interest rates deposits employees epfo fund withdraw central government ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లు ఉద్యోగులు ఉపసంహరణ కేంద్ర ప్రభుత్వం
ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5 శాతంగా కేంద్రం ప్రకటన .. గతేడాది ఉన్న వడ్డీ రేటే యధాతథం
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ వడ్డీరేట్లను కేంద్ర సర్కార్ నిర్ధారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీరేటును 8.5 శాతంగా నిర్ణయించింది కేంద్ర సర్కార్. ఈరోజు శ్రీ నగర్ లో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

గత ఏడాది వడ్డీ రేటునే కొనసాగిస్తూ ఈపీఎఫ్ విషయంలో కేంద్ర నిర్ణయం
గత 2019-2020 ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించినట్లుగానే ,ఈ యేడాది కూడా వడ్డీ రేటుని యధాతధంగా ఉంచామని కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు.
కరోనా మహమ్మారి దృష్ట్యా ఉత్పన్నమైన పరిస్థితులతో ఈ దఫా వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందన్న ప్రచారం తొలుత జరిగినా, గత ఏడాది ఉన్న వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఆరు కోట్లమంది పీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనున్నట్లుగా తెలుస్తుంది.

కరోనా కారణంగా భారీగా ఈపీఎఫ్ నగదు ఉపసంహరణ ... ఈ ఏడు కూడా కొనసాగే ఛాన్స్
ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులు భారీగా తమ ఖాతాల నుండి ప్రావిడెంట్ ఫండ్ నగదును ఉపసంహరించుకున్నారు. అంతేకాదు డిపాజిట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. గత ఏడాది డిసెంబర్ వరకు దాదాపు రెండు కోట్ల మంది ఈపీఎఫ్ఓ ఖాతాదారులు 73 వేల కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారని ఒక అంచనా. 2020-2021 లో కూడా అంతకు మించిన స్థాయిలో ఉపసంహరణలు ఉండొచ్చని కూడా భావిస్తున్నారు.

2019-20 సంవత్సరానికి ఏడు సంవత్సరాల కనిష్టానికి తగ్గిన వడ్డీ రేటు
ఇదిలా ఉంటే 2018 -2019 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ రేటును ఇచ్చింది. ఇక 2019 2020 ఆర్థిక సంవత్సరానికిగానూ వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.5% గా నిర్ణయించింది. ప్రస్తుతం 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గత సంవత్సరం ఉన్న వడ్డీ రేటునే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్. గత సంవత్సరం, 2020 మార్చిలో, ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2019-20 సంవత్సరానికి ఏడు సంవత్సరాల కనిష్టానికి 8.5 శాతానికి తగ్గించింది .