వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమెన్స్ సేఫ్టీ హబ్: సోషల్ మీడియా వేదికలు ఇక మహిళలకు సురక్షితంగా మారనున్నాయా - 10 పాయింట్లలో తెలుసుకోండి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఫేస్‌బుక్‌లో మహిళల భద్రత కోసం 'విమెన్స్ సేఫ్టీ హబ్‌’ను భారతీయ భాషల్లోనూ ప్రవేశపెడుతున్నట్లు మెటా సంస్థ ప్రకటించింది.

ఇంతకీ 'విమెన్స్ సేఫ్టీ హబ్’ అంటే ఏమిటి? దీంతో ఫేస్‌బుక్ మహిళలకు సురక్షిత సామాజిక మాధ్యమంగా మారుతుందా? మహిళలు ఎదుర్కొనే వేధింపులకు అడ్డుకట్ట పడుతుందా?

1) విమెన్స్ సేఫ్టీ హబ్ అంటే ఏమిటి?

ఫేస్ బుక్, ఇన్‌స్టా‌గ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికలు మహిళలకు సురక్షితంగా ఉండేలా మెటా సంస్థ ఈ విమెన్స్ సేఫ్టీ హబ్‌ను ప్రవేశపెట్టింది. ఈ హబ్ ద్వారా మహిళలు సురక్షితంగా ఉండేందుకు ఉపయోగపడే సమాచారాన్ని పొందుపరిచింది. మహిళలకు కూడా ఆన్‌లైన్ మాధ్యమాలు సురక్షితంగా ఉండేందుకు అవసరమైన చర్యలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.

సోషల్ మీడియా వేదికలను వేధింపులు లేని మాధ్యమాలుగా చేయాల్సిన అవసరాన్ని గుర్తించామని ఫేస్‌బుక్ అంటోంది.

మహిళలను ఆన్‌లైన్‌లో వేధింపుల నుంచి రక్షించేందుకు అవసరమైన టూల్స్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200కి పైగా సంస్థలు, నిపుణులతో చర్చించి విమెన్స్ సేఫ్టీ అడ్వైజర్లను నియమించింది. ఇందులో, ఆస్ట్రేలియా, బ్రెజిల్, హాంగ్‌కాంగ్, ఇండోనేసియా తదితర దేశాలకు చెందిన నిపుణులు ఉన్నారు.

30 కోట్ల మంది వినియోగదారులు ఉన్న భారత్ నుంచి మాత్రం నిపుణులు ఎవరికీ ఈ బృందంలో చోటు కల్పించలేదు.

అయితే, క్రమేపీ ఇతర దేశాల నుంచి కూడా నిపుణులను ఈ సలహా బృందంలో చేర్చుతామని ఫేస్‌బుక్ చెబుతోంది.

మహిళలు ఏదైనా సామాజిక, రాజకీయ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు వారు అనేక రకాల వేధింపులను ఎదుర్కొంటారు

2) సోషల్ మీడియాలో సాధారణంగా మహిళలు ఎదుర్కొనే సమస్యలేంటి?

ముఖ్యంగా మహిళలు ఏదైనా సామాజిక, రాజకీయ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు వారు అనేక రకాల వేధింపులను ఎదుర్కొంటారు. ఇది మహిళలకు మాత్రమే పరిమితం కాదు.

తేజస్విని పగడాల ఒక కమ్యూనికేషన్స్ ప్రొఫెషనల్, రచయిత. ఆమె ఆన్‌లైన్‌లో వ్యక్తపరిచిన అభిప్రాయాలకు తరచుగా ట్రోలింగ్‌కు గురవుతూ ఉంటారు. ఆ ట్రోలింగ్ ఆమె వ్యక్తపరిచిన అభిప్రాయానికి పరిమితమై ఉండదు.

తాను సోషల్ మీడియాలో ఎదుర్కొనే వేధింపుల గురించి ఆమె బీబీసీకి వివరించారు.

''ఆ వ్యక్తికి సామర్థ్యం ఉంది. భాష కాస్త మార్చుకుంటే బాగుంటుంది" అని సోషల్ మీడియా వేదికగా ఓ రాజకీయ నాయకుడికి సూచన ఇచ్చాను".

"ఇక అంతే.. ట్రోలింగ్ మొదలయింది. ఆ ట్రోలింగ్ నా అభిప్రాయానికి పరిమితం కాలేదు".

"నువ్వొక పిచ్చిదానివి, నీకొక పార్టీతో సంబంధం ఉంది. నువ్వొక పెయిడ్ ఆర్టిస్ట్‌వి. పార్టీలోని ప్రముఖులతో సంబంధం ఉంది’’ అంటూ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ దాడి ప్రారంభించారు. నా కులం తెలియకపోయినా నాకొక కులాన్ని ఆపాదించారు" అని తేజస్విని చెప్పారు.

