హైదరాబాద్: తెలంగాణపై సోమవారం లోగా కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే మంగళవారం నుంచి తెలంగాణలో నిరవధిక బంద్ పాటిస్తామని రాజకీయ, ప్రజా సంఘలా జెఎసి హెచ్చరించింది. ప్రొఫెసర్ కోదండరామ్ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం జరిగిన జెఎసి సమావేశంలో కె. చంద్రశేఖర రావు (తెరాస), కె. జానా రెడ్డి, మధు యాష్కీ, ఆర్ దామోదర్ రెడ్డి (కాంగ్రెసు) తదితరులు పాల్గొన్న సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు రోజుల పాటు రిలే దీక్షలు, నిరసనలు మాత్రమే ఉంటాయని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించాలని నిర్ణయించింది. తెలంగాణవ్యాప్తంగా మోహరించిన పోలీసు, పారా మిలిటరీ బలగాలను ఉపసంహరించాలని డిమాండ్ చేసింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దాడి జరిగిన నేపథ్యంలో జెఎసికి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. విడిగా తెలంగాణ కోసం ఉద్యమం నిర్వహించాలని నిర్ణయించింది. అయితే తెలుగుదేశం పార్టీ తమతో కలిసి రావాలని జెఎసి విజ్ఞప్తి చేసింది. ప్రజారాజ్యం, బిజెపి, తదితర పార్టీలతో పాటు ఎమ్మార్పీయస్, తదితర ప్రజాసంఘాలు కూడా పాల్గొన్నాయి. శనివారం బంద్ ఉండదని జెఎసి ప్రకటించింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి