పథకం ప్రకారమే మిలియన్ మార్చ్‌లో ట్యాంక్‌బండ్ విగ్రహాల ధ్వంసం
State
oi-Pratapreddy
By Pratap
|
మిలియన్ మార్చ్ గ్యాలరీ
హైదరాబాద్: మిలియన్ మార్చ్ సందర్భంగా గురువారం హైదరాబాదులోని ట్యాంక్ బండ్‌పై గల విగ్రహాలను ధ్వంసం చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ట్యాంక్ బండ్ మీద ఎక్కువగా సీమాంధ్రకు చెందిన వ్యక్తుల విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించారని, తెలంగాణలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తుల విగ్రహాలు తక్కువగా ఉన్నాయని తెలంగాణావాదులు చాలా కాలంగా వాదిస్తూ వస్తున్నారు. విగ్రహాలను ధ్వంసం చేస్తామని కూడా హెచ్చరికలు చేస్తూ వచ్చారు. ఈ హెచ్చరికల మేరకు ట్యాంక్ బండ్‌పై ఉన్న వ్యక్తుల విగ్రహాలను ధ్వంసం చేశారని భావించాల్సి ఉంటుంది. అయితే, ఒక పథకం ప్రకారం జరిగినట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. ఉదయం పూట పోలీసులు, మీడియా ప్రతినిధులతో మాత్రమే నిండిపోయిన ట్యాంక్ బండ్ మధ్యాహ్నం తర్వాత తెలంగాణవాదులతో అట్టుడికిపోయింది. గుంపులు గుంపులుగా వచ్చిన తెలంగాణ వాదుల దాటికి పోలీసులు బిత్తరపోయారు. వారిని కట్టడి చేయడం పోలీసుల వల్ల కాలేదు. తీవ్ర ఉద్రిక్తత మధ్య తెలంగాణవాదులు విగ్రహాలను ధ్వంసం చేశారు.
ధ్వంసమైన విగ్రహాలను చూస్తే ఏరికోరి విధ్వంసానికి దిగినట్లు కనిపిస్తోంది. సీమాంధ్ర ప్రాంతంలో గణుతికెక్కిన అన్నమయ్య, ఎర్రాప్రగడ, శ్రీకృష్ణ దేవరాయలు, సిద్ధేంద్ర యోగి, పల్నాటి బ్రహ్మనాయుడు ,ముట్నూరి కృష్ణారావు, కందుకూరి వీరేశలింగం, త్రిపురనేని రామస్వామి చౌదరి, ఆర్థర్ కాటన్, బళ్లారి రాఘవ, గురజాడ అప్పారావు, రఘుపతి వెంకయ్య విగ్రహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తెలంగాణకు చెందిన సురవరం ప్రతాప రెడ్డి, రామదాసు, మగ్దూం మొహియుద్దీన్ విగ్రహాల జోలికి ఆందోళనకారులు వెళ్లలేదు. సీఆర్ రెడ్డి విగ్రహాన్ని ఎందుకు వదిలేశారో తెలియదు గానీ నన్నయను తొలి తెలుగు కావ్యాన్ని సృష్టించిన కవి కావడం వల్ల వదిలేసి ఉంటారు. పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆయన జాతీయ జెండాను రూపొందించిన మహా వ్యక్తి కావడం వల్ల ముట్టుకుని ఉండరు. శ్రీశ్రీ విప్లవ కవి కావడం వల్ల, గుర్రం జాషువా దళిత కవి కావడం వల్ల వదిలేసి ఉండవచ్చు. అయితే, తిక్కన, క్షేత్రయ్య, అల్లూరి సీతారామా రాజు విగ్రహాలను ఎందుకు వదిలేశారనేది హేతువుకు అందడం లేదు. అయితే, విగ్రహాల ధ్వంసంలో తెలంగాణవాదులు స్పష్టమైన హేతువును అనసరించి ఉంటారని భావిస్తున్నారు.
It is clear that Telangana agitators' attack on statues on Tank bund in Hyderabad is pre - planned. Telanganites chose statues of Seemandhra personalities to attack. Most of the statues of seemandhra personalities were totally destroyed.
Story first published: Friday, March 11, 2011, 10:28 [IST]