Srisailam: భక్తుల ఆగ్రహ జ్వాల, సీఎం సీరియస్!
శ్రీశైల మహాక్షేత్రం ఈ రోజుల్లో భక్తుల నిట్టూర్పులు, ఆగ్రహ నినాదాలతో మార్మోగుతోంది. పవిత్ర దర్శనానికి వచ్చిన శివస్వాములకు ఇది ఆధ్యాత్మిక అనుభూతిగా కాకుండా, ఓ బాధాకర పరీక్షగా మారింది. అటవీ శాఖ తీసుకున్న అనూహ్య నిర్ణయాలు, సమన్వయ లోపం కలిసి శ్రీశైలాన్ని ఉద్రిక్తతల కేంద్రంగా మార్చేశాయి. పులుల గణన పేరుతో వెంకటాపురం నడకదారిపై విధించిన ఆంక్షలు ఇప్పుడు భక్తుల సహనాన్ని పూర్తిగా కూల్చేశాయి.
ముందస్తు ప్రణాళిక లేకుండా, పరిమిత రోజుల్లోనే అనుమతులు ఇవ్వడంతో వేలాది మంది భక్తులు ఒక్కసారిగా వెంకటాపురం మార్గానికి తరలివచ్చారు. ఫలితంగా క్యూలైన్లు కదలకుండా నిలిచిపోయాయి. గంటల తరబడి ఎండలో నిలబడిన శివస్వాములు అస్వస్థతకు గురవుతుండగా, తాగునీరు, కనీస వసతులు కూడా అందకపోవడం ఆవేదనను మరింత పెంచింది. "శివుడి దర్శనం కోసం వచ్చాం... కానీ ఇక్కడ నరకం చూస్తున్నాం" అంటూ భక్తులు కన్నీళ్లతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సమన్వయం లేక..
15వ తేదీ తర్వాత దోర్నాల మార్గంలోనే వెళ్లాలన్న నిబంధన భక్తులకు మరింత భారంగా మారింది. అదనంగా 60 కిలోమీటర్ల ప్రయాణం తప్పదని తెలిసి, ఆ దూరం తప్పించుకునేందుకే భక్తులంతా వెంకటాపురం మార్గానికే ఎగబడ్డారు. ఈ గందరగోళానికి అధికారుల మధ్య స్పష్టమైన సమన్వయం లేకపోవడమే కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. "ముందే ప్లాన్ చేసి ఉంటే ఇంత రద్దీ, ఇంత అవమానం ఉండేదా?" అన్న ప్రశ్నలు అక్కడ ప్రతిధ్వనిస్తున్నాయి.
పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా..
ఇదే సమయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం వచ్చిన భక్తుల రద్దీ పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. సాధారణ భక్తులు, శివదీక్షా భక్తులతో ఆలయ క్యూ కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనానికి తెల్లవారుజామున 2 గంటల నుంచే చంద్రావతి కల్యాణ మండపంలో ఎదురు చూస్తున్న శివదీక్షా భక్తులకు ఉదయం 10 గంటలైనా దర్శనం జరగలేదు. క్యూలైన్లు నిలిచిపోవడంతో భక్తుల సహనం తెగిపోయింది.
చంద్రావతి కల్యాణ మండపం వైపు నుంచి శివదీక్షా భక్తులు, పుష్కరిణి ఇనుప గేటు వద్ద నుంచి సాధారణ భక్తులు ఒకేసారి గేట్లపైకి ఎక్కి కృష్ణదేవరాయ గోపురం వైపు దూసుకురావడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. వందలాది మంది భక్తులు ఇనుప గేటును బలవంతంగా నెట్టేసి ఆలయంలోకి చొచ్చుకెళ్లారు. యంత్రాంగం వారిని అడ్డుకోలేని పరిస్థితి నెలకొంది. సాయంత్రం 5 గంటల వరకూ ఉద్రిక్తత కొనసాగడం గమనార్హం.
భక్తుల ఆగ్రహాన్ని తారాస్థాయికి..
ఈ క్రమంలో గోపురం వద్ద బైఠాయించిన భక్తులు దేవస్థానం ఈవో, ఛైర్మన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "ఇది దేవాలయమా? శిక్షణ శిబిరమా?" అంటూ ప్రశ్నించారు. స్పర్శ దర్శనంలో జరుగుతున్న ఆలస్యం భక్తుల ఆగ్రహాన్ని తారాస్థాయికి చేర్చింది.
భక్తులపై లాఠీచార్జ్..
అంతలో ఏఎస్పీ యుగంధర్‌బాబు తన సిబ్బందితో అక్కడికి చేరుకుని శివదీక్షా భక్తులపై లాఠీచార్జ్ చేయడం పరిస్థితిని మరింత విషమం చేసింది. దీక్షలో ఉన్న భక్తులపై బలప్రయోగం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. "శివుడి నామం జపిస్తూ వచ్చిన మాపై దాడి చేయడమేనా సమాధానం?" అంటూ భక్తులు అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. ఏఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రీశైలంలో దర్శనానికి వచ్చిన భక్తుల మనసుల్లో ఇప్పుడు భక్తి కంటే భయం, ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. పవిత్ర క్షేత్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం శివభక్తుల్లో తీవ్ర ఆవేదనను కలిగిస్తోంది. పరిస్థితి వెంటనే అదుపులోకి రాకపోతే, శ్రీశైల మహాక్షేత్రంలో ఉద్రిక్తత మరింత ముదిరే ప్రమాదం ఉందన్న ఆందోళన భక్తుల మాటల్లో స్పష్టంగా వినిపిస్తోంది.
ఇదీ శ్రీశైలం ఆలయంలో భక్తుల దుస్థితి
— Eshwar Vishnubhotla (@Eswarkarthikeya) February 10, 2026
స్వామి దర్శనం లేక,Q లలో సౌకర్యాలు లేక మహిళలు పిల్లలు వృద్ధులు పడుతున్న అవస్థ..
అధికారులు ఏం చేస్తున్నారు? ఎక్కడ చచ్చారు? అదుపు చెయ్యాల్సిన పోలీసులు భక్తులపై దీక్షాథారులపై లాఠీలు ఝళిపించారు.. #Srisailampic.twitter.com/xPZ8gKxWeZ
సీఎం సమీక్ష..
శ్రీశైలం సహా రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతుల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఢిల్లీ నుంచే మంత్రులు, ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు ఉన్నతాధికారులతో శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తులకు అందుతున్న సౌకర్యాలు, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను సీఎం పరిశీలించారు. శివరాత్రి నాటికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటూ, ముందస్తు ప్రణాళికతో పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తగిన వసతి సౌకర్యాలు కల్పించేలా స్పష్టమైన కార్యాచరణ అమలు చేయాలని సీఎం సూచించారు. దీక్షలు, మాలధారణలతో కష్టపడి వచ్చే శివభక్తులను అవమానించేలా ఎవరు వ్యవహరించకూడదని స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోం మంత్రి అనిత ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లను పర్యవేక్షించాలని, మహాశివరాత్రి వంటి కీలక సందర్భాల్లో అన్ని విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు ఆదేశాలు జారీ చేశారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications