కోడి పందాలా మజాకా...పోటీల కోసం హైటెక్ బరులు...ఎల్ఈడీ స్క్రీన్లు,డ్రోన్ కెమేరాలు,ఎసి ఛాంబర్లు...బెట్ట

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

అమరావతి: కోడి పందాలపై...పందెంరాయుళ్లదే పైచేయి అయింది...చివరకు అనుకున్నదే జరుగుతోంది...ఒక్క కోర్టు వైపు నుంచి తప్ప ఇంక అన్ని వైపుల నుంచి వచ్చిన ఒత్తిడితో కాక్ ఫైటింగ్ పై పోలీసులు పట్టు సడలించాల్సి వచ్చింది....దీంతో కోస్తా వ్యాప్తంగా కోడిపందాలు జోరుగా ఇంకా చెప్పాలంటే మహా జోరుగా సాగుతున్నాయి...

ఒకప్పుడు సంక్రాంతి సంప్రదాయానికి కోడిపందాలు చిహ్నం...కానీ కాలక్రమంలో ఈ పోటీల తీరు మారిపోయింది. పందెంరాయుళ్లు ఈ కోడిపందాలను కోట్లు కొల్లకొట్టే ఆదాయ వనరుగా మలుచుకున్నారు. సంపాదన చుక్కల నంటుతుండటంతో పోటీలు మరింత రసవత్తరంగా జరగడానికి కాలానుగుణంగా ఆధునిక హంగులన్నీ సమకూరుస్తున్నారు. బెట్టింగ్ కు హద్దే లేకుండా చేస్తున్నారు. సంప్రదాయ కోడి పందాలు చివరకు ఇలా రూపుమారిపోవడంపై కడుపు మండిన కొందరు కోర్టుకు వెళ్లారు...కోడి పందాలపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. ఆ తీర్పును కూడా ఎవరికి అనుకూలంగా వారు అన్వయించుకున్నారు...ఫైనల్ గా బెట్టింగ్ రాయుళ్లు కోరుకున్న అనుకూల వాతావరణం ఏర్పడింది...కట్ చేస్తే...కోస్తా వ్యాప్తంగా కనీవినీ ఎరుగని స్థాయిలో కోడిపందాలు జరుగుతున్నాయి.

 కోస్తా వ్యాప్తంగా...కోడి పందాల జోరు...

కోస్తా వ్యాప్తంగా...కోడి పందాల జోరు...

కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాలపై బెట్టింగ్ లు కోట్ల రూపాయల్లో సాగుతున్నాయి. ఈ పందేలను కాసేందుకు ...చూసేందుకు...సుదూర ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు, బడాబాబులు ఈ ప్రాంతాలకు తరలివచ్చి లాడ్జీల్లో మకాంవేశారు. పందెం అన్నాక ఒక్క కోడిపందేలతోనే ఆగిపోతే ఎలా అనుకున్నారో ఏమో ఈ బరుల పక్కనే పేకాటకు సంబంధించిన గుండాట, కోతముక్క, లోపల బయట ఆటలు కూడా ఏర్పాటుచేస్తున్నారు.

 పందాలు జరిగే ప్రాంగణాలే...బరులు...

పందాలు జరిగే ప్రాంగణాలే...బరులు...

కోళ్లు తలపడేందుకు సిద్ధం చేసిన పోటీ ప్రాంగణాన్నే బరి అంటారు...ఇప్పుడు ఈ బరులే పందెంరాయుళ్లకు కాసులు కురిపించే వనరుగా మారిపోయాయి. కొన్నిచోట్ల ఎప్పటి నుంచో బరుల కోసం ఒక మైదానాన్ని నిర్ణయించి ఏటా అక్కడే పందాలను కొనసాగిస్తున్నారు. మరికొన్నిచోట్ల అప్పటికప్పుడు ఒక ప్రైవేటు స్థలాలను కానీ లేదా పొలాలను కానీ నాలుగైదు రోజులకు లీజుకు తీసుకుని బరులను సిద్ధం చేస్తున్నారు. ఈ స్థలాలకు నాలుగు రోజుల లీజే లక్షల్లో ఉంటుంది.

బరులకు...హైటెక్ హంగులు...

బరులకు...హైటెక్ హంగులు...

అలా ఎంపిక చేసిన స్థలాలను చదును చేసి బరిగా రూపొందిస్తారు...పందేల్లో పాల్గొనేవారికి సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ బరులను అన్నివిధాలా అనువుగా తీర్చిదిద్దుతున్నారు. మొదట్లో బరి ప్రాంగణాల్లో కుర్చీలు, షామియానాలకు, విందు ఆ తరువాత కొన్నాళ్లకు మందు కూడా సమకూరగా...ఇప్పటి బరులు ఏకంగా కోడి పందాల ప్రాంగణాలు మినీ స్టేడియాలను తలపిస్తుండగా ఇక్కడ ఏకంగా హైటెక్ హంగులే సమకూరుస్తున్నారు. కోడి పందేలను ప్రతి ఒక్కరూ స్పష్టంగా ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద పెద్ద ఎల్‌ఈడీ స్ర్కీన్లు, వాటిల్లో ప్రత్యక్ష ప్రసారాలు, కోళ్ల ప్రతి కదలికను రికార్డ్ చేసేందుకు డ్రోన్ కెమేరాలు, బడాబాబులు పందేలను హాయిగా ఆస్వాదించేందుకు ఏసీ ఛాంబర్లు...ఇలా అన్నిఏర్పాట్లు చేస్తున్నారు.

 రాష్ట్రవ్యాప్తంగా వేలాది బరులు...ఉభయ గోదావరి జిల్లాల్లో 1000కి పైగా...

