వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్విక్‌బాక్సింగ్: కుక్కా కోతీ ఎద్దూ ఎనభై

|
Google Oneindia TeluguNews

ఈ సృష్టిలో ఏమేమి వుండును? నువ్వూ నేనూ మనమే కాదు కుక్క యున్నూ కోతియున్నూ ఎద్దు యున్నూ వుండును. ఇంతేకాదు. లెక్క పెట్టడానికి వీల్లేని అనేక ప్రాణులు వివిధ షేపుల్లోనూ డిజైన్లలోనూ వుండును. ఈ భూమ్యాకాశాల మధ్య వుండే ప్రాణులన్నింటినీ ఓ పద్ధతి ప్రకారమే తయారు చేసి వొదిలాడు ఆ తయారీదారుడు. తిండం తొంగోడం ప్రధానమైన పనులైనప్పటికీ ఆ రెంటి మధ్య రకరకాల డ్యూటీలు అప్పగించాడు. డ్యూటీలతోపాటు ఆ డ్యూటీ పూర్తయ్యే ‘టర్మ్'ని కూడా ఫిక్స్ చేసేశాడు. ఈ ‘టర్ము'నే మనం ఆయుష్షనీ, లైఫ్ టైమనీ జీవిత కాలమనీ చెప్పుకుచస్తున్నాం చావక తప్పదు కనుక.

అసలు ఏ ప్రాణికి ఎంత లైఫ్ టైమ్ మంజూరు చేశాడో మనమేకర్?

ఇందుకోసం మనం చాలా చాలా గుండ్రాలు తిరిగి వెనక్కి వెళ్లిపోదాం.

దేవుడనే వాడు ఒక నాలుక్కాళ్ల ప్రాణిని సృష్టించాడు. దానికో తోక అతికించడం తోపాటు అదే పనిగా మొరిగే టాలంటూ ఇచ్చాడు. ఆ మొరిగే కుక్కరు భూమ్మీదకి డ్రాప్ చేస్తూ.. ‘డియర్ డాగీ నీకు ఇరవయ్యేళ్ల లైఫ్ టైం యిచ్చి భూమ్మీదకి పంపేస్తున్నాను. కపలా కాయడం, దవడలు నెప్పెట్టేలా మొరగడం నీ పన్లు. రాత్రీ పగలూ అదే పనిగా మొరిగేసి ఇరవై యేళ్లకి ఇటోచ్చెయ్యి' అన్నాడు.

‘ఇరవై యేళ్లు మొరగడమా? నా వల్ల కాదు. పితాశ్రీ కాపలా కాయడానికీ, కంటిన్యూవస్‌గా మొరగడానికీ పదేళ్లు చాలవా? ప్లీజ్ మిగిలిన పదియేళ్లు వాపస్ తీసుకోవూ' అని బతిమాలింది. కాస్సేపయితే అదిక్కడే తనమీదే మొరుగుతుందని, ‘సరే ఫో' అన్నాడు కుక్క దగ్గర్నుంచి పదేళ్ల లైఫ్ టైం వాపస్ పుచ్చుకుంటూ.

అలా కుక్క భూమ్మీదకి పదేళ్లు మొరగడానికి వెళ్లిపోయేక మరో ప్రాణిని తయారు చేసేడు అయితే అది కుక్కలా నాలుక్కాళ్ల మీదే కాదు రెండు కాళ్ల మీదనూ నడవ గలదు. చెట్లు ఎక్క గలదు. ఇలాంటి ప్రాణిని భూమమీదకి డ్రాప్ చేస్తూ..

 chintapatla sudarshan column on human lifetime

‘డియర్ మంకీ నీ కోతి చేష్టలతో లోకానికి ఎంటర్టైన్మెంట్ చెయ్యడానికి నిన్ను భూమ్మీదకి పంపేస్తున్నాను. చెట్లెక్కడం, వుయ్యాల్లూగడం, పళ్లు కొరికి తినకుండా విసిరేయడం భలేగా వుండేసి ఇరవైయేళ్లకి యితొచ్చేసెయ్యి' అన్నాడు.

