పోలీసుల ట్రాఫిక్ చలాన్ల ఎఫెక్ట్: మూడు నెలల పసికందు మృతి; పోలీసుల వివరణ ఇదే!!
ట్రాఫిక్ చలాన్ ల వసూళ్ళలో భాగంగా పోలీసులు వాహనాలను ఆపి చలాన్ల క్లియరెన్స్ కోసం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే చలాన్ల వసూళ్ళలో భాగంగా పోలీసుల తీరుతో మానవత్వం మంటగలిసింది. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా మూడు నెలల బాబు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం ట్రాఫిక్ పోలీసుల వల్ల వంగపల్లి సమీపంలో మంగళవారం జరిగిన ఘటన ఓ శిశువు ప్రాణాలు బలిగొంది.

పసికందుకు తీవ్ర అనారోగ్యం.. వైద్యం కోసం ఆస్పత్రికి దంపతుల ప్రయాణం
తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం జనగామ జిల్లా జనగామ మండలం మరిపగి గ్రామానికి చెందిన మచ్చ మల్లేష్, సరస్వతి దంపతులకు మూడు నెలల క్రితం ఒక కుమారుడు జన్మించాడు. కొద్ది రోజులుగా శిశువు పాలు తాగడం లేదు. దీంతో జనగామ లోని ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు తల్లిదండ్రులు. అయితే మంగళవారం చిన్నారికి పరీక్షలు నిర్వహించిన జనగామ వైద్యులు బాబు పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ తీసుకు వెళ్లాలని సూచించారు.

కారుపై చలాన్లు ఉన్నాయని ఆపిన ట్రాఫిక్ పోలీసులు, ఆస్పత్రికి వెళ్ళటంలో జాప్యం
దీంతో వారు ఓ కారును అద్దెకు తీసుకొని హైదరాబాద్ బయలుదేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి గ్రామం సమీపంలోకి రాగానే స్థానిక ట్రాఫిక్ పోలీసులు కారును ఆపారు. కారుపై పదకొండు వందల రూపాయల చలానాలు పెండింగ్ ఉన్నాయని, వాటిని చెల్లిస్తేనే విడిచి పెడతామని పోలీసులు చెప్పారు. తమ బిడ్డ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పినా పట్టించుకోకుండా పోలీసులు చలానా కట్టి కార్ తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో సమీపంలో ఉన్న మీసేవ కి వెళ్లి చలానా కట్టి రావడానికి 30 నిమిషాలకు పైగా సమయం పట్టింది.

సకాలంలో బాబును తీసుకురాని కారణంగా శిశువు మృతి.. పోలీసులపై బాధితుల మండిపాటు
ఆ తర్వాత హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకు వెళ్ళిన తల్లిదండ్రులకు బిడ్డను తీసుకు రావడంలో జాప్యం జరిగిన కారణంగా బిడ్డ మృతి చెందాడని వైద్యులు చెప్పారు. బిడ్డను బ్రతికించుకోవాలని తాపత్రయపడిన ఆ తల్లిదండ్రులకు బిడ్డ మృతితో తీవ్ర మనోవేదన మిగిలింది. దీంతో తమ బిడ్డ మృతికి పోలీసులే కారణమంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు ఆరోగ్యం బాగోలేదు అని చెప్పినా కూడా పోలీసులు పరిష్కరించలేదని వాపోతున్నారు. పోలీసుల కారణంగానే తమ బిడ్డ మృతిచెందాడని వారు ఆరోపిస్తున్నారు.

స్పందించిన పోలీసులు .. శిశువు మృతి ఘటనపై వివరణ
ఇదిలా ఉంటే ఈ ఘటనపై స్పందించిన పోలీసులు తమ సిబ్బంది జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారని, అయితే బాబు అనారోగ్యంతో ఉన్నాడని, ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని ఎవరూ తమ దృష్టికి తీసుకు రాలేదని చెబుతున్నారు. శిశువును ఎవరు ఏ కారులో తెచ్చారో ఎవరికీ తెలియదని, ఆపదలో ఉంటే వేరే కారులో అయినా పంపి ఉండే వారిమని వెల్లడించారు. ఈ ఘటనలో తమ సిబ్బంది నిర్లక్ష్యం ఏమాత్రం లేదని పోలీసులు వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications