వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారులు వేసిన ఆళ్వారుస్వామి

By Staff
|
Google Oneindia TeluguNews

తెలంగాణలో అభ్యుదయ రచయితల సంఘానికి పాదులు ఏర్పర్చి, దానికి జీవం పోసిన వారిలో ప్రముఖుడు వట్టికోట ఆళ్వారుస్వామి. స్వయంగా రచయిత. కమ్యూనిస్టు నాయకుడు, కథకుడు, గ్రంథాలయోద్యమ కర్త, పుస్తక ప్రచురణ కర్త, జర్నలిస్టు పౌరహక్కుల ప్రచారకుడు కూడా. దాదాపు రెండు దశాబ్దాల పాటు (1937-60ల మధ్య) తెలంగాణలో ఆయన పాల్గొనని ఉద్యమం లేదంటే అతిశయోక్తి కాదు. తెలంగాణలో పౌర హక్కుల కోసం పోరాటం మొదలు పెట్టిన వారిలో ఈయనే ఆద్యుడు. నిజాంకు, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నడిపి జైలు జీవితం గడిపాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టనష్టాలకోర్చి తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించి ప్రచారం చేశాడు. కడకు పొట్ట నింపుకోవడానికి హోటల్లో సర్వర్‌గా కూడా పని చేశాడు. రిక్షావాళ్ల నుంచి మొదలుకొని బడా రాజకీయ నాయకుల వరకు అందరితో కలిసి పని చేశాడు. నిజాం ప్రభుత్వం సైకిల్‌ రిక్షాల కదలికలపై ఆంక్షలు విధించినప్పుడు వారికి చేదోడుగా ఉండి ఉద్యమాన్ని నడిపాడు. వివిధ దుకాణాల్లో, సంస్థల్లో గుమాస్తాలుగా పని చేసే వారి సౌకర్యాల కోసం, వారి అభ్యున్నతి కోసం పోరాటం నడిపించారు. ఆది నుంచి పేదల పక్షపాతి అయిన ఆళ్వారు స్వామి ఏ పని చేపట్టినా దాన్ని ఒక ఉద్యమంగా నిర్వహించేవారు.

తెలంగాణలో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటుకు ఎనలేని కృషి చేసింది ఆళ్వారు స్వామియే. వెల్దుర్తి మాణిక్యరావు, బిదురు వెంకటశేషయ్య, భాస్కరభట్ట కృష్ణారావు, రాంభట్ల కృష్ణమూర్తి లాంటి యువ రచయితలు ఈ సంఘం తరఫున ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. అంతే కాకుండా అభ్యుదయ రచయితల సంఘం తరఫున ఆంధ్ర- మద్రాసు ప్రాంతాల్లో పత్రిక ప్రచురించడానికి బ్రిటిషు ప్రభుత్వం ఆంక్షలతో పాటు నిషేధం విధించింది. దీంతో తొలి దశలో ఈ సంఘం తరఫున హైదరాబాద్‌ (సికింద్రాబాద్‌) నుంచి 'తెలుగుతల్లి' అనే మాస పత్రికను నిర్వహించారు. రాచమళ్ల సత్యవతీదేవి సంపాదకత్వంలో వెలువడ్డ ఈ పత్రిక నిర్వహణలో ఆళ్వారు స్వామి కూడా పాలు పంచుకున్నాడు.

'అరసం' కార్యకలాపాలు హైదరాబాద్‌లో విస్తరించాలనే ఉద్దేశ్యంతో అందుకు పూర్తి బాధ్యతలను ఈ సంఘంలో మొదటి నుంచీ సంబంధం వున్న వట్టికోటకు అప్పజెప్పారు. ఇందులో భాగంగా 1944 సెప్టెంబర్‌లో 'అరసం' కార్యదర్శి చదలవాడ పిచ్చయ్యను హైదరాబాద్‌ పిలిపించి ఆయన చేత ఉపన్యాసాలు ఇప్పించారు, వివిధ కార్యక్రమాలు అమలు చేయించారు. అప్పటికే హైదరాబాద్‌లో ఉన్న గుంటూరు పట్టణ అరసం అధ్యక్షుడు 'మీజాన్‌' పత్రిక సంపాదకుడు అడివి బాపిరాజుతోనూ, మాడపాటి హనుమంతరావు, వివిధ దృక్పథాలు కలిగిన యువక, వృద్ధ, నవ్య పూర్వ రచయితలను, కవులను, పండితులను కలిసి పిచ్చయ్య సమాలోచనలు జరిపారు. 1944 సెప్టెంబర్‌ 29వ తేదీన హైదరాబాద్‌లోని నండూరి కృష్ణమాచార్యుల ఇంట్లో కొంత మంది రచయితలు సమావేశమై అరసం హైదరాబాద్‌ శాఖ ఏర్పాటుకు తాత్కాలికంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి సభ్యులను చేర్పించే కార్యక్రమం చేపట్టారు. ఇది హైదరాబాద్‌లో అభ్యుదయ రచయితల సంఘం ఆరంభానికి తొలి మెట్టుగా చెప్పవచ్చు.

వట్టికోట ఆళ్వారుస్వామి ప్రధాన భూమిక నిర్వహించిన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల అరసం సమావేశం 1944 అక్టోబర్‌ 6వ తేదీన హైదరాబాద్‌లోని థియోసాఫికల్‌ సొసైటీ హాలులో అడివి బాపిరాజు అధ్యక్షతన జరిగింది. ఆంధ్ర తెలంగాణ రచయితలను రప్పించి వారి చేత వివిధ సాహిత్యాంశాలపై ఉపన్యాసాలిప్పించాడు. ఈ సమావేశంలో చదలవాడ పిచ్చయ్య, ఖండవల్లి లక్ష్మీరంజనం, బిదురు వెంకటశేషయ్య, మీజాన్‌ సంపాదక వర్గంలోని పి.వి. సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇలా హైదరాబాద్‌ అరసం ప్రారంభమైంది. అయితే దీనికంతటికీ తెర వెనుక వుండి చదలవాడను పిలిపించడం దగ్గర నుంచి సమావేశం విజయవంతంగా నిర్వహించే వరకు ఆళ్వారుస్వామి కీలక పాత్ర వహించారు. అభ్యుదయ రచయితల సంఘం బాధ్యుడుగా హైదరాబాద్‌లో వుంటూ ఆ సంస్థ తరఫున 'తెలుగుతల్లి' పత్రిక నిర్వహణలో పాలు పంచుకోవడమే కాకుండా సంపాదక బాధ్యతల్లో కూడా భాగం పంచుకున్నాడు.

1937లో నిజామాబాద్‌లో జరిగిన ఆంధ్ర మహాసభలో పాల్గొన్న నాటి నుంచే ఆయన ప్రజా జీవనం ఆరంభమైందని చెప్పొచ్చు. 1942లో 'క్విట్‌ ఇండియా' ఉద్యమంలో పాల్గొని కాంగ్రెస్‌ వాదిగా సత్యాగ్రహం చేశారు. ఇందుకు గాను సికింద్రాబాద్‌లో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి వచ్చిన అనంతరం ఆంధ్ర మహాసభ కార్య నిర్వాహకునిగా పని చేశారు. ఈ కాలంలోనే తెలంగాణలోని కమ్యూనిస్టు నాయకులతో సాన్నిహిత్యం పెరిగింది. హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆనాడు సికింద్రాబాద్‌లో ఆయన ఏకైక ప్రజానాయకుడు అంటే అతిశయోక్తి కాదు.

1944 ప్రాంతంలో వట్టికోట కమ్యూనిస్టు పార్టీలో సభ్యునిగా చేరారు. అనతి కాలంలోనే తన నిర్మాణ, నిర్వహణ కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆంధ్ర మహాసభతో పాటు భాషా సంస్కృతులపై కూడా ప్రేమాభిమానాలు గల ఆళ్వారు స్వామికి కమ్యూనిస్టులతో సంబంధం లేని వారితో స్నేహ సంబంధాలు వుండేవి. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డిలతో కలిసి మెలిసి తిరిగే వారు. కాళోజీ నారాయణరావు, వెల్దుర్తి మాణిక్యరావులతో కూడా వుండేవారు. ప్రజలు బాధ్యతాయుత ప్రభుత్వానికై డిమాండ్‌ చేస్తూ ఉద్యమాలు చేస్తుండేవారు. ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వట్టికోటను, మిగతా కమ్యూనిస్టు పార్టీ నాయకులను నిజాం ప్రభుత్వం అరెస్టు చేయించింది.

రచయితగా వట్టికోటకు మంచి పేరుంది. ప్రజల మనిషి, గంగు లాంటి అద్భుతమైన నవలలను రచించిన ఈయన కథానికా రచయితగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఈయన కథానికలు (జైలులోపల మినహా) ఇప్పటికీ పుస్తక రూపంగా రావడానికి నోచుకోలేదు.