రాష్ట్రవ్యాప్తంగా వేలాది బరులు...ఉభయ గోదావరి జిల్లాల్లో 1000కి పైగా...

ఈ కోడి పందాలకోసం రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో బరులు సిద్దమయ్యాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఈసారి పందేల హడావిడి ఎక్కువగా ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం నాటికి 600 ప్రాంతాల్లో బరులను సిద్ధం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోను 400 పైగానే బరులు ఏర్పాటయినట్లు తెలిసింది. పైగా రెండు జిల్లాల్లోనూ ఇక్కడ అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ నాయకులు పోటీపడి వేర్వేరుగా బరులు సిద్ధం చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేల్లో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పలువురు బడా బాబులు తరలివస్తున్నారు. మరోవైపు కోడిపందేల నిర్వహణ పై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు భోగి రోజున భీమవరంలోని తన నివాసం వద్ద సంప్రదాయ డింకీ పందేలను నిర్వహించారు.

 బెట్టింగే బెట్టింగ్...కోట్ల రూపాయల ఆదాయం...

బెట్టింగే బెట్టింగ్...కోట్ల రూపాయల ఆదాయం...

ఉభయ గోదావరి జిల్లాల్లో పండుగ మూడు రోజుల్లో 500 నుంచి 700 పందేలు జరుగుతాయి. ఒక్కో పందెం పైన రూ. 50 లక్షల నుంచి రూ.కోటి వరకు బెట్టింగ్ ఉంటుంది. ఈ లెక్కన ఇక్కడ ఒక్కచోటే రూ. 100 కోట్ల వరకు పందేలు సాగుతాయి. గన్నవరం, రాజోలు, అంబాజీపేట, అమలాపురం, ఉప్పలగుప్తం.. ఇలా కోనసీమ అంతటా కోడిపందేల జోరు ఉంటుంది. మెట్ట ప్రాంతమైన జగ్గంపేట, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్‌ అచ్చంపేట, పెద్దాపురం, తుని, పిఠాపురం, కిర్లంపూడిల్లోనూ కోడిపందేలు జరగనున్నాయి. బరుల్లో నిర్వహించే పందేలపై బరి నిర్వహిస్తున్నవారు కొంత మొత్తం నిర్వహణ ఖర్చు పేరుతో తీసుకుంటారు. ఇది సుమారు 10 శాతం వరకు ఉంటుంది.

కేసులు పెడితే ఇలా...విచిత్ర ఒప్పందం...

కేసులు పెడితే ఇలా...విచిత్ర ఒప్పందం...

కోడిపందేల నిర్వహణలో పోలీసులకు ఇబ్బంది లేకుండా ఒక విచిత్రమైన ఏర్పాటు కూడా ఉంటుంది. అదేమిటంటే...కోడిపందేల రాయుళ్లపై, బరుల నిర్వహణదారులపై పోలీసులు అడపాదడపా దాడులు చేయడం...కొందరిని అరెస్టు చేయడం, వారిపై కేసులు పెట్టడం జరుగుతుంది. అయితే ఇదంతా ముందగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. ప్రతి పందం బరికి నలుగురిని బరి నిర్వహాకులే పోలీసులకు అప్పగిస్తారు. వారిమీదే పోలీసులు కేసులు పెడతారు. ఇలా కేసులు పెట్టించుకున్నందుకు ఆ నలుగురికీ కొంత మొత్తం అందిస్తారు. వాస్తవానికి వారికే మాత్రం ఈ పందేలతో సంబంధం ఉండదంటే విచిత్రమే కదా...

కోడి పందాలను వీక్షించేందుకు...సెలబ్రిటీల నుంచి మంత్రుల వరకు...

కోడి పందాలను వీక్షించేందుకు...సెలబ్రిటీల నుంచి మంత్రుల వరకు...

ఇప్పుడు ఈ కోడి పందేలను వీక్షించడం అనేది ఓ ఫ్యాషన్ లాగా...స్టేటస్‌ సింబల్‌లాగా మారిపోయింది. దీంతో వీటిని చూసేందుకు పలువురు విఐపిలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలోనే తరలివస్తున్నారు. అలాగే ఈసారి తెలంగాణ నుంచి ఒకరిద్దరు మంత్రులు కూడా భీమవరం ప్రాంతానికి రానున్నట్లు తెలిసింది. ఇక రాష్ట్రానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నేతల సంగతి చెప్పనక్కర్లేదు. టీవీ నటుల నుంచి సినీ నటుల వరకు పలువురు పందాలకు హాజరవడం కామనైపోయింది. వీరందరి కోసం ఇక్కడ వీఐపీ ఏసీ లాంజ్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో...ఇలా సెలబ్రిటీలు ఎక్కడికి రావాలన్నది కూడా ముందే డిసైడ్‌ అయిపోయింది. ఎక్కడ బాగా పందేలు నిర్వహిస్తారు? ఎక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి? ఎక్కడ పోలీసులతో ఇబ్బందులు ఉండవనే అంశాన్ని ఆధారం చేసుకుని వారు అక్కడకు వెళ్తారు...ఇదండీ మన కోడి పందాల స్టయిల్....

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amaravathi: On the first day of the three-day Sankranti festival, cockfights were organised on a large scale in dozens of villages in Guntur, Krishna, West Godavari and East Godavari district of coastal Andhra. Crores of rupees were bet on cockfights which began in parts of Andhra Pradesh on Friday despite court orders banning them and warnings by police.Punters including businessmen and Non-Resident Indians (NRIs) visiting their homes for the festival bet crores of rupees.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి