• search
For guntur Updates
Allow Notification  

  పల్నాడు అక్రమ మైనింగ్‌పై సీఐడీ దర్యాప్తు ప్రారంభం...సీఐబీ విచారణ కోరడం హాస్యాస్పదమంటున్న ఎమ్మెల్యే

  By Suvarnaraju
  |

  గుంటూరు:గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో సున్నపురాయి అక్రమ తవ్వకాలపై సీబీసీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. రెండురోజుల క్రితం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందుకొన్న ఈ సంస్థ మొత్తం కేసుల దర్యాప్తు కోసం ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

  ఒక్కో బృందంలో ముగ్గురు డీఎస్‌పీలు, 14 మంది ఇన్‌స్పెక్టర్లు, ఇతర ర్యాంకుల అధికారులను దర్యాప్తు కోసం నియమించింది. మొత్తం కేసులు డీఐజీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర డీజీపీకి సిబిసిఐడి నివేదించింది. దీంతో అక్రమార్కుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు రాజకీయ లబ్ది కోసమే వైకాపా తనను టార్గెట్ చేసిందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు.

  CIDs investigation started on Lime stone illegal mining

  గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలంలోని కేసానుపల్లి, దాచేపల్లి మండలంలోని నడికుడి, కోనంకి తదితర గ్రామాల్లో గత నాలుగేళ్ల నుంచి సున్నపురాయి నిక్షేపాలు పెద్దఎత్తున అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. ఈ క్రమంలో దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అంతేకాకుండా కేంద్రప్రభుత్వ సంస్థతో దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

  కోర్టు ఉత్తర్వులతో మేల్కొన్న జిల్లా యంత్రాంగం క్షేత్ర స్థాయిలో మైనింగ్‌ అధికారులతో అక్రమ తవ్వకాలపై పరిశీలన జరిపించగా...ఆ నివేదిక నేపథ్యంలో స్థానిక నాయకులు 17 మందికి ఇందులో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్లు కలెక్టర్‌ కోన శశిధర్‌ నిర్ధారించి ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించారు. ఇప్పటివరకూ మొత్తం 31.30 లక్షల మెట్రిక్‌టన్నుల సున్నపురాయి అక్రమంగా తరలిపోయినట్లు పరిశీలనలో తేలినట్లు పేర్కొన్నారు.

  CIDs investigation started on Lime stone illegal mining

  అలా అక్రమంగా తరలివెళ్లిన సున్నపురాయి విలువ సుమారుగా రూ.156 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్లేనని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో స్థానిక నేతలే కాకుండా మైనింగ్‌, వాణిజ్య పన్నులు, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌ అధికార వర్గాలకు కూడా భాగస్వామ్యం ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్ తన నివేదికలో పేర్కొ నడం గమనార్హం. ఈ నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్‌ డీడీ పాపారావు, ఏడీ జగ న్నాథరావుని సస్పెన్షన్‌ చేయడంతో పాటు సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది.

  ఇక ప్రభుత్వ ఆదేశాలపై స్పందించి రంగంలోకి దిగిన సిబిసీఐడీ దర్యాప్తుకు ఆరుప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా ఆయా బృందాలు శుక్రవారం నుంచే విచారణ ఆరంభించనున్నాయి. ఈ క్రమంలో సిఐడి అధికారులు...మైనింగ్‌ శాఖ నుంచి మొత్తం ఫైళ్లని స్వాధీనం చేసుకొని పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో లోతుగా దర్యాప్తు జరపుతారని తెలిసింది.

  CIDs investigation started on Lime stone illegal mining

  మరోవైపు సరస్వతీ సిమెంట్స్ భూముల విషయంలో రైతుల పక్షాన నిలబడినందుకే వైకాపా అధ్యక్షుడు జగన్ తనపై కక్ష గట్టారని గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు. అక్రమ మైనింగ్ ఆరోపణల నేపథ్యంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులతో కలిసి యరపతినేని శ్రీనివాసరావు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అక్రమ మైనింగ్ వెనుక తనపాత్ర ఉందని 4 ఏళ్లుగా జగన్ సొంత పత్రిక సాక్షి తనపై బురదజల్లడం రాజకీయ లబ్ధి కోసమేనని దుయ్యబట్టారు.

  అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ 2011లో కాంగ్రెస్ పాలనలోనే లోకాయుక్తకు పిర్యాదులు వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇదే విషయమై అప్పటి ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి స్వయంగా సిఎంకు లేఖ రాశారని యరపతినేని చెప్పారు. మళ్లీ వారే టిడిపి ప్రభుత్వం వచ్చాక పిటిషన్లు వేయడం వెనుక ఆంతర్యం ఏమిటని యరపతినేని ప్రశ్నించారు. 2014 తరువాతే అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పడం రాజకీయ కుట్రేనని యరపతినేని ఆరోపించారు. సీబీఐ అధికారులను గతంలో దూషించిన వైకాపా నేతలే ఇప్పుడు సీఐబీ విచారణ కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

  అనంతరం వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు మాట్లాడుతూ గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని...దొంగే దొంగ అన్నట్లు వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో తన ఆస్తులను కాపాడుకోవడం కోసం కేటీఆర్ ను పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్ కు మంత్రిగా అర్హత లేదని చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఎవరని జివి ఆంజనేయులు ప్రశ్నించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  మరిన్ని గుంటూరు వార్తలుView All

  English summary
  CID will be start investigation on illegal mining of limestone in Gurajala Constituency of Guntur district on Friday. Two days ago, the CID received orders from the government and then set up six special teams to investigate all illegal mining cases in this area.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more