1941 నుంచి రచనా వ్యాసంగాన్ని చేపట్టిన వట్టికోట ఆళ్వారుస్వామి రచనలు కథలు, గల్పికలు గోల్కొండ, మీజాన్‌, ఆంధ్రకేసరి, గుమస్తా, స్రవంతి మొదలైన పత్రికల్లో ప్రచురితమయ్యేవి. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ కార్యకలాపాలు ఆరంభం కావడానికి ముందు తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని ఆధారంగా చేసుకుని 1952లో ప్రజల మనిషి అనే నవలను రాశారు. తెలంగాణ రాజకీయ, ప్రజా ఉద్యమాలను రాజకీయోద్యమాలకు ముందు నడిచిన తెలంగాణ ఉద్యమాలను ఇందులో చిత్రించినవి చాలా వరకు స్వానుభవాలే. ఈ నవలకు కొనసాగింపుగా 1940-45 సంవత్సరాల మధ్య కాలంలో తెలంగాణ రాజకీయ, ప్రజా ఉద్యమాలను చిత్రీకరిస్తూ గంగు అనే నవలను రాశారు. ఇది పూర్తి కాక ముందే ఆయన మరణించారు. నవల అలాగే ప్రచురితమైంది. ఇందులో తెలంగాణ ప్రాంత పదాలను వాడినప్పుడు అన్య ప్రాంతీయులకు అర్థమయ్యే రీతిలో అర్థలిచ్చారు. 'జైలు లోపల' అనే కథల సంపుటిని ప్రచురించారు.

జైలు లోపల కథల సంపుటితో పాటు ఆయన వివిధ పత్రికల్లో చాలా కథలు రాశారు. వాటిలో 'గిర్దావరు', రాజకీయ బాధితులు, పరిసరాలు, నాడు- నేడు, భర్త కోసం లాంటి కథలు ఆయనలోని ప్రతిభను సుస్పష్టంగా వ్యక్తం చేస్తాయి.

ఆళ్వారస్వామి కమ్యూనిస్టు నేతగానే కాకుండా పౌర హక్కుల ప్రచారకుడిగా ఎన్నో పోరాటాలు చేశారు. నైజాం ప్రభుత్వం అండదండలతో రజాకార్లు జరిపే దుశ్చర్యలను బయటి ప్రపంచానికి తెలియజేసి బాధితులకు న్యాయం జరిగేందుకు పోరాడారు. అలాగే సంస్థానాధీశులు తమ యిలాకాలో అదనంగా వసూలు చేసే పన్నులకు, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేపట్టారు. రజాకార్ల చర్యలపై నిజ నిర్ధారణ కమిటీల తరఫున వివిధ ప్రాంతాలను సందర్శించి వాటిని పత్రికల వారికి తెలియజేసేవారు. భూపోరాటాలు సాగిస్తున్న వారికి బాసటగా నిలిచేవారు. అలాగే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో హైదరాబాద్‌ రాజ్యం ఎదుర్కుంటున్న ఆహార కొరత నివారణకు అఖిల పక్షాలను ఏకం చేసి ఆ సమస్య పరిష్కారానికి పాటుపడ్డారు. ఆంధ్ర మహాసభ ఐక్యంగా వుండాలని తాపత్రయ పడ్డారు. ఆళ్వారుస్వామి ఏ ప్రకటన చేసినా అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రకటించేవి. మరీ ముఖ్యంగా మీజాన్‌ పత్రిక ఆళ్వార్‌కు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రచురించేది.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో పెట్రోలు కొరత కారణంగా ప్రజలు భారీ సంఖ్యలో రిక్షాలు వుపయోగించేవారు. అయితే యుద్ధం ముగిసిన వెంటనే నిజాం ప్రభుత్వం రిక్షాలు 1946 ఏప్రిల్‌ నుండి ఆరు నెలల లోపు రద్దు చేయబడతాయని ప్రకటించింది. ఇలా హఠాత్తుగా రిక్షా కార్మికులను రోడ్డున పడేయడం అన్యాయమని ఆయన ఉద్యమాన్ని లేవదీశారు. రిక్షా కార్మికులను వెంట పెట్టుకుని ప్రభుత్వానికి మెమోరాండాలు సమర్పించారు. జీవిత రక్షణ, శాంతి సౌఖ్యాలతో కూడిన సమాజాన్ని నిర్మించేందుకు కష్ట జీవుల కోసం సంఘాలు పెట్టి చైతన్యపరచాల్సిన బాధ్యత దేశంలోని రాజకీయ సంస్థలపై వుందని ఆయన అభిప్రాయపడేవారు. అప్పటికే నిరుద్యోగ సమస్య హైదరాబాద్‌లో ప్రబలంగా వుండేది. దాదాపు ఐదు వేల మంది రిక్షా కార్మికులున్నారని అప్పటి అంచనా. అలాగే యుద్ధ కాలంలో ఉద్యోగంలో చేర్చుకుని ఆ తర్వాత తొలగించబడ్డ రైల్వే కార్మికులు ఇతర కార్మికుల తరఫున పోరాడారు.

