాబాదు నగరం స్వాతంత్రానికి పూర్వమే ఒక పెద్ద, గొప్ప నగరమని, ఈ నగరానికున్న అన్ని సౌకర్యాలు దేశంలో ఢిల్లీ తరువాత రెండవ అత్యుత్తమ నగరంగా చేశాయని, ఈ నగరం తెలంగాణా ప్రజల రక్త మాంసాలతో కట్టబడిందని అన్నారు. బలవంతపు విలీనం తరువాత, సీమంధ్రులకు ఒక అభివృద్ధి చెందినా నగరం దొరికిందని, దాని వనరులతో తెలంగాణా ప్రజలు కాకుండా సీమంధ్ర నాయకులు, వ్యాపారులు బాగు పడ్డారని, పైగా ఈ అభ్వృద్ధి మేమే చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు.

లగడపాటి అనంతరం మాట్లాడిన తీగల కృష్ణా రెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణా ఎన్నారైల సిగ్గు, సిగ్గు, తెలంగాణా ద్రోహి, డౌన్, డౌన్ అరుపులు కేకలతో సమావేశం మార్మోగి పోయింది. మాట్లాడిన రెండు మొద్దు నిమిషాల్లోనే, జై తెలంగాణా అంటూ తీగల నిష్క్రమించారు. నేను తెలంగాణా వాడిననీ, మాకు సమైక్యాంధ్ర కావాలని, తెలంగాణాలో ఉన్న తోటి సెటిలర్స్ ని కలుపుకుని, పచ్చి అబద్ధాలతో శ్రీ కృష్ణా కమిటీ కి తప్పుడు నివేదిక ఇచ్చిన ఒక ఎన్నారై నలమోటు చక్రవర్తికి చేదు అనుభవం ఎదురైంది. వాడు, వీడనే అరుపులే గాకుండా, తెలంగాణా ద్రోహి, వంచకుడు, అబద్ధాల కోరు అనే బిరుదులూ దక్కించుకున్నాడు.

ఆత్మ గౌరవం, స్వపరిపాలన మాత్రమే తెలంగాణా కు పరిష్కారమని, దీనికి యెంత మాత్రం తక్కువకు తెలంగాణా ప్రజలు ఒప్పుకోరని అన్నారు. లగడపాటి, పయ్యావుల కేశవ్ ప్రసంగంలో చెప్పిన అంకెలన్నీ తప్పులని, వారు, వారి తరుఫున శ్రీ కృష్ణ కమిటీ కి నివేదికలు ఇచ్చిన వాళ్ళంతా తప్పుల తడక లెక్కలు చూపారని, ఇప్పుడు సమావేశంలో చెప్పినవి కుడా అన్నీ అబద్ధాలని చెప్పారు. ఇలా సీమంధ్రులు ఎప్పుడూ అబద్ధాలు చెప్తూనే ఉన్నారని, ఇలా చెప్పడానికి వారికి నోరెలా వస్తుందని, అబద్ధాల బతుకు కన్నా చావు మేలని, అబద్ధపు పునాదులతో నిర్మితమైన వారి రాజ్యం త్వరలో కూలి పోతుందని చెప్పారు. ఈ ప్రశ్నలకు సమాధానమిస్తూ అనవసర విషయాలు మాట్లాడుతున్న పయ్యావుల, లగడపాటి సమస్యను, ప్రశ్నను దాటి వేయకుండా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీరిద్దరూ అన్నీ అబద్ధాలే చెప్తున్నారని చేసిన ఆరోపణలకు లగడపాటి గాని, పయ్యావుల గాని సూటి, సరియైన సమాధానం చెప్పలేక పోయారు.

తెలుగు ప్రజలందరూ అన్న దమ్ముల్లాగ కలిసి ఉండాలన్న వక్తల వ్యాఖ్యలకు ప్రతిగా తెలంగాణా ప్రజలందరికి భారతీయులెవరైనా సహోదరులేనని, ప్రతి భారతీయుడు, భారత దేశంలో ఎక్కడైనా ఉండ వచ్చునని అన్నారు. అలాగని మా ఇంటికి వచ్చి మా పైన పెత్తనం చెలాయించడం కుదరదని. రాజ్యాధికారం మట్టుకు మాదే నని హెచ్చరించారు, తెలంగాణా సంస్కృతి, ఆంధ్ర సంస్కృతి భిన్నమని మనమిక కలిసి ఉండడమనేది అసాధ్యమని వేరుగా రెండు రాజ్యాలుగా విడి పోయి అభి వృద్ధి సాధిద్దామని, సామరస్యంగా విడిపోవడానికి తెలుగు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణా ఏర్పాటు ఎంతో దూరంలో లేదని, దాని కోసం తెలంగాణా ఎన్నారైలు అందరు ఒక్కటై ఈ సీమంధ్ర నాయకుల అబద్ధాలకు చెక్ పెట్టాలని, ప్రతి పట్టణంలో వాళ్ళు ఏర్పాటు చేస్తున్న సభలకు వెళ్లి మన వేదన, ఆకాంక్ష లు గొంతెత్తి చాటాలని కోరారు.

తెలంగాణా ఎన్నారైలు భారీ సంఖ్యలో పాల్గొన్న ఈ నిరసనల్లో రవి పల్ల, జగదీష్ బొందుగుల, శ్యాం వీర్ల, ప్రవీణ్, రాజేష్ మాదిరెడ్డి, కృష్ణ దొమ్మాట, వేణు నక్షత్రం, మాణిక్, విజయకృష్ణ చాట్ల, ఆనంద్, రమణ కంచెట్టి, సంతోష్ పొద్దుటూరి, సంతోష్ మోతుకూరి, సుధాకర్ చంగల్, దామోదర్, రమేష్, నరసింహ రావు, డా. చాట్ల నర్సయ్య, ఇంకా చాలా మంది పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X