‘ఇరవైయేళ్లు కోతిచేష్టలా? నావల్ల కాదు డాడీ చెట్ల మీద వూగుతూ తలకిందులుగా వేళ్లాడుతూ వుంటానికి పదేళ్లు చాలు. మిగిలిన పదేళ్లు నీ దగ్గరే వుంచేసుకో' అని బతిమాలింది.

కాస్సేపయితే కిచకిచమని కోతి గంతులు మొదలు పెడ్తుందేమోనని ‘సరే ఫో' అన్నాడు దాని మేకర్ కోతి దగ్గర్నుంచి పదేళ్ల జీవిత కాలం తిరిగిపుచ్చేసుకుంటూ.

అలా కోతి భూమ్మీదకి ఓ పదేళ్ల చెట్లమ్మటా పుట్లమ్మటా తిరిగి నానా హంగామా చెయ్యడానికి బయల్దేరి వెళ్లిపోయింది.

కుక్క కోతీ భూమ్మీదకి వెళ్లిపోయేక దేవుడు యేపనీ పాటా లేకుండా వుండలేడు కద. ఈ దఫా మరొక ఆకారాన్ని తయారు చేశాడు. ఆ రెంటికంటే ఇది ఆకారంలో చాలా పెద్దది. బలమైనది కూడా. కష్టపడి పనిచేసేది కూడా అయిన దాన్ని భూమ్మీదకి డ్రాప్ చేస్తూ..

‘డియర్ ఎద్దూ! నువ్వు ఎంత కష్టమైన పనినైనా చెయ్యగలవు. నీకా సత్తా యిచ్చాను. బావుల్లోంచి నీళ్లు తోడవచ్చు. బరువు బండ్లు లాగ వచ్చునువ్వు. ఎక్కడబడితే అక్కడ దొరికే గడ్డి నవిలి చెమటోడ్చి పని చెయ్యడానికి నిన్ను భూమ్మీదకి పంపేస్తున్నాను. వంచిన తల ఎత్తకుండా పని పనీ పనీ చేసి ఓ అరవై ఏళ్ల తర్వాత యిటోచ్చేసెయ్యి' అన్నాడు.

ఎద్దు గుండె గుభేలుమంది. ‘అరవై యేళ్లే? బండ్లు లాగడం, పన్లు చెయ్యడం నానా గడ్డి మెయ్యడం అరవైయేళ్ల కాలమా? వద్దు బాసూ వద్దు ఓ ఇరవై యేళ్లిస్తే చాలు. మిగతా నలభై యేళ్లు ‘ఎక్సెస్ నాకు'. ప్లీజ్. వాటిని నీ దగ్గరే వుంచేసుకోవా' అని మూల్గింది ఎద్దు.

కాస్సేపయితే ఎద్దురంకెవేస్తూ మొరాయిస్తూ సతాయిస్తుందేమోనని ‘సరే ఫో' అన్నాడు దాని బాస్, ఎద్దు దగ్గర్నుంచి నలభై ఏళ్ల ‘లైఫ్ టైమ్' తన బ్యాగ్‌లో తిరిగి వేసేసుకుంటూ.

కుక్కా, కోతీ, భూమ్మీదకి వెళ్లి పోయేక దేవుడు మళ్లీ యేపనీ పాటా లేకుండా వుండలేడు కద. ఈసారి మరొక ఆకారాన్ని ప్రొడ్యూస్ చేశాడు. దీనికి కాళ్లు రెండే యిచ్చాడు కాని వెరైటీగా ఉంటుందని రెండు చేతులు కూడా యిచ్చాడు. మిగితా వాటికి అతికించిన ‘తోక' బరువు కూడా లేకుండా కోసేశాడు. పైగా అన్ని ప్రాణులకంటే స్పెషల్‌గా వుండాలని తలలో బుర్రని కూడా పెట్టాడు. ఇలా తయారు చేసిన ప్రాణి కుక్కలా మొరగడం, కోతిలా చేష్టలు చెయ్యడం, ఎద్దులా బండి లాగడం బావోదని జాలీగా కులాసాగా హాయిగా, మజాగా బతకాలని అనుకుని ఆ ప్రాణిని భూమ్మీదకి డ్రాప్ చేస్తూ