"బూతులు తిడతారు. కొన్నిటికి అర్థాలు కూడా తెలియవు. నా ఉనికిని ప్రశ్నిస్తారు. వ్యక్తిత్వాన్ని పూర్తిగా కించపరుస్తారు".

"కామెంట్లను పట్టించుకోకపోతే, మెసేజ్‌లు పంపి నన్ను బెదిరిస్తూ ఉంటారు. ఇది చాలా వేదన కలిగించే విషయం. కానీ, నేను కూడా చాలా సార్లు వాళ్ల ప్రొఫైల్స్‌ను రిపోర్ట్ చేసి ప్రతిఘటిస్తూ ఉంటాను" అని చెప్పారు.

ఈ వేధింపులను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఒకే రకమైన సరళిలో ఉంటాయని అన్నారు. ఇందులో అభిప్రాయ వ్యక్తీకరణ కంటే దాడి చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఉంటుందని చెప్పారు.

ఫేస్ బుక్

3) సేఫ్టీ హబ్ పాలసీ ఈ వేధింపులకు అంతం పలుకుతుందా?

ఫేస్‌బుక్‌లో ఏం మాట్లాడవచ్చు, ఏం మాట్లాడకూడదు అనే అంశాలను ఫేస్‌బుక్ కమ్యూనిటీ స్టాండర్డ్స్ నియమావళి సూచిస్తోంది.

దీంతో పాటు, సురక్షితంగా ఉండేందుకు సేఫ్టీ హబ్‌లో కొన్ని టూల్స్‌ను పొందుపరిచి అకౌంట్‌ను ప్రొటెక్ట్ చేసుకోమని, ఇబ్బంది పెడుతున్నవారి అకౌంట్లను బ్లాక్ చేయమని సూచిస్తోంది.

మహిళలపై ప్రభావం చూపించే ప్రవర్తన నియమావళికి వ్యతిరేకం.

ఈ నియమాలను అనుసరించి ఎవరైనా సదరు మహిళల అంగీకారం లేకుండా వారు ఎవరితోనైనా సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేసినా, వేధింపులకు గురిచేసినా, అభ్యంతరకరమైన సందేశాలు పంపినా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

ఫేస్ బుక్

4) ఫేస్‌బుక్ చెబుతున్న కమ్యూనిటీ స్టాండర్డ్స్‌లో ఏం ఉంది

యూజర్లు వ్యక్తం చేసే అభిప్రాయాలలో నిజం ఉండాలి. ఇతరులను బెదిరించడం, నోరు మూయించే పనులు చేసి, వేర్పాటువాదంతో ప్రవర్తించడాన్ని అంగీకరించదు. వ్యక్తుల గోప్యతకు ప్రాధాన్యం ఇస్తాం.

వ్యక్తులు హుందాగా ప్రవర్తించాలని, ఇతరుల ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తించరాదని అని ఫేస్‌బుక్ విలువలు చెబుతున్నాయి.

అసభ్యకర కామెంట్లు చేసే యూజర్లపై ఫేస్‌బుక్ చర్యలు తీసుకుంటుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.

"చాలాసార్లు నాపై జరుగుతున్న దాడి గురించి రిపోర్ట్ చేసినప్పుడు ఫేస్‌బుక్ స్పందించలేదు. గతంలో విద్వేషపూరిత కామెంట్లను, వేధింపులను ఫేస్‌బుక్ యాజమాన్యానికి రిపోర్ట్ చేసినప్పుడు,ఇది మా కమ్యూనిటీ నియమావళికి అనుగుణంగానే ఉందనే సమాధానం వచ్చేది. ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదంటూ సదరు ఫిర్యాదులపై స్పందించేది. ట్విటర్ మాత్రం కొన్ని సార్లు అకౌంట్‌లను డీయాక్టివేట్ చేసింది" అని తేజస్విని చెప్పారు.

ఇలాంటి కామెంట్లను ఫేస్‌బుక్ సాధారణంగా పట్టించుకోదని, భాష కూడా అందుకు సవాలుగా నిలుస్తుందని తేజస్విని అన్నారు.

అయితే, ఫేస్‌బుక్ విమెన్స్ సేఫ్టీ‌హబ్‌ను హిందీతో పాటు మరో 11 భారతీయ భాషల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది.

పాత నియమావళినే ఫేస్‌బుక్ కొత్తగా ప్యాకేజీ చేసి ఇస్తోందని, దీని వల్ల కొత్తగా చేకూరే లాభం ఏమి లేదని టెక్ నిపుణులు శ్రీధర్ నల్లమోతు అంటున్నారు.

facebook protect

5) కమ్యూనిటీ స్టాండర్డ్స్ ఇంకేమి చెబుతున్నాయి?

  • హింసాత్మక, నేర ప్రవృత్తితో కూడుకున్న ప్రవర్తన , మోసపూరిత చర్యలు, నేరాలను ప్రేరేపించే ప్రవర్తన,
  • ఆత్మహత్యకు, స్వీయ హానికి దారి తీసే ప్రవర్తన, పిల్లల పై లైంగిక వేధింపులు, వేధింపులు, ఎగతాళి చేయడం,
  • గోప్యతకు భంగం కలిగించే పనులు, ద్వేషపూరిత, హింసను ప్రేరేపించే కంటెంట్ పోస్ట్ చేయడం,
  • అసభ్యకర ఫోటోలు షేర్ చేయడం లాంటివి ఫేస్ బుక్ కమ్యూనిటీ స్టాండర్డ్స్‌ను ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొంటున్నారు.

అకౌంట్ విషయంలో యూజర్లు పొందుపరిచిన సమాచారం, అనుచిత ప్రవర్తన, తప్పుడు సమాచారాన్నివ్వడం, మేధోసంపత్తిని గౌరవించకపోవడం కూడా వీటి పరిధిలోకి వస్తాయి.

"సాధారణంగా ట్రోలింగ్ చేసేవారు, భయపెట్టే విధంగా కామెంట్లు చేసి, సందేశాలు పంపించే వారి వివరాలు పారదర్శకంగా ఉండవు. చాలా అకౌంట్లు మారు పేర్లతో, ఏదైనా ఒక వర్గానికి అభిమానాన్ని ప్రకటిస్తున్నట్లుగా సూచించే పేర్లతో, అతి తక్కువ మంది ఫాలోవర్లతో, ఒక్కొక్కసారి 0 ఫాలోవర్లతో ట్రోలింగ్ కోసమే సృష్టించిన అకౌంట్లలా ఉంటాయి" అని తేజస్విని చెప్పారు.

అలాంటి సమయంలో ఫేస్‌బుక్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

యూజర్ల నుంచి వచ్చిన అభ్యర్థనలను కూడా పరిశీలించి పిల్లలకు మరింత భద్రతను కల్పిస్తామని ఫేస్‌బుక్ కమ్యూనిటీ స్టాండర్డ్స్ చెబుతున్నాయి.

ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి ప్లాట్‌ఫామ్‌లపై పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతోంది

6) ఫేస్‌బుక్ వీటిని ఎలా పరిశీలిస్తుంది?

ఫేస్‌బుక్ విధానాలను అమలు చేయడంతో పాటు, కమ్యూనిటీ స్టాండర్డ్స్‌ను ఉల్లంఘించే విధంగా ఉన్న సమాచారాన్ని స్వయంగా కనిపెట్టేందుకు కొత్త సాంకేతికతను అమలులోకి తెస్తున్నట్లు మెటా సంస్థ ప్రకటించింది.

ఈ విధానాల అమలు చేస్తున్న తీరును, ఈ విషయంలో కొనసాగుతున్న అభివృద్ధిని అంచనా వేసేందుకు మూడు నెలలకొకసారి కమ్యూనిటీ స్టాండర్డ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్‌ను ప్రచురిస్తామని చెబుతోంది.

ఫేస్‌బుక్ పాలసీ పబ్లిక్, ప్రైవేటు వ్యక్తులకు కూడా వర్తిస్తుందని చెబుతోంది. కానీ, వార్తల్లో వచ్చిన విషయాలపైన, లేదా ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న అకౌంట్లపై వ్యక్తమయ్యే ప్రజాభిప్రాయాన్ని అనుమతిస్తామని చెబుతోంది. అయితే, ఈ చర్చ ఫేస్‌బుక్ కమ్యూనిటీ స్టాండర్డ్స్‌కు లోబడి ఉండాలని చెబుతోంది.

ప్రముఖుల విషయంలో ఎవరైనా నియమాలను ఉల్లంఘించి ద్వేషపూరిత ప్రసంగాలు చేసినా, ముప్పు కలిగించే బెదిరింపులు చేసినా అటువంటి సమాచారాన్ని తొలగిస్తామని చెబుతోంది.

ఈ నియమాలు ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ ఆపరేట్ చేస్తున్న అన్ని దేశాలకూ వర్తిస్తాయి.

"అది ప్రజాభిప్రాయమా? ట్రోలర్ల అభిప్రాయమా" అని కొంత మంది తరచుగా ట్రోలింగ్‌కు గురయ్యే యూజర్లు ప్రశ్నిస్తున్నారు. చర్చకు అనుమతిస్తామనే పేరుతో ట్రోలింగ్‌కు అనుమతిస్తారేమో అనే సందేహాన్ని యూజర్లు వ్యక్తం చేస్తున్నారు.

7) మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే కామెంట్లు చేసే యూజర్లపై ఫేస్‌బుక్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?

