హైదరాబాద్: రాజధానిలో మంగళవారం మరోసారి భారీగా పేలుడు పదార్థాలు బయట పడ్డాయి. హైదరాబాదులోని కంచన్‌బాగ్ బస్సు డిపో పరిధిలో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో జిలెటన్ పేలుడు పదార్థాలు హైదరాబాదులో దొరకడం ఇదే మొదటి సారి అని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కొందరు యువకులు ఓ వాహనంలో వీటిని తరలిస్తున్నారు. జిలెటిన్ పేలుడు పదార్థాల రవాణాకు ఎలాంటి అనుమతులు లేక పోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. కంచన్ బాగ్ పరిసర ప్రాంతాలలో పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా దిల్‌సుఖ్ నగర్ పరిధిలోని చైతన్యపురిలో బాంబు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో బాంబు పెట్టినట్లు ఓ అగంతకుడు పోలీసు కంట్రోలు రూంకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చుట్టు పక్కన ప్రాంతాలలో తీవ్రంగా గాలింపులు చేపట్టారు.