‘డియర్ హ్యూమన్ బీయింగ్! నువ్వు చాలా లక్కీ ఫెలోవి. నీకు తోక యివ్వలేదు. ఎక్స్‌ట్రా బుర్రని యిచ్చా' తిన్నింత తిను, తాగినంత తాగు, పెళ్లాడు, ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చెయ్యి, కంటినిండా నిద్రపో. నిన్నిప్పుడే భూమ్మీదకి కొరియర్ చేస్తున్నా. జాలీగా కులాసాగా, హాయిగా, మజాగా బతికేసి యిరవేళ్ల తర్వాత యిటొచ్చేయి' అన్నాడు.

మనిషి గుండె గుభిల్లుమంది. ఇరవై యేళ్లేనా? జాలీగా, కులాసాగా, హాయిగా, మజాగా ఇరవై యేళ్లేనా? ఓన్లీ ట్వంటీయర్స్! నో ఫాదర్ నో.. నో.. అని బిగ్గరగా అరిచాడు మనిషి.

ఉలిక్కిపడ్డాడు దేవుడ. ‘అదేమిటోయ్ ఎద్దు నలభై యేళ్లూ, కోతి పదేళ్లూ, కుక్క కూడా పదేళ్లూ ఆయుష్షులో ‘రిటర్న్' చేశారు కదా. నువ్వుంటిలా?' అనడిగాడు.

‘సార్! వాటి పన్లకీ నా డ్యూటీకి చాలా తేడా వుంది. అయినా ఎంజాయ్ చెయ్యడానికి ముష్టి ఇరవై ఏళ్లు ఏ మూలకి సరిపోయేను. నాకు యింకా కొన్నేళ్లు ఎక్స్‌ట్రా యివ్వడం అవసరం' అన్నాడు మనిషి.

‘సారీ మ్యాన్ నా దగ్గర మిగిలిన జీవితకాలం ఇరవైయేళ్లే మరి' అన్నాడు దేవుడు ఏమీ పాలుకపోక.

దేవుడు తనకిచ్చిన బుర్రలో లైట్ వెల్గించాడు మనిషి. ‘ఓరి దేవుడోయ్! నాకు యిచ్చేందుకి తమరి దగ్గర యిరవైయే వున్నాయంటారా? మరి మీకు ఎద్దూ కోతీ కుక్కా వెనక్కి యిచ్చేసిన ఏళ్ల మాటేమిటి? అవి ఇటు మళ్లించండి. ఎద్దు యిచ్చేసిన నలభయి, కోతి యిచ్చేసిన పదీ, కుక్క రిటర్ను చేసిన పదీ కలిపితే అరవై. ఆ అరవై నా ఇరవైకి కలిపితే ఎనభయి, కావాలంటే కాలికులేటర్‌లో సరి చూసుకోండి. అవి నాకిచ్చేసెయ్యండి' అన్నాడు మనిషి.

మనిషికి తానిచ్చిన తెలివితేటలకి తెగ ముట్టటపడ్డ దేవుడు అతనికిచ్చిన యిరవైకి అరవై కలిపేశాడు.

ఎనభైయేళ్ల లైఫ్ వారంటీతో భూమ్మీదకి వచ్చి పడ్డాడు మనిషి. అయితే తనకు సొంతంగా దేవుడిచ్చిన యిరవై ఏళ్లూ జాలీగా, కులాసాగా, హాయిగా, మజాగా ఏ బాదరబందీ లేకుండా గడిపేశాక, ఎద్దిచ్చిన నలభై ఏళ్ల కాలం కుటుంబం కోసం ఎద్దులా పని చేస్తూ కోతి యిచ్చిన పదేళ్ల కాలం మనవల్ని ఆడించడానికి కోతి చేష్టలు చేస్తూ చివరాకర్ని కుక్కయిచ్చిన పదేళ్లూ కూచున్నచోట్నంచి కదల్లేక మరో మనిషి కనిపిస్తే చాలు మోర ఎత్తి మొరుగుతూ బతికేస్తున్నాడు.

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about human lifetime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X