తెలంగాణలో కవులే లేరన్న ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి 1934లో సురవరం ప్రతాప రెడ్డి 'గోలకొండ కవుల సంచిక'ను ప్రచురించగా, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి అభ్యుదయ పథాన నడిపే రచనలను ప్రచురించే ఉద్దేశ్యంతో వట్టికోట ఆళ్వారుస్వామి దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించారు. తెలుగువారి ముఖ్యంగా తెలంగాణ వారి సంస్కృతిని కాపాడి వారి విజ్ఞానాభివృద్ధిని కాంక్షించి ఆళ్వారుస్వామి దీన్ని స్థాపించాడు.

ఈ గ్రంథమాల తొలి పుస్తకంగా సురవరం ప్రతాపరెడ్డి రచించిన 'హైందవ ధర్మోపలీల'ను ప్రచురించారు. ఈ గ్రంథానికి తన మిత్రుడు మల్లంపల్లి సోమశేఖర శర్మచే పీఠిక రాయించారు. అలాగే రెండు సంపుటాల్లో ప్రచురింపబడ్డ 'తెలంగాణ' అనే పుస్తకాలు ఈనాటికి రెఫరెన్స్‌ గ్రంథాలుగా పనికి వస్తున్నాయంటే వాటి విలువ తెలుస్తుంది. తొలి దశలో 1938 నుంచి 41 సంవత్సరాల మధ్య కాలంలో దాదాపు 12 పుస్తకాలు ప్రచురించారు. అయితే 1941 తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో గ్రంథమాల అంత సవ్యంగా నడవలేదు. ఆర్థిక వనరులు సమకూర్చుకుని పునః ప్రారంభిద్దామనుకునే సరికి 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యారు. జైలు నుంచి విడుదలయిన తర్వాత ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు ఉద్యమాల్లో బిజీ అయ్యాడు. దీంతో గ్రంథమాల కోసం సమయాన్ని వెచ్చించలేకపోయాడు. తిరిగి 1946 ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమంలో భాగంగా రజాకర్లకు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడి మరో సారి జైలు పాలయ్యారు. తెలంగాణలోని చాలా మంది ఖైదీలు 1948 సెప్టెంబర్‌ 17 పోలీసు చర్య అనంతరం విడుదలయినప్పటికీ కమ్యూనిస్టు నాయకులపై జె.ఎస్‌. చౌదరి, నంజప్ప సర్కార్‌లు పక్షపాత ధోరణితో వ్యవహరించి మరో మూడేళ్ల తర్వాత, అది కూడా ఎన్నో ప్రజా ఉద్యమాల అనంతరం విడుదల చేశాయి. రావి నారాయణరెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామిలను మిలిట్రీ ప్రభుత్వం 1951 వరకు జైల్లోని వుంచింది.

పొట్టకూటి కోసం హోటల్‌లో సర్వర్‌గా కూడా పని చేసిన ఆళ్వారుస్వామి గురించి ఈ కాలం వారికి అంతగా తెలియదు. గ్రంథాలయోద్యమానికి ఆయన బాసటగా నిలిచారు. ఎననో విలువైన, ఉత్తమమైన గ్రంథాలను తన గ్రంథమాల తరఫున ప్రచురించాడు. నవంబరు ఒకటిన ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని అట్టహాసంగా ప్రభుత్వం జరుపుకుంటే దాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ముద్దుబిడ్డను స్మరించుకునేందుకు సమయం దొరకడం లేదు. జైలు లోపలతో సహా ప్రచురణకు నోచుకోని ఆయన కథలను ప్రచురించాల్సిన అవసరం వుంది. ఆయన నవలలు ప్రజలమనిషి, గంగు నవలలను చదవాలని చాలా మందికి ఉన్నప్పటికీ ఆ పుస్తకాలు మార్కెట్లో లభ్యం కావడం లేదు. వాటిని కూడా పునర్ముద్రించాల్సిన అవసరం వుంది.

నల్లగొండ జిల్లా నకిరేకల్లు సమీపంలోని మాధవరం అనే ఊర్లో 1915 నవంబరు ఒకటిన జన్మించిన ఆళ్వారుస్వామి 1961 ఫిబ్రవరి ఐదున తుది శ్వాస విడిచారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X