ఏక్తా ఫేస్‌బుక్‌లో ఇన్విజిబుల్ స్కార్స్ అనే పేజీని నిర్వహిస్తున్నారు. ఈ పేజీ ద్వారా ఆమె గృహ హింసకు గురైన బాధితులకు సహాయం చేస్తూ ఉంటారు.

ఇటీవల ఆమె పెట్టిన ఒక పోస్టుకు ఓ యూజర్ స్పందిస్తూ, "నీ చుట్టూ ఒక ప్రతికూల వాతావరణం అలముకుని ఉంటుంది, నువ్వు చేసే పనిని ఆపు. నేను నీకొక సలహా ఇస్తున్నాను. నువ్వు చేసే పనే నీకు వేదన కలిగిస్తుంది" అని కామెంట్ చేసినట్లు చెప్పారు.

"నా వ్యక్తిత్వంపై తీర్పునిచ్చే హక్కు ఆయనకెవరిచ్చారు? సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ మాపై హక్కు ఉన్నట్లు ఎలా మాట్లాడతారు?" అని ఆమె ప్రశ్నించారు.

ఆమె ఆ కామెంట్ గురించి ఫేస్‌బుక్‌కు రిపోర్ట్ చేసి, సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు.

"కొన్ని అకౌంట్లయితే బ్లాక్ చేయగలం. కొన్ని వందల అకౌంట్లను ఎలా బ్లాక్ చేయగలం" అని తేజస్విని ప్రశ్నించారు.

ఎవరితోనైనా సన్నిహితంగా ఉన్న ఫోటోలను మీ అనుమతి లేకుండా షేర్ చేసినప్పుడు, రిపోర్ట్ లేదా ఫిర్యాదు చేయమని ఫేస్ బుక్ సేఫ్టీ హబ్ నియమావళి చెబుతోంది.

8) ఈ నియమావళి సాధారణ ఫోటోలకూ వర్తిస్తుందా?

ఈ విషయం గురించి తెలుసుకునేందుకు బీబీసీ ఫేస్‌బుక్‌ను సంప్రదించింది. దీనిపై ఫేస్‌బుక్ నుంచి ఎటువంటి సమాధానం లభించలేదు.

కాకపొతే, అంగీకారం లేకుండా సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఎవరైనా షేర్ చేసినప్పుడు StopNCII.org ను సంప్రదించమని ఫేస్‌బుక్ సూచిస్తోంది.

9. ఇక వేధింపులు ఆగిపోతాయా?

ఫేస్‌బుక్ గతంలో కూడా అభ్యంతరకర కంటెంట్ రిపోర్ట్ చేసేందుకు అవకాశం కల్పించింది. ఇదేమి కొత్తగా అమలు చేసిన ఆప్షన్ కాదని నిపుణులు చెబుతున్నారు.

"ప్రస్తుతం ప్రవేశపెట్టిన నియమావళిని ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఎక్కడా పొందుపరచలేదు" అని చెబుతున్నారు.

ఆరోగ్యం

10) వేధింపులను ఫేస్‌బుక్ పట్టించుకోకపోతే ఏం చేయాలి?

సాధారణంగా ఆన్‌లైన్ వేధింపుల గురించి సైబర్ క్రైం విభాగంలో నమోదు చేయవచ్చని చెబుతారు.

కానీ, చాలా సార్లు వేధింపుల గురించి ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైం విభాగంలో రిపోర్ట్ చేసినప్పుడు, తాను ఆంధ్రప్రదేశ్ నివాసిని కాదు కాబట్టి ఫిర్యాదు తీసుకోబోమంటూ కేసులు నమోదు చేసేవారు కాదని తేజస్విని వివరించారు. సైబర్ ఫిర్యాదులకు ప్రాంతంతో సంబంధం ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారు.

"మౌనంగా ఉండవచ్చు కదా అని కొంత మంది స్నేహితులు సలహా ఇస్తారు. కానీ, నేనే ఒక కమ్యూనికేషన్స్ ప్రొఫెషనల్ అయినప్పుడు, సోషల్ మీడియాలో నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా ఎలా ఉండగలను" అని ఆమె ప్రశ్నించారు.

"ఏదైనా కంటెంట్ రిపోర్ట్ చేసినప్పుడు ఫేస్ బుక్ కేవలం వారి కమ్యూనిటీ స్టాండర్డ్స్ అనే బ్లాక్ & వైట్ గీతల్లో మాత్రమే కాకుండా, సదరు కామెంట్లు ఒక వ్యక్తికి కలిగించే మానసిక వేదనను కూడా పరిగణించాలి. అందుకు వారు భాషను అర్ధం చేసుకోవడం కూడా అవసరం" అని తేజస్విని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Women's Safety Hub: Find out in 10 points whether social media platforms are becoming safer for women anymore
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X